కుప్పంలో ఇరుపార్టీల కుమ్మ‌రింత రూ.300 కోట్లు

ఎన్నిక‌ల ఖ‌ర్చుపై ఈసీ నిబంధ‌న‌లు గాలిలో కలిసిపోయాయి. ఎన్నిక‌ల్లో గెలిచేందుకు రాజ‌కీయ పార్టీలు వంద‌ల కోట్లు ఖ‌ర్చు పెడుతున్నాయి. కుప్పంలో రెండు ప్ర‌ధాన పార్టీలు క‌లిపి చెరో రూ.150 కోట్లు చొప్పున మొత్తం రూ.300 కోట్లు ఖ‌ర్చు పెట్ట‌నున్నాయి. బ‌హుశా ఇంత మొత్తంలో గ‌తంలో ఎన్న‌డూ ఖర్చు పెట్టిన దాఖ‌లాలు లేవ‌నే మాట వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఒక పార్టీ ఓటుకు రూ.4 వేలు చొప్పున పంపిణీ మొద‌లు పెట్టింది. డిమాండ్‌ను బ‌ట్టి ఓటుకు రూ.5 వేలు కూడా ఇచ్చే ప‌రిస్థితి కొన్ని చోట్ల వుంది.

ఇలా అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు పోటీ ప‌డి మ‌రీ ఓట్ల కొనుగోలు వేట‌లో ప‌డ్డాయి. గ‌తంలో టీడీపీ ఓట‌ర్ల‌కు మొక్కుబ‌డిగా ఎంతోకొంత ముట్ట‌చెప్పి గంప‌గుత్త‌గా ఓట్లు వేయించుకునేవారు. ఇప్పుడు సీన్ మారిపోయింది. కుప్పంలో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఓటుకు డిమాండ్ పెరిగింది. టీడీపీకి దీటుగా వైసీపీ స‌వాల్ విసురుతోంది. బాబును ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా వైసీపీ పావులు క‌దుపుతోంది.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో టీడీపీని మ‌ట్టి క‌రిపించిన అనుభ‌వం ఉంది. ఈ చేదు జ్ఞాప‌కాల‌తో టీడీపీ ఏమ‌వుతుందోన‌ని భ‌య‌ప‌డుతోంది. అందుకే గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా చంద్ర‌బాబునాయుడి స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి కుప్పంలోనే మ‌కాం వేసి ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఏ మాత్రం తేడా రాకూడ‌ద‌ని పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు భువ‌నేశ్వ‌రి దిశానిర్దేశం చేస్తున్నారు.

త‌మ ప్ర‌త్య‌ర్థి వైఎస్ జ‌గ‌న్ ప‌ట్టుప‌డితే సాధించే వర‌కూ నిద్ర‌పోర‌నే సంగ‌తిని గుర్తు చేసుకుంటున్నారు. దీంతో కుప్పంపై టీడీపీ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంది. అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు చెరో వంద కోట్లు ఓట‌ర్ల‌కు, రూ.50 కోట్లు చొప్పున పార్టీ చిన్నా, పెద్దా నాయ‌కుల‌కు ఇచ్చి, ఎన్నిక‌ల్లో బాగా ప‌నిచేసేలా చ‌ర్య‌లు తీసుకున్నాయి. ఈ సారి కుప్పంలో ఏమ‌వుతుందో అనే భ‌యాన్ని చంద్ర‌బాబులో క‌లిగించ‌డంలో జ‌గన్ స‌క్సెస్ అయ్యారు.

Readmore!

Show comments