తెలంగాణ ఎన్నికల ప్రత్యేకత..!

తెలంగాణ ఎన్నికల ప్రత్యేకత ఏమిటి? ఇందుకు వెంటనే చెప్పే జవాబు ఇవి ముందస్తు ఎన్నికలని. నిజమే.. ఇదో ప్రత్యేకతే. కాని ముందస్తు ఎన్నికలు కొత్తకాదు. అసలు ప్రత్యేకత ఏమిటంటే... ఇతర పార్టీల నుంచి అధికార టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకపోవడం. టీడీపీ, కాంగ్రెసు, వైకాపా నుంచి అనేకమంది ఫిరాయించారు.

సిద్ధాంత నిబద్ధత ఉన్న పార్టీలుగా చెప్పుకునే సీపీఐ, సీపీఎం నుంచి కూడా ఫిరాయించారు. టీడీపీ, వైకాపా ఎంపీలు కూడా అధికార పార్టీలో చేరిపోయారు. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేయాలంటూ ఆయా పార్టీలవారు స్పీకరుకు అనేకసార్లు పిటిషన్లు ఇచ్చారు. కాని కదలిక లేదు. హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు వెళ్లారు అయినా ఫలితం లేకుండాపోయింది. టీడీపీ నుంచి ఫిరాయించిన తలసాని శ్రీనివాస యాదవ్‌కు మంత్రిపదవి ఇచ్చారు.

దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా అసెంబ్లీసీ స్పీకరుగాని, లోక్‌సభ  స్పీకరుగాని, కేసీఆర్‌గాని పట్టించుకోలేదు. కోర్టులూ ఏమీ చేయలేకపోయాయి. ఎన్నికలు వచ్చే ఏడాది కదా ఫిరాయింపుదారులపై వేటుపడేలా చూడాలని పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కాని ఈలోగానే కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలు ప్రకటించేసి ఫిరాయింపుదారులందరికీ దాదాపు టిక్కెట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఫిరాయింపుదారులపై వేటు పడకుండానే ఎన్నికలు జరగడం మన ప్రజాస్వామ్యం ప్రత్యేకత.

దీన్నిబట్టి చూస్తే అనైతికతను వ్యవస్థలు పట్టించుకోవడంలేదని అర్థమవుతోంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే ఏపీలోనూ ఇదే దృశ్యం కనబడటం ఖాయం. తెలంగాణలో ఒక్క ఫిరాయింపుదారుకు మంత్రిపదవి ఇవ్వగా, అక్కడ నలుగురిని మంత్రులను చేశారు సీఎం చంద్రబాబు. తెలంగాణ ఎన్నికల మరో ప్రత్యేకత ఏమిటంటే మహిళకు మంత్రిపదవి ఇవ్వకుండానే కేసీఆర్‌ కాలం గడిపేశారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలు గణనీయంగా పాల్గొన్నప్పటికీ తొలి మంత్రివర్గంలో వారికి స్థానం లేకుండాపోయింది.

ఇందుకు కేసీఆర్‌ ఏనాడూ వివరణ ఇవ్వలేదు. గులాబీ నాయకులు మనసులో ఏమనుకున్నారో తెలియదుగాని ఈ విషయమై ప్రశ్నించే ధైర్యం మహిళా ఎమ్మెల్యేలకు సైతం లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాదులో గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ సదస్సు జరిగినప్పటినుంచి కనీసం ఒక్క మహిళకైనా మంత్రిపదవి ఇస్తారనే ప్రచారం జరిగినా నెరవేరలేదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె ఇవాంకా ట్రంప్‌కు అడుగులకు మడుగులొత్తి బ్రహ్మరథం పట్టిన టీఆర్‌ఎస్‌ సర్కారు ఒక్క మహిళకైనా మంత్రిపదవి ఇవ్వకుండా ఎందుకు అవమానించిందనే ప్రశ్న జోరుగా వినిపించింది.

ఈ సమ్మిట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మంత్రి కేటీఆర్‌కు ఈ ప్రశ్న ఎదురైనప్పుడు సరైన సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. కేటీఆర్‌నే మహిళా మంత్రి అనుకోవాలా? అని కాంగ్రెసు ఎమ్మెల్యే డీకే అరుణ అంతర్జాతీయ సదస్సు సందర్భంగా ఎద్దేవా చేశారు.

దీంతో ఏం చెప్పాలో అర్థంకాని ఈ మంత్రి ఎక్కువమంది మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాకపోవడంవల్ల ఈ పరిస్థితి ఏర్పడివుండొచ్చన్నారు. టీఆర్‌ఎస్‌ తరపున ఆరుగురు మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కనీసం ఒక్కరికైనా పదవి ఇవ్వలేదు కేసీఆర్‌.

Show comments