నేను బుడ్డాగాడ్ని.. వెంకటేష్ ని కూడా పట్టించుకోరా?

ఎప్పుడో బాబు బంగారం నాటి మేటర్ ఇది. మారుతి-వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన ఆ సినిమాపై అప్పట్లో ఓ చిన్న వివాదం జరిగింది. హీరోయిన్ నయనతార షూటింగ్ కు రావడం లేదని, యూనిట్ కు సహకరించడం లేదంటూ కథనాలు వచ్చాయి. మరోవైపు దర్శకుడు మారుతి, హీరోయిన్ నయనతారకు మధ్య విబేధాలు కూడా వచ్చాయంటూ పుకార్లు వచ్చాయి. వీటిపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చాడు మారుతి. 

"అవును.. నాకు, నయనతారకు అప్పట్లో పడలేదు. ఓ విషయంపై ఆమెను నేను ప్రశ్నించాను. అదే మా ఇద్దరి మధ్య అభిప్రాయబేధానికి కారణం. తరచుగా ఆమె షూటింగ్ కు ఆలస్యంగా వచ్చేవారు. దానిపై నేను క్వశ్చన్ చేయలేదు. నేను బుడ్డాగాడ్ని, నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు. ఎంతో సీనియర్ అయిన వెంకటేష్ కు కూడా గౌరవం ఇవ్వకపోతే ఎలా. ఇదే విషయంపై నయనతారను నేను ప్రశ్నించాను."

వెంకటేష్ కు రెస్పెక్ట్ ఇవ్వకపోవడంపై తను నయనతారను కాస్త గట్టిగానే ప్రశ్నించానని, అది మనసులో పెట్టుకొని ఆమె చాలారోజులు షూటింగ్ రాలేదని చెప్పుకొచ్చాడు మారుతి. కొన్ని రోజులు షూటింగ్ ఆలస్యమైందనే విషయాన్ని పక్కనపెడితే, ఆ ఘటనపై తనకు ఎలాంటి బాధ లేదన్నాడు. 

పరిశ్రమకు చెందిన కొందరు పెద్దలు జోక్యం చేసుకొని ఎట్టకేలకు నయనతారను తిరిగి షూటింగ్ స్పాట్ కు తీసుకొచ్చారని మారుతి స్పష్టంచేశాడు. ఇప్పటికీ నయనతారను విమర్శించే స్థాయి తనకు లేదని, కేవలం వెంకటేష్ కు గౌరవం ఇవ్వకపోవడం వల్లనే తను ప్రశ్నించానని అంటున్నాడు మారుతి.

Show comments