టీ.కాంగ్రెస్ అంతే.. కొత్త రచ్చ స్టార్ట్!

ఏపీలో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకునేందుకు ఏమీ లేదు. మొన్నటి వరకూ ఏదైనా బ్యాలెన్స్ ఉందనే భ్రమ ఉంటే.. అదేం లేదని ఏపీ ప్రజలు మరోసారి స్పష్టమైన తీర్పును ఇచ్చారు. కాంగ్రెస్ ఊసు ఏమైనా ఉందంటే అది తెలంగాణలో మాత్రమే. అక్కడ బీజేపీ సవాళ్లు విసురుతోంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాజకీయం అధికార తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు.. కాంగ్రెస్ పార్టీకి కూడా ఇబ్బందికరమైన అంశమే. అందులో సందేహాలు ఏమీ లేవు.

బీజేపీ అలా పుంజుకుంటుంటే.. కాంగ్రెస్ పార్టీలో మాత్రం లుకలుకలు బయటపడిపోతూ ఉన్నాయి. ఇలాంటి క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరో రచ్చ రేగింది. అది హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం బై పోల్ వ్యవహారం అని తెలుస్తోంది. అక్కడ నుంచి ఎమ్మెల్యేగా ఉండిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా నెగ్గి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక జరగాల్సి ఉంది.

ఈ పరిణామాల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ  లో అందుకు సంబంధించి పోటీ మొదలైందట. అది తన సీటు అన్నట్టుగా తన భార్య అక్కడ నుంచి పోటీ చేస్తుందని ఉత్తమ్ ప్రకటించేశారు. ఇది వరకూ కూడా ఆమె ఒకసారి ఎమ్మెల్యేగా వ్యవహరించారు. అయితే  ఈ విషయంలో రేవంత్ రెడ్డి రుసరుసలాడుతున్నాడట. అక్కడ తన  అభ్యర్థినెవరో పోటీకి దించాలనేది ఆయన కోరికట!

ఉత్తమ్ ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటించుకోవడంపై రేవంత్ అసంతృప్తితో ఉన్నాడట. మొత్తానికి ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అవకాశాలు ఉంటే.. ఈ అంతర్గత విబేధాలతో ఆ సీటును కూడా టీఆర్ఎస్  కు అప్పగించేందుకు  వీరు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా ఉన్నారు!

Show comments