గుత్తా జ్వాల పెళ్లి తంతు పూర్తి

తమిళ నటుడు విష్ణు విశాల్, బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల పెళ్లి చేసుకున్నారు. దాదాపు మూడేళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈ ఇద్దరూ.. గతేడాది తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టారు. అదే టైమ్ లో ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. తాజాగా పెళ్లి డేట్ కూడా ప్రకటించి, ఈరోజు ఇద్దరూ ఓ ఇంటివారయ్యారు.

హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌజ్ లో విష్ణు విశాల్, గుత్తా జ్వాల పెళ్లి లాంఛనంగా జరిగింది. ఈ పెళ్లికి అతి తక్కువ మందిని ఆహ్వానించారు. అలా ఆహ్వానించిన వాళ్లలో కూడా చాలామంది కరోనా వైరస్ కు భయపడి హాజరుకాలేదు. అలా 20-30 మంది అతిథుల సమక్షంలో సింపుల్ గా పెళ్లి చేసుకుంది ఈ జంట. పెళ్లి తంతు పూర్తయిన వెంటనే అట్నుంచి అటు తమ వివాహాన్ని రిజిస్టర్ కూడా చేయించుకుంది.

గుత్తా జ్వాలకు ఇది వరకే పెళ్లయింది. బ్యాడ్మింటన్ స్టార్ చేతన్ ఆనంద్ ను వివాహం చేసుకుంది. కానీ ఇద్దరికీ పొసగలేదు. 2011లో విడాకులు తీసుకున్నారు. అప్పట్నుంచి సింగిల్ గా ఉన్న జ్వాల, మూడేళ్ల కిందట విష్ణు విశాల్ కు కనెక్ట్ అయింది.

విష్ణు విశాల్ కు కూడా ఇది రెండో పెళ్లి. నిర్మాత, కాస్ట్యూమ్ డిజైనర్ రాగిని నటరాజ్ ను అతడు గతంలో పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికీ ఓ బాబు కూడా పుట్టాడు. ఆ తర్వాత 2018లో విడిపోయారు. గుత్తా జ్వాల వల్లనే విష్ణువిశాల్-రాగిని మధ్య పొరపొచ్చాలు వచ్చాయంటారు, అది వేరే విషయం. 

అలా విష్ణు విశాల్, గుత్తా జ్వాల ఇప్పుడు రెండో పెళ్లితో ఒకటయ్యారు. రీసెంట్ గా వచ్చిన అరణ్య సినిమాలో విష్ణు విశాల్ నటించిన సంగతి తెలిసిందే. 

Show comments