మోదీకి టీడీపీ స్క్రిప్ట్ ఇస్తుంద‌ట‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సోమ‌వారం ప్ర‌ధాని మోదీ ఎన్నిక‌ల ప్ర‌చారం చేయ‌నున్నారు. ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి, సీఎం ర‌మేశ్‌నాయుడు పోటీ చేయ‌నున్న రాజ‌మండ్రి, అన‌కాప‌ల్లి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏర్పాటు చేసిన ఎన్నిక‌ల స‌భ‌ల్లో మోదీ పాల్గొన‌నున్నారు. మోదీ ఏం మాట్లాడ్తార‌నే అంశంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కుంది. గ‌తంలో చిల‌క‌లూరిపేట‌లో నిర్వ‌హించిన స‌భ‌లో సీఎం జ‌గ‌న్‌పై ఒక్క‌టంటే ఒక్క విమ‌ర్శ కూడా మోదీ చేయ‌లేదు.

దీంతో టీడీపీ, జ‌న‌సేన నేత‌లు ఖంగుతిన్నారు. ఇంకా జ‌గ‌న్‌పై మోదీ అభిమానంతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆ రెండు పార్టీల నాయ‌కులు అనుమానిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇవాళ్టి మోదీ ప్ర‌చారం ప్రాధాన్యం సంత‌రించుకుంది. క‌నీసం ఇప్పుడైనా జ‌గ‌న్‌పై మోదీ తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తార‌ని టీడీపీ, జ‌న‌సేన నాయ‌కులు ఆశ‌తో ఎదురు చూస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ఇచ్చిన‌ట్టుగా, తామే ఎన్నిక‌ల ప్ర‌సంగ పాఠం మోదీకి కూడా ఇస్తామ‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు.

రాష్ట్రంలో జ‌గ‌న్ హ‌యాంలో సాగిన విధ్వంసాన్ని మోదీతో త‌ప్ప‌నిసరిగా చెప్పిస్తామ‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. గ‌తంలో మోదీతో ఏం మాట్లాడించాల‌నే విష‌యంలో జ‌రిగిన త‌ప్పును పున‌రావృతం కానివ్వ‌మ‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తి, వీలైతే ఎన్నిక‌ల మేనిఫెస్టో అమ‌లుకు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని మోదీతో మాట్లాడించాల‌ని టీడీపీ ప‌ట్టుద‌ల‌తో వుంది. అయితే టీడీపీ నేత‌లు కోరుకున్న‌ట్టు మాట్లాడేందుకు మోదీ ఏ మేర‌కు అంగీక‌రిస్తార‌నేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌గ‌న్‌పై మోదీ ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌లేదు.

ఇటీవ‌ల జ‌గ‌న్ అనుకూల‌, వ్య‌తిరేక మీడియా ప్ర‌తినిధులకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మోదీ... ఏపీ విష‌యంలో సానుకూల దృక్ప‌థంతోనే మాట్లాడారు. ఇటు కూట‌మిని ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించ‌డం, ప్ర‌త్య‌ర్థి అయిన వైసీపీపై విమ‌ర్శ‌లు చేయ‌డం లాంటి వాటికి ప్ర‌ధాని మోదీ దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌చ్చి, ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో  అలా వుండ‌డం మోదీకి సాధ్య‌మా? అనేదిప్పుడు ప్ర‌శ్న‌. టీడీపీ, జ‌న‌సేన కోరుకుంటున్న‌ట్టు జ‌గ‌న్‌పై ఏ మేర‌కు రాజ‌కీయ దాడి చేస్తారో చూడాలి. 

Readmore!

Show comments