ఎమ్మెల్యేల సంపాదన జాబితాలో బాబు ఎక్కడ?

దేశంలోని మొత్తం సిట్టింగు ఎమ్మెల్యేల సంఖ్య 4,086 అని వారిలో తమ సంపాదన వివరాలను సమర్పించిన వారు 3,145 మంది అని సెంటర్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ ప్రకటించింది. మొత్తం 941 మంది తమ, తమ కుటుంబ సంపాదన వివరాలను ప్రకటించలేదు అని ఈ సంస్థ పేర్కొంది.

ఇక ఈ జాబితాలో ఇప్పటివరకూ కొన్ని వివరాలనే ప్రకటించింది ఆ సంస్థ. రాష్ట్రాల వారీగా జాబితాను పూర్తిస్థాయిలో ఇవ్వలేదు. ఆ సంస్థ వెబ్ సైట్లోకి వెళ్లి చూసినా.. అనేక సందేహాలు అలాగే మిగిలి ఉన్నాయి. వివరాలను ఇచ్చిన ఎమ్మెల్యేల జాబితా పూర్తిగాలేదు, వివరాలు ఎవరెవరు ఇవ్వలేదో కూడా స్పష్టతలేదు.

రాష్ట్రాల వారీగా వివరాలను ఇచ్చిన ఎమ్మెల్యేల జాబితాను, వారి వారి సంపాదనలను ఏడీఆర్ జాబితాలను ఇస్తే కానీ ఈ వ్యవహారంపై స్పష్టతరాదు. ఇక ఏపీకి సంబంధించి జగన్ ఐదో స్థానంలో ఉన్నట్టుగా ఏడీఆర్ పేర్కొంది. అలాగే తెలంగాణ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ ఆరో స్థానంలో ఉన్నట్టుగా ఏపీకి సంబంధించిన వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పదో స్థానంలో, నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి 14వ స్థానంలో ఉన్నట్టుగా, తెలంగాణకు సంబంధించి పైళ్ల శైఖర్ రెడ్డి 19వ స్థానంలో ఉన్నట్టుగా పేర్కొంది.

ఇక అత్యల్ప ఆదాయలను చూపిన వారిలో నంబర్ వన్ పొజిషన్లో ఉంది శింగనమల ఎమ్మెల్యే యామినీబాల. ఈ జాబితాలో వైసీపీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు 16వ స్థానంలో ఉన్నారు. ఈ వివరాలపై స్పష్టత ఉంది కానీ.. బోలెడన్ని సందేహాలు మిగిలి ఉన్నాయి. జగన్ వార్షిక సంపాదన విషయంలో ఆయన కుటుంబ సభ్యుల సంపాదనను కూడా కలిపారు. ఇక ఈ జాబితాలో చంద్రబాబు పేరు ఎక్కడా కనిపించలేదు. కుటుంబ సభ్యుల ఆదాయాలను కలిపి చూస్తే చంద్రబాబు నాయుడుకు ఏ స్థానం దక్కుతుందో చెప్పనక్కర్లేదు.

ఎందుకంటే.. తన భార్య బ్రహ్మణి, తన తల్లి నారా భువనేశ్వరిలు భారీగా సంపాదిస్తున్నారని, ప్రతియేటా వారి వార్షిక వేతనాలే కోట్ల రూపాయల్లో ఉన్నాయని స్వయంగా నారా లోకేష్ ప్రకటించాడు. ఆస్తుల ప్రకటన సమయంలో ఈ విషయాన్ని ప్రకటించారు. మరి ఆ లెక్కలన్నీ కలిపి చూస్తే.. ఈ జాబితాలో చంద్రబాబు నాయుడుకు సాటి వచ్చేవారు లేరు.

ఇప్పటి వరకూ ఈ జాబితాలో చంద్రబాబు స్థానం ఏది? అనే అంశం గురించి ఏడీఆర్ స్పష్టత ఇవ్వలేదు. కొంపదీసి వివరాలు ఇవ్వని 941 మంది ఎమ్మెల్యేల జాబితాలో చంద్రబాబు కూడా ఉన్నారా?

Show comments