'మట్టి కుస్తీ' నేను చేయాలనుకున్నాను - రవితేజ

మట్టి కుస్తీ సినిమాతో పూర్తిస్థాయి ప్రొడ్యూసర్ గా బరిలో దిగుతున్నాడు హీరో రవితేజ. ఇంతకుముందు ఇలాంటి ప్రయత్నాలు చాలా చేసినప్పటికీ, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ పై ప్రాపర్ గా నిర్మించి రిలీజ్ చేస్తున్న సినిమా ఇదే. ఈ స్క్రిప్ట్ రవితేజకు బాగా నచ్చేసింది. ఎంతలా అంటే, ఒక దశలో హీరో విష్ణు విశాల్ ను పక్కనపెట్టి, తనే హీరోగా చేసేద్దాం అనుకున్నాడట. ఈ విషయాన్ని రవితేజ బయటపెట్టాడు.

"మట్టి కుస్తీ స్క్రిప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. తెలుగులో నేను చేసేద్దాం అనుకున్నాను. ఎందుకంటే, ఈ సినిమాలో కామెడీకి నేను బాగా కనెక్ట్ అయ్యాను. దర్శకుడి దగ్గర మంచి కామెడీ టైమింగ్ ఉంది. స్క్రిప్ట్ లో అతడు రాసుకున్న కామెడీకి నేను చాలా నవ్వుకున్నాను. కథ విన్నంతసేపు నవ్వుతూనే ఉన్నాను. అప్పుడే నాకు చిన్న ఆశ పుట్టింది. తమిళ్ వెర్షన్ ను విష్ణు విశాల్ కు అప్పగించి, తెలుగు వెర్షన్ లో నేను నటించాలనుకున్నాను. కానీ అతడు ఈ స్క్రిప్ట్ తో తమిళ్-తెలుగు-హిందీలో చేయాలని ఆశపడ్డాడు. దీంతో మట్టి కుస్తీకి కేవలం నిర్మాతగా మిగిలిపోయాను."

ఇలా మట్టి కుస్తీలో తను హీరోగా నటించాలనుకున్న విషయాన్ని బయటపెట్టాడు రవితేజ. ఇదే విషయాన్ని హీరో విష్ణు విశాల్ కూడా కన్ ఫర్మ్ చేశాడు. రవితేజ స్వయంగా తనకు ఫోన్ చేసి ఈ విషయం అడిగారని, కానీ తను రిక్వెస్ట్ చేయడంతో ఆయన వెనక్కుతగ్గారని, కేవలం నిర్మాతగా ఉండడానికి ఒప్పుకున్నారని తెలిపాడు.

ఈ సందర్భంగా మరోసారి సినిమా జానర్ పై హీరో-నిర్మాత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. మట్టి కుస్తీని కేవలం స్పోర్ట్స్ డ్రామాగా చూడొద్దని చెబుతున్నారు. ఇందులో అన్ని ఎమోషన్స్ ఉన్నాయని, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను డిసెంబర్ 2న రిలీజ్ చేస్తున్నారు.

Show comments