బైరెడ్డికి అఖిల‌ప్రియ షాక్‌... ఇండిపెండెంట్‌గా భ‌ర్త‌!

నంద్యాల లోక్‌స‌భ టీడీపీ అభ్య‌ర్థి బైరెడ్డి శ‌బ‌రికి మాజీ మంత్రి, ఆళ్ల‌గ‌డ్డ టీడీపీ అభ్య‌ర్థి భూమా అఖిల‌ప్రియ గ‌ట్టి షాక్ ఇచ్చారు. నంద్యాల పార్ల‌మెంట్ స్థానం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా అఖిల‌ప్రియ భ‌ర్త మ‌ద్దూరి భార్గ‌వ్‌రామ్‌నాయుడు గురువారం నామినేష‌న్ వేయ‌డం రాజ‌కీయంగా దుమారం రేపుతోంది.

అఖిల‌ప్రియ భ‌ర్త త‌ర‌పున న్యాయ‌వాది ఎం.చంద్ర‌శేఖ‌ర్‌, ఆళ్ల‌గ‌డ్డ మాజీ కౌన్సిల‌ర్ కృపాక‌ర్ నామినేష‌న్ వేయ‌డం గ‌మ‌నార్హం. నామినేష‌న్ల చివ‌రి రోజు అనూహ్యంగా అఖిల‌ప్రియ భ‌ర్త ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా బ‌రిలో నిల‌వ‌డం టీడీపీలో తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అఖిల‌ప్రియ వైఖ‌రిపై బైరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డి, ఆయ‌న కుమార్తె శ‌బ‌రి తీవ్ర ఆగ్ర‌హంగా ఉన్నార‌ని తెలిసింది.

భార్గ‌వ్‌రామ్ నామినేష‌న్ వెనుక ఆర్థిక వ్య‌వ‌హారాలు ముడిప‌డి ఉన్న‌ట్టు స‌మాచారం. నంద్యాల జిల్లా బీజేపీ అధ్య‌క్షురాలైన శ‌బ‌రి టీడీపీలో చేరి, పార్ల‌మెంట్ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఎన్నిక‌ల ఖ‌ర్చులో భాగంగా రూ.7 కోట్లు అఖిల‌ప్రియ‌కు స‌మ‌కూర్చేలా ఒప్పందం జ‌రిగిన‌ట్టు ప్ర‌చారం జరుగుతోంది. కానీ ముంద‌స్తు ఒప్పందం ప్ర‌కారం ఆ సొమ్మును అందించ‌క‌పోవ‌డంతో అఖిల‌ప్రియ దంప‌తులు ఫైర్ మీద ఉన్నార‌ని స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో శ‌బ‌రిని దెబ్బ తీసేందుకు భార్గ‌వ్‌రామ్ ఎన్నిక‌ల బ‌రిలో దిగిన‌ట్టు నంద్యాల జిల్లాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌ర్థులు భారీ మొత్తంలో డ‌బ్బు ఖ‌ర్చు చేస్తున్నార‌ని, ముంద‌స్తు ఒప్పందం ప్ర‌కారం బైరెడ్డి త‌మ నాయ‌కురాలికి ఆర్థికంగా సాయం అందించ‌క‌పోవ‌డంతోనే భార్గ‌వ్‌రామ్ బ‌రిలో దిగార‌ని అఖిల‌ప్రియ అనుచ‌రులు చెబుతున్నారు. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన భార్గ‌వ్‌రామ్‌కు కుల‌ప‌ర‌మైన అండ ఉంద‌ని, ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌నకే ఓట్లు వేస్తార‌ని అఖిల‌ప్రియ అనుచ‌రులు అంటున్నారు. ఈ వ్య‌వ‌హారంపై టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Show comments