ఇది 'పెళ్లిచూపులు' టైపు సినిమా కాదు

వెంకటేశ్-తరుణ్ భాస్కర్ మూవీ చాన్నాళ్లుగా మార్కెట్లో నలుగుతున్న సినిమా ఇది. అంతేకాదు.. ఈ సినిమా స్టోరీపై కూడా చాన్నాళ్లుగా ఓ కథనం ప్రచారంలో ఉంది. అదేంటంటే.. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఓ హిలేరియస్ ఫ్యామిలీ లవ్ ఎంటర్ టైనర్ రాబోతోందనేది ఆ కథనాల సారాంశం. వెంకీ ఖాతాలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలున్నాయి. ఇక తరుణ్ భాస్కర్ పెళ్లిచూపులతో పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సో.. వీళ్లిద్దరూ కలిసి ఆ జానర్ లోనే ఓ మాంఛి రొమాంటిక్ కామెడీ చేస్తారని అంతా ఊహించారు. కానీ అందరికీ షాక్.

వెంకీ, తరుణ్ భాస్కర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఓ డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో వస్తోంది. అవును.. గుర్రపు పందాల చుట్టూ ఈ సినిమా కథ సాగుతుంది. సినిమాలో గుర్రపు పందాలు కాసే బెట్టింగ్ రాయుడిగా వెంకీ కనిపించబోతున్నాడు. అంతేకాదు.. వెంకీ డైలాగ్ డెలివరీ కూడా హైదరాబాద్ యాసలో ఉంటుంది. వెంకీ కోసం తరుణ్ రాసుకున్న ఈ పాయింట్ అందర్నీ ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. కానీ పెళ్లిచూపులు, నువ్వు నాకు నచ్చావ్ టైపు కథ కాదనే విషయం తెలిసి చాలామంది నిరాశచెందారు.

నిజానికి వెంకీతో సినిమా అనగానే తరుణ్ భాస్కర్ ఈ తరహాలోనే 2-3 స్టోరీలైన్స్ అనుకున్నాడు. వెంకీతో పలుమార్లు స్టోరీ డిస్కషన్లు కూడా జరిగాయి. కానీ ఎందుకో ఇలాంటి కథలపై వెంకటేష్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. పైగా రేపోమాపో త్రివిక్రమ్ తో చేయబోయే సినిమా ఫ్యామిలీ ఎంటర్ టైనరే కావడంతో, ఆ జానర్ వైపు వెంకీ ఆలోచించలేదు.

అలా ఎన్నో సిట్టింగ్స్ తర్వాత ఈ గుర్రపు పందాల బ్యాక్ డ్రాప్ స్టోరీలైన్ ఫిక్స్ అయింది. సురేష్ బాబు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. పీపుల్స్ మీడియా వాళ్లు సహ-నిర్మాతగా చేరే ఛాన్స్ ఉంది. వెంకీ మామ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుపై మరిన్ని వివరాలు బయటకు వస్తాయి.

రాంగ్ రూట్లో బాబు ఆత్మశోధన

Show comments