చంద్ర‌బాబు మాట‌లు ఆయ‌న ఫ్యామిలీకి వ‌ర్తించ‌వా!

రాయ‌ల‌సీమ‌లో తెలుగుదేశం పార్టీలో ఉన్న పొలిటిక‌ల్ ఫ్యామిలీల‌కు గ‌ట్టి వార్నింగే ఇచ్చార‌ట తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు. త‌మ పార్టీ త‌ర‌ఫున ఒక్కో ఫ్యామిలీకి ఒక్కో టికెట్టే ద‌క్కుతుందంటూ చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించేశారు! ఒక్క ఫ్యామిలీ ఒకే టికెట్ అనే రూల్ ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో అమ‌లు చేస్తార‌ట. మ‌రి చంద్ర‌బాబు నాయుడు ఇలాంటి మాట‌లెన్నో చెబుతూ ఉంటారు, ఆచ‌ర‌ణ వ‌ర‌కూ వ‌చ్చేస‌రికి ఆయ‌నే వాటిని మ‌రిచిపోతారు అనేది పాత విశ్లేష‌ణే. 

అవ‌స‌రానికి త‌గ్గట్టుగా మాట్లాడ‌టం చంద్ర‌బాబు స్టైల్. ఎందుకో.. ఒక్కో కుటుంబానికి ఒక్కో టికెట్ అంటున్నారిప్పుడు. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ రూల్ ను క‌చ్చితంగా పాటిస్తార‌నుకోవ‌డం మాత్రం న‌మ్మేవాళ్ల అమాయ‌క‌త్వ‌మే!

అయితే.. కొన్ని తెలుగుదేశం ఫ్యామిలీలు మాత్రం చంద్ర‌బాబు ఇలా చెబుతుండ‌టం ప‌ట్ల అస‌హ‌నంతో ఉన్నాయ‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ కుటుంబం నుంచి ఒక‌రికి ఇద్ద‌రుముగ్గురు పోటీకి దిగాల‌ని నేత‌లు ప్ర‌ణాళిక‌ల్లో ఉన్నారు. రాయ‌ల‌సీమ‌లోనే ఇలాంటి వారి జాబితా పెద్ద‌గా ఉంది. క‌ర్నూలు జిల్లాలో కేఈ కుటుంబం క‌నీసం రెండు నియోజ‌క‌వ‌ర్గాల పై క‌న్నేసింది. అయితే ఇటీవ‌లే డోన్ నుంచి ధ‌ర్మారెడ్డిని ఇన్ చార్జిగా ప్ర‌క‌టించారు చంద్ర‌బాబు. దీంతో కేఈ కుటుంబం అస‌హ‌నంతో ఉంది.

ఇక ఒక‌ప్ప‌టి కాంగ్రెస్ ఫ్యామిలీ, ప్ర‌స్తుత తెలుగుదేశం కుటుంబం కోట్ల కుటుంబం ప‌రిస్థితి కూడా ఇదేన‌ట‌. క‌ర్నూలు ఎంపీ టికెట్ తో పాటు మ‌రో ఎమ్మెల్యే టికెట్ ను కూడా కోట్ల కుటుంబం ఆశిస్తోంది. ఇంకోవైపు భూమా ఫ్యామిలీ ఇస్తే అర‌డ‌జ‌ను నియోజ‌క‌వ‌ర్గాల్లో అయినా సై అంటోంది. అఖిల‌ప్రియ‌, భూమా బ్ర‌హ్మానందం, ఇంకా అఖిల‌ప్రియ చెల్లెలు, త‌మ్ముడు, భ‌ర్త‌.. ఇలా త‌లా ఒక నియోజ‌క‌వ‌ర్గం అయినా వారు పోటీకి రెడీ అన‌గ‌ల‌రు.

వీరు మాత్ర‌మే కాదు.. జేసీ కుటుంబం, ప‌రిటాల ఫ్యామిలీ.. వీళ్లంతా కూడా త‌మ స్థాయికి క‌నీసం మూడు నాలుగు నియోజ‌క‌వ‌ర్గాలైనా కావాల‌ని బేరం పెట్ట‌గ‌లిగేవారే. మూడు నాలుగుతో మొద‌లుపెడితే క‌నీసం రెండైనా ద‌క్కుతాయి వాళ్ల‌కు! ఇలా తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున రెండు మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌పై క‌ర్చీఫ్ లు వేసిన ఫ్యామిలీ అర‌డ‌జ‌నుకు పైనే ఉన్నాయి. వారంద‌రికీ చంద్ర‌బాబు నాయుడు చెప్పేసిన‌ట్టేనేమో! ఒక్కోరికి ఒక్కో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం లేదా లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం మాత్ర‌మే అని!

దీంతో వారిలో అస‌హ‌నం వ్య‌క్తం అవుతూ ఉండ‌వ‌చ్చు. త‌మ ప్ర‌తిపాద‌న‌లు కూడా విన‌కుండా ఒక ఫ్యామిలీ ఒక సీటే అంటూ చంద్ర‌బాబు చెప్ప‌డాన్ని వారు స‌హజంగానే స‌హించ‌లేరు. అయితే చంద్ర‌బాబు కు సిద్ధాంతాలు అంటూ ఏమీ ఉండ‌వ‌నేది వారికి తెలియ‌నిది కాదు. అప్ప‌టికి డ‌బ్బు స‌ర్ద‌గ‌ల‌రు, వేరే దిక్కు లేదంటే.. ఒకే కుటుంబానికి అర‌డ‌జ‌ను నియోజ‌క‌వ‌ర్గాలు అయినా అప్ప‌గించ‌గ‌ల‌రు!

అయితే.. చంద్ర‌బాబు ఫ్యామిలీ మాత్రం వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా రెండు మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌రిలోకి దిగే అవ‌కాశాలు ఉన్న‌ట్టే. చంద్ర‌బాబు ఎమ్మెల్యేగా పోటీ చేయ‌వ‌చ్చు. ఆయ‌న త‌న‌యుడు బ‌రిలో ఉంటాడు. ఇక వారి వియ్యంకుడు బాల‌కృష్ణ నంద‌మూరి ఫ్యామిలీ కోటా అనుకోవాలేమో! క‌నీసం చంద్ర‌బాబు, లోకేష్ అనుకున్నా.. ఒక కుటుంబం రెండు టికెట్లు అవుతాయి. అయితే తెలుగుదేశం పార్టీకి చంద్ర‌బాబే పెద్ద దిక్కుకాబ‌ట్టి ఆయ‌న పెట్టే రూల్ ఆయ‌న కుటుంబానికి వ‌ర్తించ‌దేమో!

Show comments