డ్ర‌గ్స్ కేసులు.. టాలీవుడ్, ఆర్య‌న్ ఖాన్ కేసులో తేడా ఏంటి?

దాదాపు మూడేళ్ల కింద‌ట టాలీవుడ్ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం సంచ‌ల‌నం రేపింది. ప‌లువురు టాలీవుడ్ న‌టీన‌టులు, టెక్నీషియ‌న్లు డ్ర‌గ్స్ కేసులో నోటీసులు అందుకున్నారు. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంపై విచార‌ణ చేప‌ట్టిన స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్ విచార‌ణ‌ను ఎదుర్కొన్నారు. వారిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న న‌టులు, న‌టీమ‌ణులు, ద‌ర్శ‌కులు ఉన్నారు. వారిని ఒక్కొక్క‌రిగా సిట్ పిలిపించుకుంది. అయితే వారెవ‌రినీ అరెస్టు చేయ‌లేదు! వారిని అరెస్టు చేస్తార‌నే ప్ర‌చారాలు అంత‌కు ముందు ముమ్మ‌రంగా జ‌రిగినా, అలాంటిదేమీ చోటు చేసుకోలేదు. వారి నుంచి శాంపిల్స్ సేక‌రించార‌నే వార్త‌లు అయితే వ‌చ్చాయి. అయితే ఆ త‌ర్వాత సిట్ విచార‌ణ ఏమ‌య్యిందో అధికారికంగా ఎవ‌రికీ అర్థం కాలేదు!

ఇక అప్ప‌టి డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో.. ఇటీవ‌లే వారంతా మ‌ళ్లీ ఈడీ విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. అప్ప‌ట్లో డ్ర‌గ్స్ కొనుగోలు విష‌యంలో.. వారు, మ‌నీలాండ‌రింగ్ కు పాల్ప‌డ్డారా.. అనే కోణంలో ఇటీవ‌ల ఈడీ విచార‌ణ సాగిన‌ట్టుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈడీ విచార‌ణ స‌మ‌యంలో కూడా ఎవ‌రి అరెస్టూ జ‌ర‌గ‌లేదు. వారి బ్యాంక్ ఖాతాలు, న‌గ‌దుబ‌దిలీ వివ‌రాల‌ను ప‌రిశీలించి ఈడీ వారిని వ‌దిలిపెట్టింది.

ఏతావాతా.. డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో టాలీవుడ్ సినిమా వాళ్లంతా కేవ‌లం బాధితులు అనే వాద‌న హైలెట్ అయ్యింది. వారు డ్ర‌గ్స్ వాడారా.. లేదా.. అనేది అధికారికంగా ఎవ‌రూ ధ్రువీక‌రించ‌లేదు! అలాగే డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా మాఫియాతో వీరి సంబంధాలు ఏమిటో కూడా ఎవ‌రికీ తెలియ‌దు. వీరికి క్లీన్ చిట్ ను ఏ విచార‌ణ సంస్థా ప్ర‌క‌టించ‌లేదు. అలాగ‌ని వీరిని అరెస్టు కూడా చేయ‌లేదు!

క‌ట్ చేస్తే.. బాలీవుడ్ కింగ్ కాన్ షారూక్ త‌న‌యుడు డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో అరెస్టు అయ్యాడు. ఇప్పుడు అత‌డిని ఆర్థ‌ర్ రోడ్డు జైలుకు కూడా త‌ర‌లించి, ఇన్నాళ్లూ క్వారెంటైన్ సెల్ లో ఉంచి, ఇప్పుడు సాధార‌ణ ఖైదీల బ్యార‌క్ కు త‌ర‌లించారని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి.. టాలీవుడ్ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారానికీ, షారూక్ త‌న‌యుడి నిర్వాకానికి తేడా ఏమిట‌నేది అధికారికంగా ఎలాంటి ధ్రువీక‌ర‌ణా లేదు.

షారూక్ త‌న‌యుడి వ‌ద్ద రెడ్ హ్యాండెడ్ గా ఎలాంటి డ్ర‌గ్స్ ప‌ట్టుబ‌డ‌లేదు. అయితే అరెస్టు స‌మ‌యానికే అత‌డు చరాస్ తీసుకున్నాడ‌ని ఎన్సీబీ త‌న నివేదిక‌లో చెప్పింద‌ట‌. అయితే ఆర్య‌న్ ఖాన్ స్నేహితుడి వ‌ద్ద మాత్ర‌మే డ్ర‌గ్స్ కొంత మోతాదులో ల‌భించాయి. అయితే షారూక్ త‌న‌యుడి సెల్ ఫోన్ ను ఎన్సీబీ అధికారులు స్వాధీనం చేసుకోవ‌డంతోనే ఈ కేసు బ‌లంగా త‌యారైన‌ట్టుగా ఉంది. డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా దారుల‌తో షారూక్ త‌న‌యుడు చాట్ చేశాడ‌నేది ఇప్పుడు ఎన్సీబీ హైలెట్ చేస్తున్న అంశం. కొంద‌రు విదేశీ డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా దారుల‌తో కూడా షారూక్ త‌న‌యుడు చాట్ చేశాడ‌ని, డ్ర‌గ్స్ తెప్పించుకున్న‌ట్టుగా ఎన్సీబీ కోర్టుకు చెబుతోంద‌ట‌. అయితే  ఆర్య‌న్ త‌ర‌ఫు న్యాయ‌వాదులు మాత్రం ఈ వాద‌న‌ల‌ను కొట్టి ప‌డేస్తున్నారు. అలాంటిదేమీ లేద‌ని అంటున్నారు. అయితే ఎన్సీబీ తీవ్ర‌మైన అభియోగాలే మోపుతుండ‌టంతో.. ఆర్య‌న్ కు బెయిల్ ద‌క్కుతున్న‌ట్టుగా లేదు. అత‌డి న్యాయ‌వాదులు బెయిల్ ప్ర‌య‌త్నాలను కొన‌సాగిస్తూనే ఉన్నారు. ఈ రోజు మ‌రోసారి బెయిల్ పిటిష‌న్ విచార‌ణ‌కు రానుంది. 

ఒక‌వేళ డ్ర‌గ్స్ వాడిన‌ట్టుగా అయితే.. అది టాలీవుడ్ వాళ్లు అయినా, బాలీవుడ్ వాళ్లు అయినా స‌ర‌ఫ‌రాదారుల నుంచి తెప్పించుకోవాల్సిందే! స‌ర‌ఫ‌రాదారుల‌తో సంబంధాలు క‌లిగి ఉండ‌టం.. నిఖార్సైన నేర‌మే కావొచ్చు. ఆ నేరంపై చ‌ర్య‌ల విష‌యంలో...సంద‌ర్భాన్ని, రాష్ట్రాన్ని, వ్య‌క్తుల‌ను బ‌ట్టి.. ఆ తేడాలుంటాయా? అనేది సామాన్యుల‌కు అంతుబ‌ట్టే విష‌యం కాదు!

Show comments