తెలుగుదేశం భుజాలపై కాంగ్రెస్ సవారీ!

ఇదేమీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ – తెలుగుదేశం పార్టీల మధ్య కుదిరిన పొత్తుల గురించిన వార్త కాదు. ఇంకా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో.. కాంగ్రెస్ పార్టీని భుజాల మీద మోసేంత సత్తా తెలుగుదేశానికి లేదు. ఇదంతా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల సంగతి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అరాచకంగా విభజించినందుకు, ఆ రాష్ట్రంలో ప్రస్తుతం పాడె మీద సవారీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ... అక్కడినుంచి నేరుగా ఎగబాకి తెలుగుదేశం భుజాల మీదికెక్కి సవారీ చేయడానికి సిద్ధమవుతున్నది.

తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ దాదాపుగా కనుమరుగైపోయిన తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ ఒప్పుకోవడమే చాలా ఎక్కువ. దీనికి సంబంధించి.. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలిపోకూడదని వారు భావించి ఉండడం కంటె.. చంద్రబాబునాయుడు అధిష్టానం రేంజిలో ఏదైనా చక్రం తిప్పి ఉంటారనే ఎక్కువ మంది అనుకుంటున్నారు. పైగా కాంగ్రెస్ ఎన్ని సీట్లు ఇస్తే అన్ని తీసుకోండి.. పట్టుపట్టవద్దు.. అని కూడా చంద్రబాబు తన పార్టీ శ్రేణులకు హితబోధ చేసి వెళ్లడం అనేది.. కూడా ఇలాంటి అనుమానాలను కలిగిస్తోంది.

అయితే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం ఏమిటంటే.. చంద్రబాబుకు, కాంగ్రెస్ కు మధ్య డీల్ కేవలం తెలంగాణ వరకే పరిమితమా? ఏపీలో కూడా దాని ప్రభావం ఏమైనా ఉంటుందా అనేది! తాజాగా ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి చెబుతున్న మాటలను గమనిస్తే.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం- కాంగ్రెస్ ల మధ్య ఏపీలో కూడా పొత్తు ఉంటుందనే అనుమానాలు కలుగుతున్నాయి.

ఇప్పటిదాకా మేం ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోలేదని.. ఎన్నికల సమయానికి అధిష్టానం ఎలా ఆదేశిస్తే అలా చేస్తాం అని.. ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చు అనేరీతిలో తులసిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇదంతా కూడా తెలుగుదేశంతో పొత్తు గురించే అని వేరే చెప్పక్కర్లేదు.

అయితే.. కాంగ్రెస్ అక్కడ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. వారితో పొత్తు వల్ల తెలుగుదేశానికి ఎలాంటి లాభమూ లేదు. మహా అయితే నష్టమే ఉంటుంది. అందుచేత.. పొత్తులేదు అని ప్రకటించి.. వారితో.. కొన్ని కీలక స్థానాల్లో వైకాపాను ఓడించడానికి శిఖండి లాగా ప్రయోగించే అవకాశం కూడా ఉన్నదని పలువురు అంచనా వేస్తునారు.

అధికారిక పొత్తు ఉన్న లేకపోయినా.. పరస్పర సహకారం మాత్రం ఆ రాష్ట్రంలోనూ తప్పదని అనిపిస్తోంది.

Show comments