సింహం సింగిల్ గా వస్తుందా... రేపు తేలిపోతుంది?

రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయాలి. ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలి. దశాబ్దాలుగా రజనీకాంత్ కంటున్న కల ఇది. మరి రాబోయే తమిళనాడు ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా? అసలు ఆయన రాజకీయాల్లోకి వస్తారా రారా? ఈ ప్రశ్నలకు రేపు సమాధానం తెలుస్తుంది.

తన పార్టీకి చెందిన జిల్లా కార్యదర్శులతో రజనీకాంత్ రేపు సమావేశం కాబోతున్నారు. మరికొన్ని నెలల్లో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే అంశాన్ని రేపు డిసైడ్ చేస్తారు. అంతకంటే ముందు తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెట్టాలా వద్దా అనే విషయాన్ని రేపటి మీటింగ్ లో డిసైడ్ చేస్తారు.

రజనీకి సంబంధించి గత నెల సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఓ లేఖ తీవ్ర గందరగోళం సృష్టించిన సంగతి తెలిసిందే. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మరింత ఆలస్యం అవుతుందని, ఆయన పూర్తిగా రాజకీయాాల నుంచి తప్పుకోవచ్చని, ఈ కరోనా పరిస్థితుల్లో రజనీకాంత్ ప్రజల్లోకి రావడం ప్రమాదకరమంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. దీనిపై వెంటనే స్పందించిన రజనీకాంత్, ఆ లేఖకు తనకు సంబంధం లేదని ప్రకటిస్తూనే, లేఖలో పేర్కొన్నట్టు ''వైద్యుల సలహా'' మాత్రం నిజమేనని అంగీకరించారు.

ఈ నేపథ్యంలో రజనీకాంత్ ఎన్నికలకు సన్నద్ధంగా ఉన్నారా లేదా అనే విషయం రేపు డిసైడ్ అవుతుంది. ఒకవేళ వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయాలని రజనీకాంత్ నిర్ణయించుకుంటే మాత్రం దానికి సంబంధించిన పూర్తి విధివిధానాల్ని రజనీ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న ప్రకటించే అవకాశం ఉంది.

ఇద్దరు రాజకీయ ఉద్దండులు జయలలిత, కరుణానిధి మరణించిన తర్వాత తమిళనాట రాజకీయ శూన్యత ఏర్పడిన మాట వాస్తవం. ఇప్పుడున్న డీఎంకే, అన్నాడీఎంకే  నేతలు ఆ విషయాన్ని కొట్టిపారేస్తున్నప్పటికీ.. ప్రజలు, రాజకీయ విశ్లేషకుల్లో ఇదే అభిప్రాయం ఉంది. అంతేకాదు, ఆ గ్యాప్ ను భర్తీ చేసే సామర్థ్యం, అవకాశం రజనీకాంత్, కమల్ హాసన్ కు మాత్రమే ఉందనేది అందరి మాట.

రాష్ట్ర బాగు కోసం కలిసి పనిచేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని రజనీ, కమల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు తమిళనాట ఉన్న రాజకీయ శూన్యతను రజనీ సహాయంతో భర్తీ చేసేందుకు భారతీయ జనతా పార్టీ చాన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇన్ని సమీకరణాల మధ్య రేపు జరగనున్న కార్యదర్శుల భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. 

మరి సింహం వస్తుందా రాదా.. వస్తే సింగిల్ గా వస్తుందా, మరికొందరితో కలిసి వస్తుందా? రేపు తేలిపోతుంది.

పవన్ కు ఒక నీతి.. ప్రకాష్ రాజ్ కు మరో నీతి

Show comments