వామ్మో..మాయ‌దారి రోగం మ‌న వ‌ర‌కూ వ‌చ్చేసిందే!

అస‌లే కరోనా సెకెండ్ వేవ్ నుంచి ఎలా బ‌య‌ట‌ప‌డాలో జ‌నాల‌కు అర్థం కాని ప‌రిస్థితి. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో మూలిగే న‌క్క‌పై తాడికాయ ప‌డ్డ చందంగా, బ్లాక్ ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్ రూరంలో మ‌రో విప‌త్తు భ‌య‌పెడుతోంది. 

ఇటీవ‌లే క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి కోలుకున్న వాళ్ల‌లో ఈ బ్లాక్ ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్ చోటు చేసుకుని మ‌నిషి కంటి చూపు పోగొట్ట‌డంతో పాటు ప్రాణాలు కూడా తీస్తోంద‌ని మీడియా ద్వారా తెలుసుకున్నాం. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాటు ప‌రిస‌ర న‌గ‌రాల్లోనే ఇలాంటి కేసులు బ‌య‌ట ప‌డిన‌ట్టు తెలుసుకున్నాం.

తాజాగా మ‌రో పిడుగులాంటి స‌మాచారం. ఈ ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ తాజాగా హైదరాబాద్‌లోనూ వెలుగు చూసింది. అంటే మ‌న వ‌ర‌కూ వ‌చ్చేసింద‌న్న మాట‌. హైదరాబాద్‌లోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో ఐదుగురు కరోనా బాధితుల్లో ఈ ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో మ‌రింత ఆందోళ‌న నెల‌కుంది. 

కరోనా చికిత్సలో భాగంగా ఇష్టానుసారం స్టెరాయిడ్స్‌ వాడుతున్న వారిలో, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో ఈ బ్లాక్‌ ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువగా కనిపిస్తోందని కాంటినెంటల్‌ ఆస్పత్రి ఈఎన్‌టీ వైద్యుడు డాక్టర్‌ దుశ్యంత్‌ తెలిపారు.
 
క‌రోనా నుంచి కోలుకున్నామ‌నే ఆనందాన్ని ఈ ఇన్‌ఫెక్ష‌న్ మ‌టుమాయం చేస్తోంది. అలాగే కోవిడ్ రోగికి ట్రీట్‌మెంట్ అందిస్తున్న వైద్యులు స్టెరాయిడ్స్ వాడ‌కంపై ఒక‌టికి ప‌దిసార్లు ఆలోచించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. కోవిడ్‌ను నిర్మూలించ‌డం ఎంత ముఖ్య‌మో, ఆ క్ర‌మంలో కొత్త స‌మ‌స్య త‌లెత్త‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం కూడా అంతే ముఖ్య‌మ‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

ముఖ్యంగా ఈ ఫంగస్‌ ముక్కు నుంచి రక్తనాళాలకు వెళ్లి కండరాలు, ఎముకలను దెబ్బ తీస్తుంద‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తు న్నారు. ఈ ఫంగ‌స్ ప్రాణాంత‌క‌మైంద‌ని చెబుతున్నారు. వాతావరణంలో సహజంగా ఉండే మ్యుకోర్‌ అనే ఫంగస్‌ వల్ల ఇది వ్యాపిస్తుంద‌ని తేల్చారు. కోవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత ముక్కు, నోటిలో పొక్కులు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాల‌ని వైద్యులు సూచిస్తున్నారు.

Show comments