పిఠాపురంలో ప‌వ‌న్ క‌ష్టాలు... ప‌గ‌వారికీ వ‌ద్దు!

ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న‌ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు క‌ష్టాలు అన్నీఇన్నీ కావు. ఒక పార్టీ అధ్య‌క్షుడు తాను పోటీ చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలోనే ఐదారుసార్లు ప్ర‌చారం చేయ‌డం పిఠాపురంలోనే చూస్తున్నాం. కుప్పం, పులివెందుల నియోజ‌క‌వ‌ర్గాల్లో నేరుగా చంద్ర‌బాబు, వైఎస్ జ‌గ‌న్ ప‌దేప‌దే ప్ర‌చారం చేయ‌డం లేదు. జ‌గ‌న్ నామినేష‌న్ వేసిన రోజు పులివెందుల బ‌హిరంగ స‌భ‌లో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా మాట్లాడారు.

ఆ త‌ర్వాత జ‌గ‌న్ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌చారం చేస్తున్నారు. త‌న అభ్య‌ర్థుల‌ను గెలిపించుకోడానికి ఆయ‌న తాప‌త్ర‌య ప‌డుతున్నారు. చంద్ర‌బాబునాయుడు కూడా అంతే. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్ర‌చారం చేస్తూ, త‌న అభ్య‌ర్థుల‌ను గెలిపించుకోడానికి చెమ‌టోడుస్తున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాత్రం పిఠాపురం చుట్టే చ‌క్క‌ర్లు కొడుతున్నారు. దీంతో పిఠాపురంలో గెలుపుపై ప‌వ‌న్‌కు అనుమానాలున్నాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

పిఠాపురంలో పోటీ చేస్తున్న‌ట్టు ప‌వ‌న్ ప్ర‌క‌టించిన‌ప్పుడు... ల‌క్ష మెజార్టీతో గెలుస్తామ‌నే ధీమా క‌నిపించింది. ఇదే విష‌యాన్ని పిఠాపురంలో జ‌న‌సేన నాయ‌కులు ప‌దేప‌దే చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఎన్నిక‌ల‌కు రోజులు ద‌గ్గ‌ర‌ప‌డే కొద్ది పిఠాపురంలో రాజ‌కీయ ప‌రిస్థితి మారుతోంద‌న్న చ‌ర్చ న‌డుస్తోంది. క్ర‌మంగా వైసీపీ అభ్య‌ర్థి వంగా గీత‌కు అనుకూల వాతావ‌ర‌ణం పెరుగుతోంద‌ని చెబుతున్నారు.

దీంతో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు కూడా భ‌యం ప‌ట్టుకుంది. ముందు తాను ఎమ్మెల్యేగా గెలిచి చ‌ట్ట‌స‌భ‌లో అడుగు పెడితే... జీవితం ధ‌న్య‌మ‌వుతుంద‌నే భావ‌న‌లో ఆయ‌న ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఇవాళ మ‌రోసారి పిఠాపురంలో ఎన్నిక‌ల ప్ర‌చారానికి ప‌వ‌న్ వెళ్ల‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఎందుకో పిఠాపురంలో తేడా కొడుతోంద‌న్న సంకేతాలు ప‌వ‌న్‌కు వెళ్లిన‌ట్టు స‌మాచారం. అందుకే ఆయ‌న పిఠాపురంపై ప్ర‌త్యేక దృష్టి సారించారు. ముందు త‌న గెలుపు త‌ర్వాతే, మ‌రెవ‌రైనా, ఏదైనా అనే నిర్ణ‌యానికి ప‌వ‌న్ వ‌చ్చారు. ఒక పార్టీ అధ్య‌క్షుడిగా ఇలాంటి క‌ష్టాలు, ప‌గ‌వారికీ వ‌ద్దు అనేలా ఉన్నాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

Show comments