నాడు బీసీల‌పై.. నేడు ద‌ళితుల‌పైః నోరు జారిన బాబు

తానేం మాట్లాడుతున్నారో చంద్ర‌బాబునాయుడికే అర్థం కావ‌డం లేదు. ఎన్నిక‌ల స‌మ‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా మాట్లాడాల‌నే స్పృహ బాబులో కొర‌వ‌డింది. గ‌తంలో అధికారంలో ఉన్న‌ప్పుడు బీసీల‌పై నోరు జారి భారీ మూల్యం చెల్లించుకున్నారు. దాని నుంచి ఆయ‌న గుణ‌పాఠం నేర్చుకోలేదు. తాజాగా ద‌ళిత ఎమ్మెల్యే అభ్య‌ర్థిపై అదే నోటి దురుసు. దీంతో చంద్ర‌బాబుపై రాష్ట్ర వ్యాప్తంగా ద‌ళితులు క‌త్తులు నూరుతున్నారు.

చంద్ర‌బాబు నోటి దురుసును రాజ‌కీయంగా వైసీపీ వాడుకుంటోంది. బాబు త‌ప్పిదాన్ని ఎలా స‌రిదిద్దుకోవాలో టీడీపీకి దిక్కుతోచ‌ని స్థితి. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌దేప‌దే పెత్తందారుల‌కు, పేద‌ల‌కు మ‌ధ్య పోటీ అంటున్నారు. చంద్ర‌బాబు వారిపై అవ‌హేళ‌న కామెంట్స్ ఇందుకు బ‌లం చేకూర్చేలా ఉన్నాయి. అస‌లేం జ‌రిగిందంటే..

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా చంద్ర‌బాబు ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా శింగ‌న‌మ‌ల‌లో ప‌ర్య‌టించారు. టిప్ప‌ర్ డ్రైవ‌ర్‌ను శింగ‌న‌మ‌ల అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించార‌ని అవ‌హేళ‌న చేశారు. వేలిముద్ర‌గాడు కావ‌డంతో క‌ళ్లు మూసుకుని చెప్పిన చోట.. వేలి ముద్ర వేస్తాడ‌ని వెట‌క‌రించారు. జ‌గ‌న్ తెలివితేట‌ల‌కు వ్యంగ్యంగా చంద్ర‌బాబు అభినంద‌న‌లు తెలిపారు.

ఈ నేప‌థ్యంలో ఎమ్మిగ‌నూరులో మేమంతా సిద్ధం స‌భ‌లో చంద్ర‌బాబు కామెంట్స్‌పై సీఎం జ‌గ‌న్ ఫైర్ అయ్యారు. ఔను.. శింగ‌న‌మ‌ల వైసీపీ అభ్య‌ర్థి టిప్ప‌ర్ డ్రైవ‌రే అని అన్నారు. ఇందులో త‌ప్పేంట‌ని నిల‌దీశారు. మీ కంటే ఎక్కువే శింగ‌న‌మ‌ల అభ్య‌ర్థి వీరాంజ‌నేయులు చ‌దువుకున్నార‌ని చెప్పుకొచ్చారు. ఎంఏ ఎక‌నామిక్స్‌, అలాగే బీఈడీ కూడా చ‌దివిన‌ట్టు జ‌గ‌న్ తెలిపారు. దీంతో వైసీపీలోని అన్ని సామాజిక వ‌ర్గాల నేత‌లు చంద్ర‌బాబుపై మూకుమ్మ‌డి దాడికి దిగారు. పేద‌లు ఎమ్మెల్యే, ఎంపీలు కాకూడ‌ద‌ని అని నిల‌దీస్తున్నారు.

గ‌తంలో చంద్ర‌బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు ఆల‌యాల్లో ప‌నిచేసే క్షుర‌కులకు పీస్ రేటు క‌మీష‌న్ పెంచాల‌ని చంద్ర‌బాబును అడిగేందుకు నాయీ బ్రాహ్మ‌ణ సంఘం నాయ‌కులు వెళ్లారు. త‌మ విజ్ఞ‌ప్తిని చంద్ర‌బాబు ఎదుట పెట్టారు. ఒక్క‌సారిగా నాయీ బ్రాహ్మ‌ణుల‌పై చంద్ర‌బాబు విరుచుకుప‌డ్డారు. తోక క‌త్తిరిస్తాన‌ని ఘాటు హెచ్చ‌రిక చేశారు. ఇదంతా లైవ్‌లో ప్ర‌సార‌మైంది. ఈ ప‌రిణామం బీసీల్లో చంద్ర‌బాబుపై తీవ్ర ఆగ్ర‌హానికి కార‌ణ‌మైంది. ఎన్నిక‌ల్లో ఆయ‌న తోక క‌త్తిరించారు.

ఇప్పుడు ద‌ళితులంతా చంద్ర‌బాబుపై గుర్ర‌మంటున్నారు. టిప్ప‌ర్ డ్రైవ‌ర్ ద‌ళితుడు కావ‌డం వ‌ల్లే  అవ‌హేళ‌న చేస్తున్నార‌నే సంకేతాలు బ‌లంగా వెళ్లాయి. ఇది రాజ‌కీయంగా చంద్ర‌బాబుకు దెబ్బే. టీడీపీ పెత్తందారీ ధోర‌ణికి ఇది నిద‌ర్శ‌నంగా వైసీపీ జ‌నంలోకి తీసుకెళుతోంది.

Show comments