జనసేనను గందరగోళంలోకి నెడుతోంది ఎవరు?!

ఇటీవల ఒక కమ్యూనిస్టు పార్టీ అనుకూల విశ్లేషకుడు ఒకరు మాట్లాడుతూ.. జనసేన విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు దుష్ప్రచారానికి పాల్పడుతున్నాయని వాపోయాడు. జనసేన తో పొత్తు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన సమయంలో సదరు విశ్లేషకులు మాట్లాడుతూ... పొత్తుకు బాబు పిలిచాడు కానీ, పవన్ వెళ్లలేదు కదా, ఎందుకు జనసేన విషయంలో పొత్తు ఉంటుంది అని ప్రచారం చేస్తారు? అని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శించాడు. పవన్, బాబులు పొత్తు పెట్టుకుంటారంటూ వైసీపీ ప్రచారం చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

పవన్ కల్యాణ్ మీద ఎర్ర పార్టీ వాళ్లకు, ఆ పార్టీ అనుకూలురులకు ఎంతైనా ప్రేమ ఉండొచ్చు. అయితే... ఈ ప్రేమలో మునిగిపోయి పవన్ కల్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో.. వాళ్లు సరిగా వినిపించుకోనట్టుగా ఉన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు కలిసి జనసేనలో గందరగోళం సృష్టిస్తున్నాయని సదరు విశ్లేషకులు వాపోయాడు. అయితే.. జనసేనలో గందరగోళం సృష్టించడానికి తెలుగుదేశం పార్టీనో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనో ప్రయత్నించనక్కర్లేదు. ఆ పార్టీని కేరాఫ్ గందగరగోళంగా మార్చేందుకు పవన్ కల్యాణ్ ఒక్కడే చాలు!

ఈ విషయాన్ని ఎర్ర పార్టీల వాళ్లు కూడా ఈ పాటికే గ్రహించి ఉండాలి. లేదంటే.. వాళ్లు గ్రహించి కూడా పైకి అలాంటిదేమీ లేనట్టుగా నటిస్తూ ఉండాలి. మళ్లీ చంద్రబాబుకు అనుకూలంగా మారిపోయాయి పవన్ కల్యాణ్ మాటలు. ఎవరు కాదన్నా.. చంద్రబాబు అజెండానే పవన్ కల్యాణ్ నోటి వెంటవస్తోంది. పవన్ కల్యాణ్ తీరును చూస్తుంటే.. రేపో మాపో పూర్తిగా చంద్రబాబులా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ మాటలను వక్రీకరించడం పనిగా పెట్టుకున్నాడు పవన్ కల్యాణ్.

ఒకవైపు జగన్ మాటలను వక్రీకరించడం.. మరోవైపు చంద్రబాబు మాటలు నిజం అని జనాలు నమ్మాలన్నట్టుగా మాట్లాడటం ఇదీ పవన్ కల్యాణ్ అజెండా అని స్పష్టం అవుతోంది. ఏదో ఊరికే ఏదో ఒకటీ అరమాట చంద్రబాబునూ అనడం. ఇక స్వోత్కర్ష, స్వాతిశయం మాటలు.. ఇవీ పవన్ కల్యాణ్ ప్రసంగాలు. ఇలాంటి తీరుతో జనసేనను గందరగోళ పరుస్తున్నది పవన్ కల్యాణే. జనసేన పార్టీ గమ్యం ఎటు సాగుతుందో అర్థం కాని స్థితి నెలకొని ఉంది.

ఆ పార్టీలోకి చేరే ఆసక్తి ఉన్నవాళ్లను కూడా పవన్ కల్యాణ్ గందరగోళ పరుస్తున్నాడు. అందుకే.. పొలిటికల్ కెరీర్ మీద గట్టి ఆశలున్న వారెవరూ జనసేన లోకి వెళ్లే ధైర్యం చేయడం లేదు. కేవలం నాదెండ్ల మనోహర్, కమ్యూనిస్టు పార్టీల్లా కొండకు వెంట్రుక వేస్తున్న వాళ్లు తప్ప జనసేన గుంపులో మరెవరూ కనిపించడం లేదు.

ఈ పరిణామాల మధ్యన.. చంద్రబాబు ఇచ్చే సీట్లను పుచ్చుకుని, ఎన్నికల ఖర్చు కూడా ఆయన చేతే పెట్టించుకుని పవన్ కల్యాణ్ పొత్తుకు సై అని త్వరలోనే ప్రకటించినా ఏ మాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దానికి మరెంతో దూరం కూడా లేదు.

ఎన్టీఆర్ బయోపిక్ః ఒకవైపే చూడు..!

Show comments