తప్పు జగన్.. ఆమాట ముమ్మాటికీ తప్పు!

రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు చాలా సహజం. కానీ వాటిలో కొంత ఔచిత్యం ఉండాలి. ఆవేశకావేషాలకు లోనైనప్పటికీ కూడా..  విమర్శలు చేయడంలో ఒక హద్దు ఉంటుంది.  ఆ హద్దును మరచిపోతే ఇక విలువ ఉండదు. ఆ సంయమనాన్ని కోల్పోకుండా ఉండడమే వ్యక్తిత్వం. ఇవాళ షర్మిలను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు.. ఎంతగా హద్దు దాటాయంటే.. ఆయన వీరాభిమానులు కూడా మనస్తాపానికి గురవుతున్నారు. ఆయన ఇలా మాట్లాడి ఉండాల్సింది కాదని అంటున్నారు.

ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళల జీవితాల్లో ఒక గుణాత్మక మార్పు తీసుకువచ్చిన నాయకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా మహిళలకే అందుతున్నాయి. మూడులక్షల పైచిలుకు కుటుంబాలకు ఇంటిపట్టాలు ఇస్తే అవన్నీ కూడా మహిళల పేరిటే ఇవ్వడం జరిగింది. అనేక పథకాల లబ్ధి మహిళలకే అందుతోంది. మహిళల రక్షణ కోసం దిశ వంటి తిరుగులేని చట్టాన్ని తీసుకువచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డిదే.

రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలు అందరికీ తాను సోదరుడినని, రాష్ట్రంలోని ప్రతిబిడ్డకు తాను మేనమామనని జగన్ చెప్పుకుంటూ ఉంటారు. ఆ రకంగా ఆయనను లక్షలాది మంది మహిళలు సొంత అన్నయ్యకంటె ఎక్కువగా భావిస్తుంటారు కూడా. అందరి ప్రేమను చూరగొన్న జగన్మోహన్ రెడ్డి.. సొంత చెల్లెలి విషయంలో ఎందుకు అలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేశారు? అనే మధనం ఆయన అభిమానుల్లో ఉంది.

వైఎస్ షర్మిల రెడ్డి అని చెప్పుకోవడానికి ఇష్టపడే ఆమె.. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయానా చెల్లెలు. తోబుట్టువు. ఒక అమ్మ కడుపున పుట్టారు. తోబుట్టువులు అందరూ జీవితపర్యంతమూ ప్రేమగానే ఉండాలనే గ్యారంటీ ఏం లేదు. చిన్న చిన్న స్పర్ధలకు, ఆస్తుల వివాదాలకు దూరమయ్యే వారిని మనం నిత్యం సమాజంలో ఎంతోమందిని చూస్తుంటాం. వారిద్దరి మధ్య విభేదాలకు మూలం ఏమిటో తెలియదు గానీ.. ఇద్దరూ విభేదించి ఎవరి మార్గంలో వారు రాజకీయ ప్రస్థానం సాగిస్తున్నారు. అలాంటప్పుడు విమర్శలు, దూషణలు అయినా సరే రాజకీయంగా ఉండి ఉంటేనే బాగుండేది.

ఆ మాటకొస్తే షర్మిల తన మాటలతో కలిగించిన అసహనం కూడా చిన్నది కాదు. సీబీఐ చార్జిషీట్ లో అవినాష్ పేరు ఉన్నది అనే అంశాన్ని పట్టుకుని అవినాష్ ను హంతకుడిగా, జగన్ ను హంతకుడిన ప్రోత్సహిస్తున్న వ్యక్తిగా ఆమె ఎన్నెన్ని మాటలు అన్నారో లెక్కేలేదు.

అయినా సరే.. జగన్ వాటన్నింటికీ ఆ అంశాల కోణంలోంచే జవాబు చెప్పి ఉండాలి. వాటికి జగన్ దగ్గర ఉన్న ఏకైక కౌంటర్ వివేకాకు రెండో పెళ్లి అయింది.. హత్యకు అది ఒక కారణం అనేది. అలాగే, వివేకాను చంపిన వారికి సునీత మద్దతిచ్చి బెయిలుకు సహకరించింది అనేది. ఆ అస్త్రాలను ఆయన వాడేశారు. షర్మిల చేసిన విమర్శలనే మళ్లీ మళ్లీ చేస్తున్నట్టుగా.. జగన్ కూడా అవే అస్త్రాలను మళ్లీ వాడి ఉండవచ్చు. కానీ.. ‘పసుపు రంగు చీర కట్టుకుని ప్రత్యర్థుల ఇళ్లకు వెళ్లి వారికి మోకరిల్లి..’ ఈ పదాలు జగన్ వాడడం చాలా తప్పు.

చంద్రబాబునాయుడు ఆయనకు ప్రత్యర్థి. అంత మాత్రాన ఆయనతో విభేదించి ఉన్న షర్మిల కూడా ఆయనను ఎప్పటికీ వెళ్లి కలవకూడదని ఎలా కోరుకుంటారు? అలాగే పసుపురంగు ఏమైనా తెలుగుదేశం పార్టీకి గుత్త సొత్తా? ఆ రంగు దుస్తులు ధరించిన ప్రతి ఒక్కరూ తెలుగుదేశం వాళ్లేనా? సాక్షి పత్రిక ప్రారంభించినప్పటినుంచి ఘనమైన పసుపురంగులోనే తమ పత్రిక పేరును ఉంచి ఎందుకు వాడుతున్నారు? ఇవన్నీ ప్రశ్నలే కదా?

షర్మిల- జగన్ కు చెల్లెలు కావాల్సిన అవసరం లేదు. ఒక సాధారణ మహిళ అనుకుందాం. అయినా సరే.. ఒక మహిళ గురించి ‘నువ్వు ఆ రంగు చీర కట్టుకుని వారి వద్దకు వెళ్లి మోకరిల్లావు’ అని మాట్లాడడం ఖచ్చితంగా తప్పు. ఈ తప్పును ఆయన కోటరీ ఒప్పుకోకపోవచ్చు. తప్పుకాదని దబాయించవచ్చు. ఒప్పుకుంటే అది తమ బలహీనత అవుతుందేమోనని జాగ్రత్తపడవచ్చు. కానీ.. ఆ మాటలు ముమ్మాటికీ తప్పే. ఆయన అలా మాట్లాడకూడదు.

‘ఒకసారి చేస్తే పొరబాటు’ అని జగనే తన ప్రసంగాల్లో అంటూ ఉంటారు. ఆయన ఇలా మాట్లాడడం తన తప్పు కాదు, పొరబాటు మాత్రమే అని మాటల్లో ఒప్పుకోకపోయినా, చేతల్లో నిరూపించుకోవాలంటే.. ఆయన ఇంకెప్పుడూ అలా మాట్లాడకుండా సంయమనం వీడకుండా, హద్దు దాటకుండా ఉంటే చాలు.

Show comments