నిమ్మ‌గ‌డ్డ పాపాల్ని ఎత్తుపోసుకుంటున్న‌ టీడీపీ

ఏపీ ఎన్నిక‌ల మాజీ అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ పాపాల్ని ఎత్తిపోసుకోవ‌డంలో టీడీపీ త‌ల‌మున‌క‌లైంది. ఒక‌టో తేదీ వ‌స్తుండ‌డంతో పెన్ష‌న‌ర్ల ఇబ్బందులు కూట‌మి నేత‌ల‌కు గుర్తుకొచ్చాయి. అలాగే ఎల్లో మీడియా తెగ హైరానా ప‌డుతోంది. గ‌త 56 నెలలుగా వలంటీర్లు నేరుగా ఇళ్ల వ‌ద్ద‌కెళ్లి సుమారు 65 ల‌క్ష‌లకు పైగా వివిధ ర‌కాల పింఛ‌న్‌దారుల‌కు ల‌బ్ధి చేకూర్చేవారు.

అయితే వైసీపీకి అనుకూలంగా పింఛ‌న్‌దారుల‌ను వ‌లంటీర్లు మారుస్తార‌నే భ‌యంతో, ఎన్నిక‌ల కోడ్‌ను దృష్టిలో పెట్టుకుని వారితో పింఛ‌న్లు పంపిణీ చేయొద్ద‌ని నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌తో ఎన్నిక‌ల సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేయించింద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. టీడీపీ ఆశించిన‌ట్టుగానే కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకుంది. వ‌లంటీర్ల‌తో పింఛ‌న్ల పంపిణీని అడ్డుకుంది. ఈ నేప‌థ్యంలో మండుటెండ‌లో స‌చివాల‌యాల వ‌ద్ద‌కెళ్లి పింఛ‌న్ సొమ్ము తీసుకోడానికి వృద్ధులు, విక‌లాంగులు ఇబ్బందులు ప‌డ్డారు.

ఈ క్ర‌మంలో 33 మంది మృత్యువాత ప‌డ్డారు. ఇదంతా టీడీపీ నెత్తికి చుట్టుకుంది. టీడీపీతో పాటు కూట‌మి పార్టీల‌పై పెన్ష‌న‌ర్లు శాప‌నార్థాలు పెట్టారు. ఇప్పుడో ఒక‌టో తేదీ స‌మీపిస్తుండ‌డంతో కూట‌మిలో పెన్ష‌న‌ర్ల టెన్ష‌న్ మొద‌లైంది. ఎన్నిక‌ల‌కు గ‌డువు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో పెన్ష‌న‌ర్ల ఆగ్ర‌హానికి గురై రాజ‌కీయంగా న‌ష్ట‌పోతామ‌ని ఆందోళ‌న చెందుతున్నారు. దీంతో పెన్ష‌న‌ర్ల‌కు ఇళ్ల వ‌ద్ద‌కే వెళ్లి పంపిణీ చేయాలంటూ కూట‌మి నేత‌లు డిమాండ్ చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

పిఠాపురంలో నామినేష‌న్ సంద‌ర్భంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాట్లాడుతూ ఒక‌వేళ పింఛ‌న్‌దారుల‌కు ఇళ్ల వ‌ద్ద‌కే వెళ్లి పంపిణీ చేయ‌క‌పోతే కుట్ర వుంద‌ని భావించాల్సి వుంటుంద‌ని ఒక రాయి వేయ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. ఇదేదో నిమ్మ‌గ‌డ్డ‌తో ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేయించ‌డానికి ముందు ఆలోచించి వుంటే బాగుండేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. నిమ్మ‌గ‌డ్డ‌తో పాపాలు చేయించి, వాటిని ఎత్తిపోసుకోడానికి కూట‌మి నేత‌లు నానా తంటాలు ప‌డుతున్నారు. 

Show comments