పొంగులేటి మరీ ఓవరాక్షన్ చేస్తున్నారా?

కేసీఆర్ ప్రభుత్వాన్ని తెలంగాణలో గద్దెదించి తీరాల్సిందేనని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంకణం కట్టుకుని ముందుకు సాగుతున్న సంగతి అందరికీ తెలిసింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆత్మీయ సమావేశాల పేరిట తన బల ప్రదర్శనలను ఆయన కొనసాగిస్తున్నారు. 

తన తరహాలోనే.. భారాసలో చిన్నచూపునకు గురై, కేసీఆర్ మీద తనలాగానే కక్ష కట్టిన మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో మాత్రమే ఆయన ఇప్పటిదాకా జత కట్టారు. ఈ ఇద్దరూ తరచూ కలుస్తున్నారు.. కేసీఆర్ మీద విమర్శల జడివాన కురిపిస్తున్నారు గానీ.. తమ రాజకీయ భవిష్యత్ ప్రస్థానం ఎలా ఉండబోతుందనే విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు.

పొంగులేటి ఆర్థిక వనరుల పరంగా కూడా ఏ పార్టీకి అయినా దన్నుగా ఉండగల బలమైన నాయకుడు కావడంతో.. పార్టీలు ఆయనకోసం ఎగబడుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు కూడా పొంగులేటితో భేటీ అయి, తమ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నించారు. బిజెపి మడమ తిప్పని ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది.

ఇతర పార్టీల్లోని నాయకులను తమ పార్టీలోకి ఫిరాయింపజేసుకోవడం ఒక ఉద్యమంగా, కార్యక్రమంగా ప్లాన్ చేసి, ప్రత్యేకంగా చేరికల కమిటీ అంటూ ఒకటి ఏర్పాటుచేసి ఆ వ్యవహారం నడిపిస్తున్నది. సదరు చేరికల కమిటీ సారథి ఈటల రాజేందర్.. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కమలదళంలోకి తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఇవాళ రెండోసారి కూడా భేటీ అయ్యారు. అయితే ఆ భేటీ పెద్ద ఫలవంతంగా జరగలేదని తెలుస్తోంది.

కేసీఆర్‌ను గద్దె దించడానికి బిజెపి యాక్షన్ ప్లాన్ ఏమిటో పొంగులేటి ఆరా తీశారని, అందుకు ఈటల చెప్పిన వివరణ, కార్యచరణ గురించి పొంగులేటి సంతృప్తి చెందలేదని, ఈటల మాత్రం పొంగులేటి, జూపల్లి ఇద్దరినీ తమ పార్టీలోకి ఆహ్వానించారని వార్తలు వస్తున్నాయి.

కేసీఆర్ ను గద్దె దింపడమే లక్ష్యం అయినప్పుడు.. పొంగులేటి బిజెపిని కూడా తృణీకరించి ఏం సాధించదలచుకున్నారు. ఆయన కాంగ్రెస్ ఆఫర్ ను కాలదన్నారు. బిజెపి బలం, వ్యూహం ఇప్పుడు తనకు నచ్చలేదని ఆయన అంటున్నారు. మరేం చేయదలచుకుంటున్నారు. మరో ఆరునెలల్లో రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ను పతనం చేయడానికి, ఖమ్మం జిల్లా తప్ప మరెక్కడా బలం లేని ఈ నాయకుడు సొంత పార్టీ పెట్టాలనుకుంటున్నారా? అనేది ప్రశ్న!.

తనకు ధనబలం పుష్కలంగా ఉన్నది కదాని, తన అండ కోసం పార్టీలే వచ్చి అడుగుతున్నాయి కదా అని.. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓవరాక్షన్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

Show comments