అమరావతి రాజధాని ఆశలు అటకపైకే!

ఒకవేళన వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం.. కొత్తగా భూసేకరణ లాంటి చికాకులు ఎందుకు లెమ్మనుకుని.. ఆల్రెడీ సేకరించి.. అమరావతి ప్రాంతంలోనే రాజధాని కట్టడానికి పూనుకున్నా కూడా.. చంద్రబాబు కట్టనిచ్చేలా లేరు. అబ్బెబ్బే ఇది నా రాజధాని.. నా సొంత సొత్తు... మరొకరు ఇక్కడ రాజధాని కడతానంటే ఊరుకోను.. మిమ్మల్ని సూటిపోటి మాటలతో హింసించి.. మీరు కట్టినా కూడా కీర్తి మాత్రం నాకే వస్తుందని బెదిరించి.. మొత్తానికి ఇక్కడ కట్టకుండా చేసేస్తాను అని పట్టుబట్టేలా ఉన్నారు. ఆయన డైలాగులకు జగన్ సంగతి ఏమో గానీ.. ఆయన కొలువులోని సచివులకు మాత్రం చిర్రెత్తుకొస్తోంది.

బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ... అమరావతిలో రాజధాని వస్తుందని అనుకుంటున్న వాళ్ల ఆశలు సన్నగిల్లిపోయేలా కొన్ని డైలాగులు వల్లించారు. రాజధాని ఇక్కడే ఉంటుందని.. ఆయన స్పష్టత ఇవ్వదలచుకోలేదు. పైపెచ్చు.. నిపుణుల కమిటీ ఎక్కడ సూచిస్తే అక్కడే.. అంటూ తమ చేతికి మట్టి అంటకుండా దులుపుకున్నారు. నిపుణుల కమిటీలు ఇదివరకు కూడా సూచించాయి. అప్పటి నిపుణులు ఇప్పటి నిపుణులు వేరుకావచ్చు.. కానీ.. అప్పట్లో ప్రస్తుత అమరావతి ప్రాంతంలో రాజధాని వద్దని సూచించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఇప్పుడు జగన్ సర్కారు బంతిని మళ్లీ నిపుణుల కోర్టులో పెట్టింది. కొత్తగా కసరత్తు జరుగుతుంది. వారు రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలను పరిశీలించి... కొత్త నివేదిక ఇవ్వాలి. ఆపై సాధ్యాసాధ్యాల గురించి జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఇంత ప్రక్రియ ఉంది. అమరావతి రాజధాని అనే సూచనే వచ్చినా కూడా జగన్ ప్రభుత్వం దానిని పాటించవచ్చు. అయినా సరే.. చంద్రబాబు అమరావతి రాజధాని గురించి ఏ మాయమాటలు అయితే చెబుతూ.. అయిదేళ్లు నెట్టుకొచ్చారో.. ఆ మాయ మాత్రం ఆచరణలోకి ఖచ్చితంగా రాదు.

జగన్ ప్రభుత్వం ఎటొచ్చీ అధికార వికేంద్రీకరణపై దృష్టి పెడుతోంది. రాజధాని, హైకోర్టు ఇలా కీలక వ్యవస్థలు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటవుతాయి. అందువలన ఏ రకంగా చూసినా.. అమరావతి రాజధాని అనే ప్రతిపాదనలు కొంతమేర అటకెక్కినట్టే కనిపిస్తున్నాయి.

'మా' రచ్చ మాములూగా లేదుగా.. మొత్తం తిట్లే

Show comments