మోదీ మ‌ళ్లీ వ‌స్తే... ఎన్నిక‌లు మ‌రిచిపోవాల్సిందే!

ప్ర‌ధాని మోదీ, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌పై మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి విరుచుకుప‌డ్డారు. మీడియాతో ఆయ‌న మాట్లాడుతూ కేసీఆర్ చ‌చ్చిన పాముతో స‌మానమ‌న్నారు. ఆయ‌న గురించి మాట్లాడ్డం టైమ్ వేస్ట్ అన్నారు. అచ్చే దిన్ తీసుకొస్తానే నినాదంతో మోదీ ప్ర‌ధాని అయ్యార‌న్నారు. 

అలాగే విదేశాల్లో ఉన్న బ్లాక్ మ‌నీని తీసుకొస్తాన‌ని మోదీ అంద‌ర్నీ న‌మ్మించార‌న్నారు. ఒక్కొక్క‌రి బ్యాంక్ ఖాతాలో రూ.15 ల‌క్ష‌లు జ‌మ చేస్తాన‌ని మోదీ గొప్ప‌లు చెప్పార‌న్నారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత క‌నీసం 15 పైస‌లు కూడా జ‌న్‌ధ‌న్ ఖాతాలో ప‌డ‌లేద‌ని మంత్రి వెంక‌ట‌రెడ్డి విమ‌ర్శించారు. ప‌దేళ్లుగా ప్ర‌ధాని గా వుంటూ దేశానికి ఏం చేశారో మోదీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో చెప్ప‌డం లేద‌న్నారు.

ఇంకా రాముడి పేరుతో ఓట్లు అడుగుతున్నార‌ని మంత్రి విమ‌ర్శించారు. మ‌తాల పేరుతో ఎన్నిక‌ల ప్ర‌చారం చేస్తున్నాడంటే మోదీకి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని అర్థ‌మ‌వుతోంద‌న్నారు. రూ.400 సిలిండ‌ర్ రూ.1200 కావ‌డంపై మోదీ మాట్లాడ‌ర‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క్రూడాయిల్ ధ‌ర‌లు త‌గ్గినా, పెట్రోల్ ధ‌ర‌లు మాత్రం పెరుగుతూనే ఉన్నాయ‌ని మంత్రి వెంక‌ట‌రెడ్డి మండిప‌డ్డారు.

మోదీ ముచ్చ‌ట‌గా మూడోసారి ప్ర‌ధాని అయితే మాత్రం... ఈ దేశంలో 2029 నాటికి ఎన్నిక‌ల‌ను మ‌రిచిపోవ‌చ్చ‌ని మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ర‌ష్యా, చైనా దేశాల్లో మాదిరిగా మ‌న దేశంలో కూడా శాశ్వ‌తంగా మోదీనే వుండేలా చేసుకుంటార‌ని కామెంట్ చేశారు. ఇదే సంద‌ర్భంలో మోదీ ఒక మ‌తాన్ని టార్గెట్ చేస్తే, జ‌ర‌గరానిది ఏదైనా జ‌రిగితే మిల‌ట‌రీ కూడా నిలువ‌రించ‌లేద‌ని ఆయ‌న హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

Readmore!

Show comments