బిగ్ వికెట్: టీడీపీ నుంచి వైసీపీలోకి!

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకు ఇది బిగ్ షాక్. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ఆ పార్టీ కీలక నాయకుల్లో ఒకరు.. తెలుగుదేశానికి గుడ్ బై కొట్టేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరారు. ఈ చేరిక ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కనీసం నాలుగు నియోజకవర్గాలపై ప్రభావం చూపిస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుతం పలమనేరు నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న ఎన్.అమర్నాధ్ రెడ్డి సోదరుడు శ్రీనాధ్ రెడ్డి పులివెందులలో జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఎన్. శ్రీనాధ్ రెడ్డి తెలుగుదేశానికి కీలక నాయకుల్లో ఒకరు. ఆయన భార్య అనీషా రెడ్డి 2019 ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పోటీచేసి ఓడిపోయారు. పెద్దిరెడ్డి ఏకంగా 42 వేల ఓట్ల తేడాతో గెలిచారు. 

అయితే ఇప్పుడు అనీషారెడ్డి, శ్రీనాధ్ రెడ్డి ఇద్దరూ కలిసి జగన్ సమక్షంలో వైకాపా కండువా కప్పించుకోవడం చర్చనీయాంశం అవుతోంది. పుంగనూరు నియోజకవర్గంలో మాత్రమే కాదు. ఎన్.అమర్ నాధ్ రెడ్డి తెలుగుదేశం తరఫున పోటీచేస్తున్న పలమనేరు నియోజకవర్గంతో పాటు, చిత్తూరు, పీలేరు నియోజకవర్గాల్లో కూడా ఎంతోకొంత వీరు ప్రభావం చూపగలరని విశ్లేషకులు భావిస్తున్నారు.

2019 నాటి ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో ఒక్క కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు తప్ప.. తెలుగుదేశానికి ఒక్క సీటు కూడా దక్కలేదు. అలాంటిది ప్రస్తుత ఎన్నికల్లో ఎన్నోకొన్ని సీట్లు అదనంగా లభిస్తాయని చంద్రబాబు నాయుడు ఆశపడుతున్నారు. అలాంటి సమయంలో మాజీ మంత్రి సోదరుడు, పార్టీకి కీలకనాయకుడు అయిన శ్రీనాధ్ రెడ్డి చేజారిపోవడం పెద్ద దెబ్బగానే పరిగణించాల్సి ఉంటుంది.

Show comments