పవన్ కల్యాణ్ దర్శకుడి ప్లాన్-బి ఏంటి?

ప్రత్యక్షంగా అనుకోవచ్చు లేదా పరోక్షంగా అనుకోవచ్చు.. మొత్తమ్మీద తన కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ క్లారిటీ  ఇచ్చేశాడు. ప్రకటించిన సినిమాలన్నీ చేయాలనే రూల్ లేదని, కొంచెం గ్యాప్ ఇచ్చి చేస్తానని చెప్పకనే చెప్పేశాడు. దీంతో నిర్మాతల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి.

గడిచిన 2 రోజులుగా పవన్ నిర్మాతల్లో ఇదే చర్చ సాగింది. చివరికి మైత్రీ లాంటి సంస్థలు పవన్ ఎప్పుడొస్తే అప్పుడే సినిమా చేద్దాం అనే ఉద్దేశంతో సైలెంట్ అయినట్టు తెలుస్తోంది. అటు పీపుల్ మీడియా నిర్మాతలకు మాత్రం చిన్న హామీ దొరికింది. వినోదాయ శితం రీమేక్ కు తక్కువ కాల్షీట్లు ఇస్తే సరిపోతుంది కాబట్టి, ఈ 3 నెలల్లో ఆ సినిమాను పూర్తిచేసుకోమని పవన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎలాగూ క్రిష్ సినిమా ఈ గ్యాప్ లో పూర్తయిపోతుంది.

సో.. ఈ మొత్తం వ్యవహారంలో బలిపశువు ఎవరంటే హరీశ్ శంకర్ మాత్రమే. ఇప్పటికే పవన్ కల్యాణ్ తో సినిమా కోసం చాన్నాళ్లు ఎదురుచూశాడు ఈ దర్శకుడు. పవన్ తాజా ప్రకటనతో ఇప్పుడు మరికొన్నాళ్లు ఈ దర్శకుడికి వెయిటింగ్ తప్పేలా లేదు. దీంతో హరీశ్ శంకర్ ఆలోచనలో పడ్డాడు.

పవన్ తో సినిమా కోసం ఇంకొన్నాళ్లు వెయిట్ చేయాలా లేక మరో కొత్త ప్రాజెక్టును పట్టాలపైకి తీసుకురావాలా అనే ఆలోచనలో ఉన్నాడు హరీశ్. తాజా సమాచారం ప్రకారం, అతడు ప్లాన్-బి వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది.

దిల్ రాజు బ్యానర్ లో హరీశ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. గతంలో ఓ కథపై చర్చలు కూడా సాగాయి. ఆ కథ కాకుండా, మరో స్టోరీలైన్ తో దిల్ రాజు కాంపౌండ్ లో హరీశ్ సినిమా చేసే అవకాశం ఉంది. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన రాబోతోంది.

Show comments