బాబుకు భయపడిన బ్రిటిష్ ప్రభుత్వం

నవ్వితే నవ్వుకోండి.. నేను మాత్రం తగ్గను అన్నట్టుంది బాబు వైఖరి. "నేనే ఫస్ట్.. నేనే ఫస్ట్" అని చెప్పుకోవడంలో బాబుకు అదో రకమైన తుత్తి. ఇప్పుడీ తుత్తి కొత్త పుంతలు తొక్కింది. రాష్ట్రం, దేశం దాటి విదేశాలకు కూడా విస్తరించింది. తనను చూస్తే ఏకంగా బ్రిటిష్ ప్రభుత్వమే భయపడుతోందనేది చంద్రబాబు లేటెస్ట్ స్టేట్ మెంట్. 

ఇదేదో మహానాడులోనో, పార్టీ మీటింగ్ లోనో చెప్పుకుంటే సొంత డబ్బా అనుకోవచ్చు. ఏకంగా అసెంబ్లీలో బాబు ఈ మాట అనేశారు. ఎలాగూ వ్యతిరేకించడానికి ప్రతిపక్షం లేదు. బాబు ఏం మాట్లాడినా బల్లలు కొట్టి హర్షం వ్యక్తంచేసే టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంత బల్ల చరిచినా ఎవరికీ వినిపించని పరిస్థితిలో బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారక్కడ. దీంతో బాబు నోటికి అడ్డుఅదుపు లేకుండా పోయింది. అందుక ఏకంగా కోహినూర్ వజ్రం గురించి కూడా మాట్లాడేశారు.

"బ్రిటిషర్ల మ్యూజియంకు పోతే వాళ్లు భయపడుతున్నారు. కోహినూర్ వజ్రాన్ని నేను అడుగుతానని వాళ్లు చాలా భయపడ్డారు. అమరావతికి సంబంధించినవి కూడా చాలాపెట్టారు. నేను చూడ్డానికి పోతానంటే భయపడి, నన్ను అడ్డుకునే పరిస్థితికి వచ్చారు."

అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చెబుతున్న మాటలివి. అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేశానని, సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్ సీఈవోను చేశానని, హైదరాబాద్ ను ప్రపంచపటంలో నిలిపానని.. ఇలా ఎన్నో చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు కోహినూర్ వజ్రాన్ని కూడా తనే అడిగానని చెప్పుకున్నారు. స్వయంగా భారత ప్రధానులు, కొంతమంది రాష్ట్రపతులు అడిగితేనే కోహినూర్ వజ్రం ఇండియాకు రాలేదు. చరిత్ర ప్రకారం, అది భారత్ కు వచ్చే అవకాశం కూడా లేదు. 

కానీ చంద్రబాబు మాత్రం, తనను చూసి బ్రిటిష్ పాలకులు వణుకుతున్నారంటూ అసెంబ్లీలో చెప్పుకున్నారు. ఇది మాత్రమే కాదు, అసెంబ్లీ సాక్షిగా బాబు చెబుతున్న అబద్ధాలు ఇప్పుడు పరాకాష్టకు చేరాయి. ప్రత్యేక హోదా వద్దని తను ఎప్పుడు చెప్పానో సాక్ష్యాలు చూపించమని బుకాయిస్తున్నారు.

"స్పెషల్ స్టేటస్ వద్దని నేను ఎక్కడ చెప్పాను. వద్దని ఎక్కడ చెప్పానో చూపించండి. హోదా కావాలని ఎప్పట్నుంచో నేను అడుగుతున్నాను కదా. నాతో ప్రతిపక్షాలు కలిసిరాలేదు. ఇప్పటికైనా హోదా ఇవ్వకపోతే బీజేపీని ప్రజలు క్షమించరు. సున్నితమైన విషయాలపై అడ్డంగా మాట్లాడొద్దు."

ఇది చంద్రబాబు వితండవాదం. మొన్నటివరకు ''హోదా వద్దు-ప్యాకేజీ ముద్దు'' అనే నినాదాన్ని వినిపించిన బాబు.. తను హోదా ఎప్పుడు వద్దన్నానో సాక్ష్యాలు చూపించమని ప్రజల్ని నిలదీస్తున్నారు. అంతేకాదు, హోదా ఇవ్వకపోతే బీజేపీని క్షమించరట. సున్నితమైన అంశాలపై అడ్డంగా మాట్లాడొద్దట. 

మొదట తనను ప్రజలు క్షమిస్తున్నారో లేదో చంద్రబాబు చెక్ చేసుకుంటే బాగుంటుంది. అంతకంటే ముందు, సున్నితమైన అంశాలపై మొదట్నుంచి రచ్చ చేస్తున్నది ఎవరో కూడా కాస్త గతాన్ని తవ్వి చూసుకుంటే మంచిది. 

Show comments