కులం కార్డు తీసింది...సత్తా చూపుతానంటోంది...!

మన దేశంలో కులానికి-రాజకీయాలకు ఉన్న అవినాభావ సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. సంక్షేమ పథకాలు మొదలుకొని ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వడం వరకు, సర్పంచ్‌ ఎన్నిక దగ్గర్నుంచి, ప్రధానిని ఎన్నుకునేవరకు కులం ప్రాతిపదికపైనే జరుగుతోంది. ఇక ఆర్థిక నేరగాళ్లు, హత్యలు చేసినవారు, కుంభకోణాలకు పాల్పడినవారు, ఘరానా మోసగాళ్లు కొందరు తాము పట్టుబడగానే 'నేను ఫలానా వెనకబడిన కులంవాడిని కాబట్టే ఈ విధంగా కేసుల్లో ఇరికిస్తున్నారు' అని ఏడుపు మొహం పెడుతుంటారు. 'నేను ఫలానా కులం వాడిని కాబట్టే ఫలానా అత్యున్నత పదవి దక్కకుండా చేశారు' అని కొందరు నాయకులు ఆరోపిస్తారు. రిజర్వేషన్ల కోసం సాగుతున్న పోరాటాలు చూస్తూనేవున్నాం. 

పాలకులు కొందరు అవినీతిపరులైన నాయకులను రక్షించడానికి కారణం వారి కులం, దాని వెనక ఉన్న ఓటు బ్యాంకు. ఇలా చెప్పుకుంటూపోతే 'కులం కథ' చాలా ఉంది. ఇక అసలు విషయానికొస్తే తమిళనాడులో పాలక అన్నాడీఎంకే పార్టీలో ఎంత కొమ్ములు తిరిగిన నాయకుడు లేదా నాయకురాలైనా పార్టీ అధినేత కమ్‌ ముఖ్యమంత్రి జయలలితకు ఎదరుపడి మాట్లాడటానికి కూడా భయపడతారు. అలాంటిది ఆమెను ఎదిరించి మాట్లాడటం కలలో మాట. కాని కొంతకాలం క్రితం పార్టీ నుంచి బహిష్కృతురాలైన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప 'అమ్మ'పై పోరాటం ప్రారంభించింది. మొన్నటివరకు అమ్మ నామస్మరణ చేసిన ఈ ఎంపీ ఇప్పుడు జయ అంతు (రాజకీయంగా) చూస్తానంటోంది. ఇందుకు ఆమె దగ్గర ఉన్న ఆయుధం 'కులం'. ఈ విషయం ఆమె బహిరంగంగా చెబుతోంది. అన్నాడీఎంకేను 'బానిసల పార్టీ' అని ఛీత్కరించింది. 

శశికళ పుష్ప తమిళనాడులో  రాజకీయంగా ప్రాచుర్యం ఉన్న, సామాజికంగా వెనకబడిన 'నాడార్‌' (ఓబీసీ కేటగిరీ) కులానికి చెందిన మహిళ. రాష్ట్రంలోని దక్షిణాది ప్రాంతాల్లో తనది చాలా బలమైన సామాజిక వర్గమని, జయలలితను వదిలిపెట్టేదిలేదని శశికళ పుష్ప శపథం చేసింది. వచ్చే ఎన్నికల్లో తేల్చుకుంటానంటోంది. ఢిల్లీలో డీఎంకే ఎంపీని కొట్టినందుకు శశికళను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. నాడార్‌ సామాజికవర్గం ఎక్కువగా ట్యుటికోరిన్‌ (శశికళ ప్రాంతం) కన్యాకుమారి, తిరనల్వేలి, విరుద్‌నగర్‌లో వ్యాపించివుంది. ఈ ప్రాంతాల్లో పార్టీల జయాపజయాలను నిర్ణయించడంలో నాడార్‌ కులం కీలకపాత్ర పోషిస్తోంది. 

సంప్రదాయంగా నాడార్లు వడ్డీ వ్యాపారులు. భూస్వాములు. వ్యవసాయదారులు కూడా ఎక్కువమందే ఉన్నారు. నాడార్లలో కొన్ని ఉప కులాలు ఉన్నప్పటికీ మొత్తంగా చూస్తే నాడార్లు బలమైన సామాజికవర్గం. తమిళనాడులో ఒకానొక కాలంలో హిందూ దేవాలయాల్లోకి ప్రవేశం లేని నాడార్లు కాలక్రమంలో ఆర్థికంగా, రాజకీయంగా బలపడటంతో అనేక ఆలయాలకు ధర్మకర్తలయ్యారు. నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు. ఒకప్పుడు వీరు బ్రాహ్మణ సామాజికవర్గానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు ద్రవిడ ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో మాదిరిగానే తమిళనాడులోనూ కుల రాజకీయాలు ఎక్కువే. 

కులం ప్రాతిపదికగా రాజకీయ పార్టీలున్నాయి. కాని అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల ఆధిపత్యం ముందు కులపరమైన పార్టీలు నిలబడలేకపోతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెసు పూర్తిగా భూస్థాపితమైన తరువాత ఈ రెండు పార్టీలే అధికారం పంచుకుంటున్నాయి. జయలలిత అగ్రవర్ణానికి (బ్రాహ్మణ-అయ్యంగార్‌) చెందిన మహిళ అయినా ఆమె సినిమా పాపులారిటీ, ఎంజీఆర్‌తో సన్నిహితత్వం కారణంగా ఇప్పటివరకు ఆమె ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. వెనకబడిన వర్గాల మద్దతు కూడా ఉన్నందువల్లనే ఆమె అప్రతిహతంగా విజయాలు సాధిస్తున్నారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో శశికళ పుష్పవంటి ఎంపీ జయలలిత అంతు చూస్తాననడం అతిశయోక్తే. జయ కారణంగా తన ప్రాణాలకు మప్పుందని చెబుతున్న శశికళకు ఢిల్లీ హైకోర్టు ఈ నెల (ఆగస్టు) 22 వరకు రక్షణ కల్పించింది. 

Show comments