ప్రాణాలు బలితీసుకుంటూ ఎదురుదాడి!

వృద్ధుల పెన్షన్ల విషయంలో చంద్రబాబునాయుడు డ్రామాలను, దుర్మార్గాలను ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నారు. వయస్సు మళ్లిన వారు శ్రమ పడే అవసరం లేకుండా.. వారికి ఇళ్ల వద్దనే నగదురూపంలో వాలంటీర్ల ద్వారా అందించే ఒక అద్భుతమైన వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి రూపుదిద్దితే.. తన తైనాతీలద్వారా పితూరీలు పెట్టించి.. ఆ వ్యవస్థను పెన్షన్ల ప్రక్రియకు దూరం పెట్టించిన కుట్రదారుడు చంద్రబాబునాయుడు.

ఆయన కుట్రల ఫలితంగా ఏప్రిల్ లో 33 మంది వృద్ధులు చనిపోయారు. ఈ నెలలో ఇప్పటికే పదిమందికి పైగా మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవైపు తన దుర్బుద్ధి ద్వారా ప్రజల ప్రాణాలు బలితీసుకుంటూ.. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆపాపాలు పులమాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబు తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు.

పెన్షన్ల వ్యవహారంలో చంద్రబాబునాయుడు తీరు సర్వత్రా ఆక్షేపణీయం అవుతోంది. రాష్ట్రమంతా చంద్రబాబు పుణ్యమాని వృద్ధుల మరణమృదంగం మోగుతోంది. వాలంటీర్లను పెన్షన్లు పంచకుండా ఆపించడం వలన.. గత నెలలో ఆ ఉత్తర్వులు వచ్చిన తర్వాత సమయం కూడా లేకపోవడంతో.. ప్రభుత్వం సచివాలయాల వద్దకే వచ్చి పింఛన్లు తీసుకోవాలని సూచించింది.

ఈ నెలలో వాలంటీర్లు లేకపోయిన నేపథ్యంలో ప్రభుత్వం చేయగల అత్యుత్తమ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించింది. దాదాపు 25 శాతం మందికి ఇళ్లవద్దకే పింఛన్లు చేరుస్తూ.. సుమారు 75 శాతం మందికి మాత్రం  బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్ చేశారు. అంతకు మించి ప్రభుత్వం చేయదగిన మరో మార్గాంతరం లేదని ప్రభుత్వమే చెబుతోంది.

Readmore!

అయితే.. అందరికీ ఇళ్ల వద్దకే పెన్షన్లు ఇవ్వాలంటూ మొసలి కన్నీరు కార్చిన చంద్రబాబునాయుడు.. ఎండల్లో బ్యాంకుల చుట్టూ తిరగలేక వృద్ధులు పండుటాకుల్లా రాలిపోతూంటే వికృతానందం పొందుతున్నారు. ఈ పాపాలను జగన్ కు పులమడానికి ప్రయత్నిస్తున్నారు.

పింఛన్ల విషయంలో చంద్రబాబు తొలినుంచి డ్రామాలు ఆడుతూనే ఉన్నారు. జగన్ 3000 ఇస్తుండగా.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత 4000 వంతున ఇస్తానని చంద్రబాబునాయుడు వేలం పాటలాగా మభ్యపెట్టే ప్రకటన చేశారు. తీరా ఏప్రిల్లో 33 మంది వృద్ధులు చనిపోయిన తర్వాత.. రాష్ట్రం మొత్తం తననే శాపనార్థాలు పెడుతూ ఉండడంతో వృద్ధులకు మరో బిస్కట్ వేసే ప్రయత్నం చేశాడు.

తాను పెంచిన నాలుగువేల పెన్షనును ఏప్రిల్ నెలనుంచే అరియర్స్ సహా ఇస్తానని వారికి ఆశ పెట్టారు. అయితే ఇదంతా కేవలం తన దుర్మార్గాన్ని ప్రజలు గుర్తించకుండా మభ్యపెట్టడానికి కుయుక్తి అని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజల ప్రాణాలు బలితీసుకుంటూ ఆయన జగన్ పార్టీపై ఎదురుదాడిచేస్తున్నారని అంతా అంటున్నారు.

Show comments