కౌంటింగ్ స్టార్ట్: ఉత్కంఠలో "ఆ ముగ్గురు"

తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఫలితాలపై ఇటు టీఆర్ఎస్ పార్టీ, అటు మహాకూటమి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఉదయం 10 గంటలకు తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఫలితాలు అధికారికంగా ప్రకటించకున్నా, మధ్యాహ్నం ఒంటిగంటకు మెజారిటీ ఎవరిది అనే విషయంపై ఓ స్పష్టత వచ్చేస్తుంది. ఇంత హడావుడి మధ్య సందట్లో సడేమియా అన్నట్టు ముగ్గురు సినీప్రముఖులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

వీళ్లలో ముందు వరుసలో ఉన్న వ్యక్తి బాబుమోహన్. గత ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో టీఆర్ఎస్ పార్టీలో చేరి అనూహ్యంగా ఎమ్మెల్యే అయిన బాబుమోహన్ ఈసారి మాత్రం ఎదురుదెబ్బ తిన్నారు. టీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఎప్పట్లానే ఈసారి కూడా ఆఖరి నిమిషంలో పార్టీ మారి బీజేపీ తరఫున బరిలో దిగారు. మరి ఆందోల్ లో ఆయన సీటు ఉంటుందా ఊడుతుందా అనేది కొన్ని గంటల్లో తేలిపోనుంది.

మరో సినీప్రముఖుడు భవ్య ఆనంద ప్రసాద్ కూడా ఈసారి రేసులో నిలిచారు. బాలకృష్ణ లాబీయింగ్ తో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా నిలబడ్డారు ఈ నిర్మాత. తన ప్రొడ్యూసర్ కోసం బాలయ్య ఈ నియోజకవర్గంలో రోడ్ షో కూడా నిర్వహించారు. పంచ్ డైలాగులు కూడా కొట్టారు. మరి బాలయ్య ఎప్పీయరెన్స్ హిట్ అవుతుందా, ఫట్ అవుతుందా తేలడానికి ఇంకొన్ని గంటల సమయం పడుతుంది.

అయితే తెలంగాణలో బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎక్కువ టెన్షన్ ఆనంద ప్రసాద్ కే. ఎందుకంటే ఈయన పోటీచేస్తున్న నియోజకవర్గంలో ఎక్కువ రౌండ్లు ఉన్నాయి. ఏకంగా 42 రౌండ్ల పాటు కౌంటింగ్ జరపాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ నియోజకవర్గ ఫలితం కాస్త ఆలస్యంగా వస్తుంది.

ఇక రేసులో నిలిచిన మరో సినీతార రేష్మ రాధోడ్. ఈరోజుల్లో లాంటి సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్, బీజేపీ తరఫున వైరా నియోజకవర్గం నుంచి నిలబడింది. కానీ ఈమె గెలుపుపై పెద్దగా ఎవరికీ అంచనాల్లేవు. సో.. మరికొన్ని గంటల్లో ఈ ముగ్గురు సినీప్రముఖుల జాతకాలు తేలిపోనున్నాయి.

Show comments