జగన్ భారీ ఆఫర్ ఇచ్చారంటున్న అయ్యన్న!

జగన్ అంటే ఒంటి కాలి మీద లేచే టీడీపీ సీనియర్లలో విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఒకరు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేశారు. తనను వైసీపీలోకి రమ్మని జగన్ భారీ ఆఫర్ ఇచ్చారని ఆయన  చెప్పుకొచ్చారు.

తనకు నర్శీపట్నం ఎమ్మెల్యే సీటు, తన కుమారుడికి ఎంపీ సీటు ఆఫర్ చేస్తే తాను నో చెప్పాను అంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ అయ్యన్న ఇప్పుడు ఈ మాటలు చెప్పడం పట్ల వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. జగన్ కొందరిని ఎప్పటికీ పార్టీలోకి తీసుకోరని అయ్యన్నకు ఎలా ఆహ్వానం ఇస్తారని వారు అంటున్నారు. అయ్యన్న వచ్చినా తమకు అవసరం లేదని వారు అంటున్నారు.

నర్శీపట్నంలో వైసీపీకి గట్టి అభ్యర్ధిగా యువకుడు అయిన పెట్ల ఉమా శంకర్ ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అయ్యన్నను 2019లో పాతిక వేల ఓట్ల తేడాతో ఓడించామని ఈసారి ముప్పయి నుంచి ముప్పయి అయిదు వేల భారీ మెజారిటీని సాధిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు.

అయ్యన్నలో ఓటమి భయం పట్టుకుందని కూడా ఎద్దేవా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అసలు రాజకీయం అర్ధం అవుతోందని జనాల మూడ్ తెలిసే కొందరు టీడీపీ నేతలు ఇలా మాట్లాడుతున్నారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే అయ్యన్న అప్పుడే సానుభూతి అస్త్రం తీస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆయన తనకు ఇవే చివరి ఎన్నికలు అంటున్నారు. తాను ఈసారితో రాజకీయాలు వదిలేస్తాను తన వయసు ఆరోగ్యం దృష్ట్యా రాజకీయాల నుంచి తప్పుకుంటాను అంటున్నారు. ఇవి తన రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా పదవ ఎన్నికలు అని ఆయన చెబుతున్నారు. తన రాజకీయ వారసత్వాన్ని ప్రజలు నిర్ణయిస్తారు అని ఆయన అంటున్నారు.

Show comments