రాయపాటికి.. బాబుకు ఎక్కడ చెడింది?

తెలుగుదేశం పార్టీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు.. ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు మధ్య విబేధాలు వచ్చాయా? రాయపాటికి, బాబుకు ఇంతకూ ఎక్కడ చెడింది. తొలి రోజేమో.. తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల అవినీతి తారా స్థాయికి చేరిందని రాయపాటి వ్యాఖ్యానించగా.. ఇప్పుడు తెలుగుదేశం అనుకూల పత్రికలో రాయపాటికి చెందిన ట్రాన్స్ ట్రాయ్ మీద దుమ్మెత్తిపోస్తూ ఒక కథనం ప్రచురితం అయ్యింది. ఇదంతా చర్యకు ప్రతి చర్యగానే అగుపిస్తోంది. ఇదే సమయంలో లక్ష్మీ పార్వతి చేసిన ఒక వ్యాఖ్యానం కూడా గమనించాల్సిన అంశం.

ముందుగా.. రాయపాటి ఏమన్నాడంటే, తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో అవినీతి అక్రమాలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయని, ఎన్నడూ లేనంత స్థాయికి ఇవి చేరాయని  అన్నాడు.

ఇక నందమూరి లక్ష్మీ పార్వతి ఏమన్నారంటే.. పోలవరం కాంట్రాక్టులు ట్రాన్స్ ట్రాయ్ కి అప్పగించినా, ఆ పనులను సబ్ కాంట్రాక్ట్స్ గా విడగొట్టి అన్నింటినీ లోకేష బాబు అనుచర గణమే సొంతం చేసుకుందని.. పెంచుతున్న అంచనా వ్యయాలు అలా లోకేష్ బాబుకు చేరుతున్నాయని ఆమె వ్యాఖ్యానించింది.

ఇక తాజాగా తెలుగుదేశం అధికార పత్రిక ఒకటి ట్రాన్స్ ట్రాయ్ మీద దుమ్మెత్తి పోస్తూ ఒక ఆర్టికల్ రాసింది. దాని సారంశం ఏమనగా.. ట్రాన్స్ ట్రాయ్ సంస్థ ఒక చేతగాని దద్దమ్మ అని. కనీసం ఒక రోడ్డు నిర్మించలేకపోయింది అని ఈ పత్రిక పేర్కొంది.

కాకినాడ- రాజమహేంద్రవరం (కేఆర్ రోడ్డు) విస్తరణ పనులకు  నిధుల విడుదలకు ప్రపంచ బ్యాంకు నో చెప్పిందని, దీనికంతటికీ కారణం ఆ రోడ్డు విస్తరణ చేపట్టిన ట్రాన్స్ ట్రాయ్ సంస్థ నిర్వాకమే అని ఆ పత్రికలో పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు రుణంతో చేపట్టిన ఈ విస్తరణలో మూడేళ్లలో కేవలం ఆరు శాతం పనులు మాత్రమే పూర్తి అయ్యాయని.. ఈ కాంట్రాక్టర్ ను తొలగించాలని ప్రపంచ బ్యాంకు కోరిందని.. అయితే సర్కారు మాత్రం పట్టించుకోకపోవడం చివరకు ఈ పనులకు డబ్బులు ఇచ్చే ప్రతిపాదనను వరల్డ్ బ్యాంక్ విరమించుకుందని ఈ పత్రిక రాసిన పతాక శీర్షిక కథనంలో పేర్కొన్నారు.

ఈ కథనంలో ఒకింత తీవ్ర వ్యాఖ్యానాలూ ఉన్నాయి. బాబు పేరు ఎత్తలేదు కానీ.. “ప్రభుత్వానికి ఆ కాంట్రాక్టు సంస్థపై వల్లమాలిన అభిమానం..’’ అంటూ వ్యాఖ్యానించడం జరిగింది. 

మరి ఊరక రాయరు మహానుభావులు అన్నట్టుగా.. ఒక తెలుగుదేశం పార్టీ ఎంపీకి చెందిన, అది కూడా ప్రతిష్టాత్మక పోలవరం కాంట్రాక్టరు అయిన రాయపాటి కి చెందిన సంస్థ విషయంలో ఇలాంటి కథనం రావడం.. అందునా తెలుగుదేశం జాకీ పత్రికలో ఇలాంటి కథనం రావడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఏవో పోతున్నాయని ఈ కథనం రాసి ఉంటారని అనుకోవడానికి లేదు. వీళ్లకూ వీళ్లకూ ఎక్కడో చెడి ఉంటుంది.. అందుకే ఈ తరహా కథనాలు వస్తున్నాయని సులభంగానే అర్థం అవుతోంది.

ఇదిలా ఉంటే.. ఇక్కడ ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అంశాలూ కొన్ని ఉన్నాయి. ఒక రోడ్డు విస్తరణ పనులు చేపట్టలేకపోయిందని.. సొంత మీడియానే దుమ్మెత్తిపోస్తోంది.. మూడేళ్లలో ఆరు శాతం పనులు కూడా పూర్తి చేయలేదు.. ఆ కాంట్రాక్టర్ తీరుతో ప్రపంచ బ్యాంకు రెండు వందల కోట్ల రూపాయల రుణాన్ని ఇవ్వకుండా వెళ్లిపోయింది.. మరి ఆ చేతగాని కాంట్రాక్టర్ చేతిలోనే పోలవరం పనులు కూడా ఉన్నాయి కదా!

బాబుగారేమో.. 2018 కి పోలవరం పూర్తి అంటారు. ట్రాన్స్ ట్రాయ్ సత్తా ఏమో అలా ఉంది. మరి ఆ సంస్థను ఎలా కొనసాగిస్తారు? ఈ కాంట్రాక్టర్ చేతగాని తనం గురించి కేంద్ర ప్రభుత్వం అయినా  పట్టించుకోదా? జాతీయ ప్రాజెక్టు విషయంలో ఇలాంటి తాత్సారాన్నే కొనసాగిస్తుంటే చూస్తూ ఊరికే ఉంటుందా? ఇదేనా అనుభవజ్ఞుడి పాలన?

Show comments