అందరికంటె ముందు పవన్‌కే మూడొచ్చింది!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగడానికి ఇంకా ఇంచుమించు రెండేళ్ల వ్యవధి ఉంది. ప్రజలతో కలిసి నడుస్తున్న ప్రభుత్వం.. ముందస్తుకు వెళ్లే ఎలాంటి ఆలోచన చేయడం లేదు. 

ఆ విషయాన్ని పార్టీనేతలు ఇప్పటికే అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు కూడా. ఏదో చంద్రబాబునాయుడు.. తన పార్టీ కకావికలం అయిపోకుండా కాపాడుకోడానికి.. ముందస్తు ఎన్నికలు వస్తాయనే పదాలు వల్లిస్తూ కాలం గడుపుతున్నారు. ఏ రకంగా చూసినా సరే.. రెండేళ్ల వ్యవధి ఉన్నప్పుడు.. అప్పుడే ఎన్నికల మూడ్ వస్తుందని అనుకోవడం భ్రమ. 

కానీ.. ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టె ఒకదారి అన్నట్టుగా పవన్ కల్యాణ్ రూటే వేరు. ఆయనకు అందరికంటె ముందు ఎన్నికల మూడ్ వచ్చేసింది. అప్పుడే ఆ ఏర్పాట్లో పడిపోయారు. పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు లాంటివి.. ప్రతి పార్టీ కూడా ఏదో ఒక సమయంలో నిర్వహిస్తూనే ఉంటుంది. శిక్షణ తరగతుల ప్రారంభానికి, చివర్లో పవన్ ప్రసంగానికి మాత్రం మీడియాను అనుమతిస్తూ.. శిక్షణలో ఏం చెబుతున్నారో బయటివాళ్లకు తెలియకుండా సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. అది కూడా మంచిదే. 

‘జనవాణి’ పేరుతో ఇంకో కార్యక్రమం మొదలు పెట్టబోతున్నారు. ప్రజలందరి నుంచి పవన్ కల్యాణ్ వారి సమస్యలను అర్జీలుగా తీసుకుని, వాటికి రసీదులను కూడా ఇస్తారు. ఇదీ కార్యక్రమం. అయితే ఇలా పవన్ కల్యాణ్ ప్రజల సమస్యలను ఆలకించడం అనేది కేవలం అయిదు వారాలు మాత్రమే ఉంటుంది. ఇదేం లెక్క.. అని అడగడానికి వీల్లేదు. 

జనం భారీగా తరలివస్తారనే అంచనాలతో.. ఈ జనవాణి కార్యక్రమానికి కల్యాణ మండపాలు లాంటివి బుక్ చేసుకున్నారు. ఆ వేదికల మీద ఫ్లెక్సిలు సహజంగా ఉంటాయి కదా.. అయితే.. ఆ ఫ్లెక్సిలమీద గ్లాసు గుర్తుకే మన ఓటు అని ఇప్పటినుంచే ప్రచారం చేయడమే చిత్రం! తతిమ్మా పార్టీలు ప్లీనరీలు ఇతర భారీ సభలు నిర్వహించుకుంటూ తమను తాము ఎన్నికలకోసం రెడీ చేసుకుంటున్నాయి గానీ.. ఇప్పుడే ప్రజలకు ఓటు గురించి విన్నపాలు చేసుకోవడం మొదలు కాలేదు. 

కానీ, అధికారంలో చేతిలో లేని పవన్ కల్యాణ్.. ప్రజల సమస్యలను తీర్చేస్తానంటూ.. అర్జీలు మీరు నా చేతికివ్వండి, నేను అధికారుల చేతికిస్తా అంటూ.. మద్యలో ఫ్లెక్సిల మీద ‘‘గ్లాసు గుర్తుకే మీ ఓటు’’ అని ప్రచారం చేసుకోవడం అనేది చాలా లేకిగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 

ప్రజల సమస్యలను అర్జీలు తీసుకుంటాను.. అనే ముసుగులో.. ఎన్నికల ప్రచారానికే ఆయన దిగుతున్నారని ప్రజలు నవ్వుకుంటున్నారు. అయినా ఎన్నికల ప్రచారం అనేది.. ప్రజల వద్దకు తాను వెళ్లి చేసుకోవాలి.. తన వద్దకు వచ్చిన వాళ్లను గ్లాసుకు ఓటు వేయమనడం కాదు.. అనే క్లారిటీ వారికి మిస్ అయినట్టుంది. అంత క్లారిటీ ఉంటే.. 2019లో అలాంటి పరాభవం ఎందుకు దక్కుతుంది గనుక!

Show comments