తండ్రుల కోసం కొడుకులు చెమటోడుస్తున్నారు!!

తండ్రులు ఇద్దరు ఘనమైన రాజకీయ చరిత్ర కలిగిన వారే. ఇద్దరూ ఉద్ధండులే. ఇద్దరూ మంత్రులుగా చక్రం తిప్పిన వారే. ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ మంత్రులు చింతకాయల అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా ఒకనాడు రాజకీయం చేస్తూ వచ్చారు.

ఈసారి ఎన్నికలు ఇద్దరికీ దాదాపుగా చివరివి అని అంటున్నారు. ఇద్దరూ ఈ ఎన్నికల్లో గెలిచి మరోసారి రాజకీయంగా హవా చాటాలని చూస్తున్నారు. తమ వారసులను 2029 నాటికి తెచ్చి వారికి రాజకీయం అప్పగించాలని అనుకుంటున్నారు.

దాంతో ఈసారి ఎన్నికల్లో తండ్రుల కంటే తనయులు ఎక్కువగా కష్టపడుతున్నారు. నర్శీపట్నంలో అయ్యన్నపాత్రుడు విజయానికి కుమారుడు విజయ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. వ్యూహాలు ఎన్నికల ప్రణాళికలు అన్నీ ఆయనే చూస్తున్నారు. ప్రచారంలో అధిక భాగం విజయ్ చేతులో మీదుగానే జరుగుతోంది.

పదవ సారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న అయ్యన్న రాజకీయ విరమణ ఘనంగా ఉండాలని విజయ్ తాపత్రయపడుతున్నారు అంటున్నారు. భీమిలీ నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్న గంటా శ్రీనివాసరావు కోసం కుమారుదు గంటా రవితేజా పాటుపడుతున్నారు. మండుటెండలో తనయుడే జనంలో తిరుగుతున్నారు ఈసారి గంటా గెలిస్తే వచ్చే ఎన్నికల్లో రవితేజా పోటీకి సిద్ధంగా ఉంటారు అని అంటున్నారు.

Readmore!

గంటా విజయం కోసం రవితేజా వ్యూహ రచన చేస్తున్నారు. ఈసారి పార్టీ ప్రచారం అంతా ఆయనే చూస్తున్నారు. తెలుగుదేశంలో సీనియర్లు అయిన ఈ ఇద్దరు మాజీ మంత్రుల విజయంలో కుమారుల పాత్ర ఎంతవరకూ ఉంటుంది, తండ్రులకు విజయాన్ని వారు అందించగలరా అన్నది టీడీపీలోనూ బయటా హాట్ టాపిక్ గా ఉంది. ఈసారికి తండ్రులను గెలిపిస్తేనే తనయులకు కూడా రాజకీయ ఫ్యూచర్ ఉంటుందని అంటున్నారు.

Show comments