రామ్ గోపాల్ వర్మ కమర్షియల్ విజయం చవి చూసి చాలా అంటే చాలా కాలం అయింది. ఎప్పుడు ఈ సినిమా చేసినా కాస్త హడావుడి చేసి వదిలేయడం, సినిమా విడుదలైన తరువాత తుస్సుమనేయడం అన్నది అలవాటైపోయింది.
వర్మకు, ఆయన సినిమాలు ఇష్టపడేవారికి కూడా ఇది కామన్ వ్యవహారం అయిపోయింది. వర్మ వంగవీటి సినిమాను విడుదల చేసినపుడు కూడా అలాంటి సినిమాల్లో ఇదొకటి అని టేకిట్ ఈజీగా తీసుకున్నారు.
విజయవాడ వెళ్లి హల్ చల్ చేసినపుడు కూడా సినిమా గురించి అంత సీరియస్ గా ఎవరూ అనుకోలేదు. సినిమా పూర్తి చేసి, ట్రయిలర్ వదిలి, ఇప్పుడు భారీగా ఫంక్షన్ చేసాక కాస్త కదలిక వచ్చింది. అయితే ఇప్పటికీ ఇంకా జనాలకు పూర్తి నమ్మకం అయితే కలగడం లేదు. ఎందుకంటే ఇప్పటి దాకా అనేకానేక సార్లు వర్మ ఏవిధంగా జనాలను డిస్సపాయింట్ చేసారో తెలిసిందే.
వంగవీటి ట్రయిలర్లు, ఇతరత్రా విజువల్స్ చూస్తుంటే రక్త చరిత్రకు భిన్నంగా ఏమీ వున్నట్లు కనిపించడం లేదు టేకింగ్. పైగా వంగవీటి కథతో కనెక్ట్ అయ్యేవారు కృష్ణ, గుంటూరు, ఈస్ట్, వెస్ట్ ల్లోనే ఎక్కువ. రాయలసీమ, నైజాం ల్లో వంగవీటి కథ గురించి పెద్ద ఆసక్తి వుంటుందా అన్నది అనుమానం. అదీ గాక వంగవీటి కథ ఆధారంగానే గతంలో వర్మ శివ, గాయం, బెజవాడ లాంటి సినిమాలు తీసి చూపించింది. బెజవాడ సినిమా టమ్ కు వర్మ ఇమేజ్ అంత డ్యామేజ్ కాలేదు. దానికే జనం అంత రెస్పాండ్ కాలేదు. మరి వంగవీటి విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.
విజయవాడ ప్రాంతంలో వంగవీటి సినిమాకు కచ్చితమైన ఓపెనింగ్స్ వుంటాయి. అక్కడ జనాలకు తెలిసిన కథ అయినా కూడా, వర్మ ఎలా చెప్పారో, ఎటు మొగ్గారో అన్న ఉత్సాహం వుంటుంది, కానీ అదే ఉత్సాహం, ఆసక్తి మిగిలిన ఏరియాల్లో వుంటాయా అన్నది అనుమానం.
ఇవన్నీ అలా వుంచితే, సినిమాను యథాతథంగా తీసినా కూడా పొరపాటున ఎవరి మనోభావాలు కాస్త గాయపడినా వ్యవహారం వేరుగా వుంటుంది. రత్నకుమారిపై హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరించిన తీరు, పొలిటికల్ ఈక్వేషన్లు ఇవన్నీ సినిమాలో ఎలా వుంటాయో, విడుదలయ్యాక కానీ తెలియదు. అందువల్ల వంగవీటి సినిమాకు విడుదల ముందు కన్నా, విడుదల తరువాత టాక్ మాత్రమే ముఖ్యం. ఆ టాక్ తరువాతే జనాలు వర్మ సినిమాను చూడడం పై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం వుంది. ఎందుకంటే పదే పదే డిస్సపాయింట్ మెంట్ అంటే ఎవరికి మాత్రం నచ్చుతుంది.