పవన్ కాంగ్రెస్ వలలో పడినట్లేనా..?

తెలంగాణలో జనసేన పార్టీలేదు, పార్టీ ఉందని చెప్పుకున్నా క్యాడర్ లేదు, ఏ ఎన్నికల్లోనూ పోటీచేయలేదు. మరి తెలంగాణ సమస్యలతో జనసేనాని పవన్ కల్యాణ్ కు ఏంపని? తెలంగాణ ఆర్టీసీ సమ్మె, సమ్మెపై కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్పందించలేదు, ప్రతిపక్షనేత కూడా నోరు మెదపలేదు, మరి మూడో కృష్ణుడు జనసేనానికి తొందరేమొచ్చింది. కేసీఆర్ కి సుద్దులు చెప్పాల్సిన ఆలోచన, అవసరం పవన్ కి ఎందుకు అనేదే ఇప్పుడు ప్రశ్న.

సేవ్ నల్లమల అంటే రెండు తెలుగు రాష్ట్రాలకూ సంబంధించిన వ్యవహారం కావడంతో పవన్ స్పందించాడనుకుందాం, కానీ తెలంగాణ ఆర్టీసీతో పవన్ కి ఏం పనిపడింది. ఇదంతా కేవలం కాంగ్రెస్ మెప్పుకోసమే చేస్తున్నారేమో అనిపిస్తోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో మీ సహకారం కావాలంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు జనసేనకు ఓ అర్జీ పెట్టుకున్నారు. ఇలాంటి ఇగో శాటిస్ ఫై పనులంటే పవన్ కి భలే ఇష్టం. తమ మద్దతు కోరి వచ్చిన కాంగ్రెస్ కు ఎలాంటి హామీ ఇవ్వకుండా పంపించేసిన పవన్ కల్యాణ్, ఫొటోలు తీసి మాత్రం సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ మా మద్దతు కోరిందహో అంటూ డప్పు కొట్టుకున్నారు. ఇప్పుడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కి లబ్ధి చేకూర్చేందుకే పవన్ తెలంగాణ ఆర్టీసీ వ్యవహారంలో వేలు పెట్టారని భావిస్తున్నారు చాలామంది. ఆర్టీసీ సమ్మెకు, తెలంగాణ ఉద్యమం సమయంలో జరిగిన సకల జనుల సమ్మెకు లింక్ పెట్టి మంటరాజేసేందుకు తనవంతు ప్రయత్నించారు పవన్. వెన్ను నొప్పితో ప్రచారానికి రాలేనని మెలిక పెట్టినా, పవన్ ఇలా ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తూ కావాల్సినంత సాయం చేస్తానని కాంగ్రెస్ కి మాటిచ్చినట్టున్నారు. అందులో భాగంగానే ఓ శాంపిల్ బైటకు వదిలారు.

ఎన్నికలు దగ్గరపడేకొద్దీ కేసీఆర్ పాలనపై కూడా పవన్ విరుచుకుపడే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే అది కాంగ్రెస్ కి ఏంత మేలు చేస్తుందనే విషయమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. పవన్ సందేశం విని కాంగ్రెస్ కి ఓట్లు వేసేవారు ఎవరున్నారు? నిజంగా పవన్ పిలుపునకు స్పందించి ముందుకొచ్చే జనం తెలంగాణలో ఉన్నారా? ఆర్టీసీ వ్యవహారంతో కాస్తో కూస్తో ప్రజల్లో టీఆర్ఎస్ పై కోపం ఉన్నమాట వాస్తవమే. అయితే ఆ కోపాన్ని ఆర్టీసీ కార్మికుల వైపు తెలివిగా తిప్పేస్తున్నారు కేసీఆర్.

గతంలో ఇది కాంగ్రెస్ సీటే కాబట్టి, ఇప్పుడు మళ్లీ అదే పార్టీ గెలిచినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అదేమీ ప్రభుత్వ వ్యతిరేకతగా భావించాల్సిన అవసరం కూడా లేదు. ఇలాంటి టైమ్ లో పవన్ కల్యాణ్ కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు సపోర్ట్ గా ఉంటారనేది తేలాల్సి ఉంది.

జగన్‌ లో పరిణితి.. చంద్రబాబులో అసహనం

Show comments