బాలీవుడ్ బండారం బయటపెట్టిన కోబ్రా

ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏకంగా 30 మందికి పైగా బాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీస్ అడ్డంగా దొరికిపోయారు. రాబోయే ఎన్నికల్లో రాజకీయ పార్టీల తరఫున తప్పుడు ప్రచారం చేయడానికి, అందుకు ప్రతిగా బ్లాక్ మనీ అందుకోవడానికి వీళ్లంతా రెడీ అయిపోయారు. కోబ్రా పోస్ట్ ఈ సంచలన విషయాల్ని స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టింది.

ప్రముఖులు చెబితే వింటారు, వాళ్ల మాటలు సామాన్య జనాల్ని ఎట్రాక్ట్ చేస్తాయి. కాబట్టి రాజకీయ పార్టీలన్నీ పేరున్న హీరోహీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టుల్ని ప్రచారానికి వాడుకుంటాయి. కానీ ఇప్పుడు ప్రచారం అంటే నేరుగా వాహనం ఎక్కి రోడ్లుపై చేసేది కాదు. సోషల్ మీడియాలో చేసే స్మార్ట్ ప్రచారానికే ఇప్పుడు క్రేజ్. ఇదిగో సరిగ్గా ఇలాంటి ప్రచారానికే కోట్ల రూపాయలు, అది కూడా బ్లాక్ మనీ డిమాండ్ చేస్తున్నారు బాలీవుడ్ నటీనటులు.

డబ్బు తీసుకొని ప్రచారం చేయడం కొత్త కాదు. కానీ సమాజంలో ప్రముఖులుగా చలామణి అవుతున్న వీళ్లందరికీ ఓ సామాజిక బాధ్యత అనేది ఉండాలి కదా. తమ పోస్టులు లక్షల మందికి చేరువవుతాయి, అందులో కనీసం వేలసంఖ్యలో ప్రజలు తాము చెప్పే మాటలకు ప్రభావితం అవుతారనే ఇంగితజ్ఞానం ఉండాలి కదా. ఇప్పుడు అదే పునాదులపై నల్లవ్యాపారానికి బరితెగించారు ఈ నటీనటులు.

తమ ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాల్లో ఏదైనా రాజకీయ పార్టీకి అనుకూలంగా పోస్టు పెట్టేందుకు చెరో పోస్టుకు 2 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు డిమాండ్ చేస్తున్నారు బాలీవుడ్ ప్రముఖులు. కోబ్రో పోస్ట్ చేసిన స్టింగ్ ఆపరేషన్ లో అమీషా పటేల్, సోనూ సూద్, వివేక్ ఒబరాయ్, సన్నీలియోన్, మహిమా చౌదరి, బాబా సైగల్, మినీషా లాంబా, శక్తికపూర్.. ఇలా చాలామంది ప్రముఖులు పట్టుబడ్డారు. తాము ఎంత తీసుకుంటామో ఓపెన్ గా చెబుతూ అడ్డంగా కెమెరాలకు బుక్కయిపోయారు.

ప్రజలకు ఎలాంటి అనుమానం రాకుండా, తమ వ్యక్తిగత అభిప్రాయం ముసుగులో పార్టీకి అద్భుతంగా ప్రచారం చేస్తామని అమీషా పటేల్ చెప్పింది. తను చెబితే వినే వాళ్లు లక్షల సంఖ్యలో ఉన్నారని, పైగా ఎలా చెబితే వింటారో తనకు బాగా తెలుసన్నాడు వివేక్ ఒబరాయ్. ఇక సోనూ సూద్ అయితే ఇలాంటి పనులకు 2 కోట్ల రూపాయలు తీసుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నానంటూ కెమెరాకు చిక్కాడు. తన భర్తకు ఓవర్సీస్ సిటిజన్ షిప్ ఇస్తే బీజేపీకి సపోర్ట్ చేస్తానంటూ సన్నీలియోన్ దొరికిపోయింది.

ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు దాదాపు 30మంది రహస్య కెమెరాలకు చిక్కారు. ప్రస్తుతం వీళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓవైపు ఇలా అడ్డంగా దొరికిపోయినా ఏమాత్రం సిగ్గులేకుండా ఖండనల పర్వం కూడా షురూ చేశారు వీళ్లు. తను ఏ పార్టీకి మద్దతు ఇవ్వనని సన్నీలియోన్ ఇప్పటికే ఖండించగా.. మిగతా నటీనటులంతా ఈరోజు తమ అభిప్రాయాల్ని వెల్లడించబోతున్నారు.

అనంతపురం అర్బన్..వైసీపీలో మళ్లీ పాత గొడవే?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?

Show comments