జ‌గ‌న్ ధైర్యం ఏంటంటే!

ఎట్ట‌కేల‌కు వైసీపీ మేనిఫెస్టో విడుద‌లైంది. వైసీపీ మేనిఫెస్టోపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మేనిఫెస్టోలో పొందుప‌రిచిన ప‌థ‌కాలు కొత్త‌వేమీ కాదు. వాటిని కొసాగిస్తూనే, కొన్నింటి ల‌బ్ధి పెంచారు. అలాగే మేనిఫెస్టో విడుద‌లకు ముందు జ‌గ‌న్ సుదీర్ఘ ప్ర‌సంగం చేశారు. ఈ ప్ర‌సంగాన్ని అధ్య‌య‌నం చేస్తే ఒక విష‌యం మాత్రం స్ప‌ష్టంగా అర్థమ‌వుతుంది.

చంద్ర‌బాబునాయుడు ఏం చెప్పినా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని, త‌న‌ను మాత్ర‌మే విశ్వ‌సిస్తార‌నే ధీమా జ‌గ‌న్‌లో క‌నిపించింది. ఆ ధైర్యంతోనే చంద్ర‌బాబునాయుడు రైతుల‌కు ప్ర‌తి ఏడాది రూ.20 వేలు ఇస్తానంటే, జ‌గ‌న్ మాత్రం రూ.4 వేలు త‌గ్గించి మ‌రీ రూ.16 వేలు ప్ర‌క‌టించారు. అలాగే పెన్ష‌న‌ర్ల‌కు చంద్ర‌బాబు తాను అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే రూ.4 వేలు ఇస్తానంటే, జ‌గ‌న్ మాత్రం రూ.3,500 మాత్ర‌మే ప్ర‌క‌టించారు. అది కూడా 2028, 2029 సంవ‌త్స‌రాల్లో రూ.250 చొప్పున పెంచి ఇస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం జ‌గ‌న్ ధైర్యం అనుకోవాలి.

ఇవే కాకుండా అమ్మ ఒడి కింద రూ.17 వేలు ఇస్తాన‌ని జ‌గ‌న్ తాజా మేనిఫెస్టోలో ప్ర‌క‌టించారు. ఇదే ప‌థ‌కానికి బాబు రూ.15 వేలు చొప్పున‌... ఇంట్లో ఎంత మంది విద్యార్థులంటే అంద‌రికీ అంతే మొత్తాన్ని ఇస్తాన‌ని ప్ర‌క‌టించారు. బాబు చెప్పాడంటే చేయ‌డ‌నే అభిప్రాయం జ‌నంలో బ‌లంగా వుంది. ఇదే సంద‌ర్భంలో జ‌గ‌న్ చెప్పాడంటే, చేస్తాడంతే అనే న‌మ్మ‌కం కూడా వుంది. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు విష‌యంలో చిత్త‌శుద్ధితో పాల‌న సాగించి, న‌మ్మ‌కాన్ని సాధించుకున్నాన‌ని జ‌గ‌న్ అనుకుంటున్నారు.

ఇదే త‌న‌కు రాజ‌కీయంగా క‌లిసొస్తుంద‌ని జ‌గన్ విశ్వాసం. జ‌గ‌న్ అనుకున్న‌ట్టు... చంద్ర‌బాబును జ‌నం న‌మ్మ‌క‌పోతే ఫ‌ర్వాలేదు. కానీ ఒక నాయ‌కుడిపై అభిప్రాయం ఎప్పుడూ ఒకేలా వుంటుంద‌ని అనుకోవ‌డం అజ్ఞానం అవుతుంది. కాలంతో పాటు మ‌నుషుల‌పై అభిప్రాయాలు మారుతూ వుంటాయి. ఇది ప్ర‌కృతి ధ‌ర్మం కూడా. లేదంటే ఎప్పుడూ ఒకే పార్టీ, ఒకే నాయ‌కుడు అధికారంలో కొన‌సాగుతారు.

ఐదేళ్ల‌కోసారి ఎన్నిక‌లు నిర్వ‌హించేదే అందుకు. ఐదేళ్ల క్రితం వైసీపీకి 151 అసెంబ్లీ, 22 పార్ల‌మెంట్ సీట్లు ద‌క్కాయి. ఈ ఎన్నిక‌ల్లో కూడా అన్నే సీట్ల‌ను సాధించుకునే ప‌రిస్థితి వుంటుందా? అనే ప్ర‌శ్న‌కు... ఔన‌నే స‌మాధానం చెప్ప‌గ‌ల ద‌మ్ము, ధైర్యం వైసీపీ నేత‌ల‌కు ఉన్నాయా? అలాగ‌ని జ‌గ‌న్ న‌మ్మ‌కాన్ని ఎవ‌రూ కాద‌న‌లేరు. అంతిమంగా ప్ర‌జాతీర్పు నాయ‌కుల న‌మ్మ‌కాల‌ను నిల‌బెట్ట‌డం లేదా కూల‌దోస్తాయి. రానున్న ఎన్నిక‌ల్లో కూడా ఇదే జ‌ర‌గ‌నుంది.

Show comments