లోకేష్ కోసం చంద్రబాబుకు త్యాగం చేయక తప్పదా?

తండ్రి ముఖ్యమంత్రి, కొడుకు ఆయన కేబినెట్ లో మంత్రి. వారసత్వ రాజకీయంలో ఇదేమంత గొప్ప విషయం కాదు కానీ, దానిక్కూడా దొడ్డిదారి వెదుక్కోవాల్సిన ఖర్మ పట్టింది లోకేష్ కి. అదృష్టం బాగుంటే.. తండ్రితో కలసి అసెంబ్లీ గడప తొక్కాలనుకున్న ఆయన ఆశలు మాత్రం నెరవేరలేదు. ఎమ్మెల్సీగా ఎన్నికవ్వొచ్చు కానీ, ఎమ్మెల్యే అయ్యేంత సీన్ ఇంకా చినబాబుకి లేదని మంగళగిరి వాసులు కర్రు కాల్చి వాత పెట్టారు.

అలా తిరస్కారానికి గురైన ఆయన.. ఇప్పుడు సేఫెస్ట్ నియోజకవర్గం కోసం వెదుకులాట మొదలు పెట్టారు. ఓ దశలో మేనమామ కమ్ సొంతమామకు వెన్నుపోటు పొడిచి హిందూపురం వెళ్లాలని స్కెచ్ వేసినా అది వర్కవుట్ కాలేదు. దీంతో ఇప్పుడు తండ్రికే వెన్నుపోటు పొడవడానికి రెడీ అయ్యారట లోకేష్.

చినబాబుకే కుప్పం..

ఎన్ని లెక్కలేసినా, ఎన్ని సమీకరణలు మార్చినా లోకేష్ కు సరైన నియోజకవర్గం దొరకదని తేలిపోయింది. శ్రేణులు కలిసొచ్చినా, నాయకులు త్యాగం చేసినా లోకేష్ కు గెలుపు దాదాపు కష్టమనే నివేదికలు అన్ని నియోజకవర్గాల నుంచి వస్తున్నాయి. 

కచ్చితంగా గెలిచే సెగ్మెంట్ల ను వదులుకోవడానికి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు తన నియోజకవర్గాన్ని త్యాగం చేయక తప్పేలా లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో, రాబోయే గడ్డుకాలాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే.. లోకేష్ కు కుప్పం మినహా మరో ప్రత్యామ్నాయం కనిపించేలా లేదు.

బాబుకేదీ దారి..?

కుప్పం వదిలేస్తే చంద్రబాబు కొత్త నియోజకవర్గాన్ని వెదుక్కోవాలి. బాబుకు అది కష్టమైన పని కాదు కానీ, ఈ వయసులో కొత్త సెగ్మెంట్ వెదుక్కొని, అక్కడ మళ్లీ తన నేతలతో త్యాగాలు చేయించడం బాబుకు తలకుమించిన భారం అవుతుంది. 

టీడీపీ చరిత్రలోనే అతి తక్కువ సీట్లు గెలుచుకున్నది చంద్రబాబు హయాంలోనే అనే చెడ్డపేరు ఆల్రడీ ఉంది. ఇలాంటి టైమ్ లో కొత్త నియోజకవర్గం అంటే బాబుకు మరింత పరువు తక్కువ. అటు కొడుకుని పక్కన పెట్టలేక, ఇటు కుప్పం ని విడిచిపెట్టలేక చంద్రబాబు సతమతం అవుతున్నారట.

కుప్పంకి వస్తే చినబాబు గెలుపు గ్యారెంటీయేనా..?

ఇప్పటికే కుప్పం నియోజకవర్గంలో జూనియర్ ఎన్టీఆర్ పేరు మారుమోగిపోతోంది. గతంలో చంద్రబాబు పర్యటనలోనే ఆయన ముందే ఎన్టీఆర్ ని పార్టీలోకి తీసుకురండి సార్ అని డిమాండ్ చేశారు స్థానిక యువకులు. ఆ తర్వాత ఎన్టీఆర్ జెండా ఎగరేసి మరింత సంచలనం సృష్టించారు. 

ఎన్టీఆర్ కి అంత ఫాలోయింగ్ ఉన్న కుప్పంలో లోకేష్ గెలుపు నల్లేరుపై నడక అని ఎవరూ ఊహించలేరు. పైగా కుప్పం నియోజకవర్గంలో జగన్ సర్కారు చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు అక్కడి జనాలు ఫిదా అవుతున్నారు. కుప్పంలో టీడీపీ కూసాలు కదిలిపోతాయో లేదో చినబాబు ఎంట్రీతో తేలిపోతుంది. 

Show comments