తరతరాల వైరం.. భలే మర్చిపోయావే చంద్రబాబూ!

చంద్రబాబు నాయుడు అవకాశవాద రాజకీయ వ్యవహార సరళికి ఇదొక పెద్ద ఉదాహరణ. తాను ఎవరి మీదనైతే విమర్శల జడివాన కురిపించాడో, ఎవరి మీద బురద చల్లడం ద్వారా మనుగడ సాగించాలనుకున్నాడో.. అలాంటి మోడీతో మళ్లీ జట్టుకట్టిన చంద్రబాబులోని అవకాశవాదాన్ని మనం ఈ ఎన్నికల పొత్తుల్లో గమనించాం.

అలాగే, ఎవరినైతే ఆజన్మ శత్రువులుగా భావిస్తూ వచ్చాడో, ఎవరి వెనుకనైతే తాను గోతులు తవ్వుతూ వచ్చాడో.. ఎవరి పతనం కోసం తన తొలిరోజుల నుంచి అహరహమూ పరిశ్రమిస్తూ వచ్చాడో.. అలాంటి వారితో కూడా చెట్టపట్టాలు వేసుకుని నడవగల అవకాశవాద వైఖరి తనది అని ఇప్పుడు ఆయన నిరూపించుకుంటున్నారు.

చంద్రబాబు నాయుడు చరిత్ర, ఆయన పాత శత్రుత్వాలు తెలిసిన వాళ్లు.. రాజంపేటలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ చూసి విస్తుపోతున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో నల్లారి కుటుంబానికి- నారా చంద్రబాబు నాయుడుకు ఆజన్మవైరం ఉంది. నిజానికి దీనిని తరతరాల వైరం అనడానికి వీల్లేదు. ఎందుకంటే చంద్రబాబు కంటే ముందు నారా వారి తరాలు రాజకీయాల్లో లేవు. కానీ.. అలాంటి వైరం కంటె వీరిది పెద్దది.

ఇప్పటి వారికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గురించి మాత్రమే బాగా తెలుసు. కానీ.. కిరణ్ తండ్రి నల్లారి అమర్నాధ్ రెడ్డితోనే చంద్రబాబు నాయుడుకు ఆ రోజుల్లో వైరం ఉండేది. ఇద్దరూ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు. నల్లారి వారి ఆధిపత్యం జిల్లా రాజకీయాల మీద ఉండేది. దానికి గండి కొట్టడానికి కాంగ్రెసులోనే ఉన్న చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుండేవారు. ఆయన ఆధిపత్యం వెనుక గోతులు తవ్వుతుండేవారు.

చిత్తూరు జడ్పీ ఛైర్మన్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నల్లారి అమర్నాధ్ రెడ్డి ఒక అభ్యర్థిని నిర్ణయిస్తే.. కాంగ్రెస్ తరఫునే తిరుగుబాటు అభ్యర్థిగా కుతూహలమ్మను బరిలో దింపి.. చంద్రబాబు క్యాంపు రాజకీయాలు నడిపి.. తన కుటిలరాజకీయ వ్యూహాలకు శ్రీకారం దిద్దింది అప్పుడే. నల్లారి అమర్నాధ్ రెడ్డిని దెబ్బకొట్టడానికే.

అప్పటి నుంచి ఆ కుటుంబంతో వైరం ఉంది. ఎంతగా అంటే.. కిరణ్ తో ఆయనకు మాటలు కూడా ఉండేవి కాదు. చంద్రబాబు మరీ ఎంత నైతిక విలువలు లేనివాడంటే.. నల్లారి కిరణ్ ను స్పీకరు చేసినప్పుడు.. ప్రతిపక్షనేత గా ఆయన వెంట ఉండి స్పీకరు ఛెయిర్ వరకు తీసుకువెళ్లాలనే సాంప్రదాయాన్ని కూడా తన వైరం కారణంగా పాటించలేదు.

కానీ.. ఇప్పుడు గతిలేక భాజపాతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో చెట్టపట్టాలు వేసుకుని.. ఆయనతో కలిసి సభలు నిర్వహించడం, ఆయనను ఎంపీగా గెలిపించాలని ప్రచారం చేయడం అన్నీ తమాషాగా ఉన్నాయి. చంద్రబాబు సంగతి తెలుసుగానీ.. మరీ ఇంత అవకాశవాదినా..? అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

Show comments