చంద్ర భక్తి చాటుకున్న సీఎం!

సభ చూస్తే ఎన్డీయే కూటమిది. ఆయన పోటీ చేస్తున్నది బీజేపీ తరఫున. ఆ పార్టీ నాయకుడు దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ సభలో ఉన్నారు. అయినా తన ఒకనాటి రాజకీయ గురువు చంద్రబాబు మీద భక్తిని అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సీఎం రమేష్ చాటుకున్నారు.

చంద్రబాబే సామాజిక పెన్షన్ ని రెండు వందల రూపాయలు ఉన్న దానిని రెండు వేల రూపాయల దాకా పెంచారని రమేష్ పొగిడారు. ఈసారి ఎన్నికల్లో ఒక్కో ఇంటికీ మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెబుతున్నారు ఇది ఆయన చేస్తున్న సంక్షేమం కాదా అని ప్రశ్నించారు.

ఒక ఇంట్లో ఎంత మంది చదువుకుంటే అంతమందికీ ఒక్కొక్కరికీ  పదిహేను వేల రూపాయలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, మహిళలకు ఉచిత బస్సు సదుపాయం కల్పించారు అని రమేష్ టీడీపీ మ్యానిఫేస్టో సభలో ఊదరగొట్టారు. ఆయన నిజానికి చెప్పల్సింది బీజేపీ మ్యానిఫేస్టో.

టీడీపీ ఉచిత హామీలకు బీజేపీ గ్యారంటీగా ఉండలేమని అంటోందని ప్రచారంలో ఉంది. పైపెచ్చు ఉచితాలకు తాయిలాలకు బీజేపీ నరేంద్ర మోడీ పూర్తిగా వ్యతిరేకం. అయినా బీజేపీ అగ్ర నేత ప్రధానిని వేదిక మీద ఉంచుకుని ఆయనను కీర్తించాలి, బీజేపీ ఏపీకి ఏమి చేస్తుందని వివరించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ వంటి అంశాల మీద హామీలు రాబట్టాలి. కానీ సీఎం రమేష్ మెడలో బీజేపీ కండువా ఉన్నా ఆయన ఎన్నికల ప్రచారంలో తిరిగేది టీడీపీ వారితోనే అన్న విమర్శలు ఇప్పటికే ఉన్నాయి. ఇపుడు సభలో చంద్రబాబుని చూడగానే ఆయనలో చంద్ర భక్తి తన్నుకుని వచ్చిందని సెటైర్లు పడుతున్నాయి.

Readmore!

సీఎం రమేష్ కూడా అలా పొగడాల్సిందే. ఎందుకంటే అనకాపల్లిలో బీజేపీకి ఏమీ ఓటు బ్యాంకు లేదు. ఓట్లు వేయాల్సింది టీడీపీ వారే. అందువల్లనే స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా తెలివిగానే ఆయన తన ప్రసంగం చేశారు అని అంటున్నారు.

Show comments