అబ్జర్వేషన్‌: పాకిస్తాన్‌తో యుద్ధం చెయ్యాలా? వద్దా?


యుద్ధంతో వినాశనమే.. యుద్ధం చేస్తే శతృదేశం బుద్ధితెచ్చుకుంటుందని ఆశిస్తే, అంతకన్నా అత్యాశ ఇంకొకటి వుండదు. ఎందుకంటే, శతృవు మూర్ఖుడు. మూర్ఖుడిని భయపెట్టడం, సంస్కరించాలనుకోవడం కష్టమే.. ఆ మాటకొస్తే, పాకిస్తాన్‌లాంటి మూర్ఖుడిని భయపెట్టాలనుకున్నా, సంస్కరించాలనుకున్నా, ఆఖరికి మట్టుబెట్టాలనుకున్నా.. ఊహించని నష్టాన్నే మిగుల్చుతుంది. 

దేశంలో మెజార్టీ ప్రజల అభిప్రాయం 'యుద్ధం చేయాల్సిందే..' అని వున్నా, అతి తక్కువ మంది మాత్రం, యుద్ధం మిగిల్చే నష్టం గురించి ఆలోచిస్తున్నారు, ఆందోళన చెందుతున్నారు. 'రోజూ చచ్చేకన్నా, ఒకేరోజు చావడమో, చంపేయడమో తేలిపోవాలి..' అనే భావన వుండడం సహజమే. నిజమే, రక్తం మరిగిపోతోంది సైన్యంపై తీవ్రవాదులు దాడులకు తెగబడ్తున్న ప్రతిసారీ. దేశంలో మారణహోమం సృష్టిస్తుండడం, సరిహద్దుల్లో ఘాతుకాలకు పాల్పడటం.. ఇదంతా కేవలం తీవ్రవాదుల వల్ల అయ్యే పని కాదు. తీవ్రవాదుల్ని తయారుచేస్తోన్న ఫ్యాక్టరీ.. అదే పాకిస్తాన్‌.. దాన్ని అంతమొందించాలి. కానీ, అంతమొందించేముందు, భాతరదేశం పరిస్థితి ఏమవుతుందన్నది మాత్రం ఒకటికి పదిసార్లు కాదు, వందసార్లు ఆలోచించుకోవాలి. 

కార్గిల్‌ యుద్ధాన్నే తీసుకుంటే, ఆ యుద్ధం మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. పెద్ద సంఖ్యలో సైనికుల్ని కోల్పోయాం. ఆ యుద్ధంతో ఏం సాధించాం.? అన్నది ఆలోచించుకోవాల్సిన సమయమిది. మరేం చేస్తాం.? పాకిస్తాన్‌ అలా తీవ్రవాదులతో మారణహోమం సృష్టిస్తోంటే చూస్తూ ఊరుకోవాలా.? అన్న ప్రశ్న కూడా కీలకమే. కీలెరిగి వాత పెట్టడం తప్ప ఇంకో మార్గం లేదు. 

భారత్‌ అభివృద్ధి చెందుతున్న దేశం. పాకిస్తాక్‌ అభివృద్ధి మీద ఆశల్లేని దేశం. అభివృద్ధి చెందుతున్న దేశానికి, ప్రపంచంలోని వివిధ దేశాలతో సంబంధ బాంధవ్యాలు అనివార్యం. దేశ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, యుద్ధం వల్ల ఆ ఆర్థిక వ్యవస్థ పతనమైతే ఇంకేమన్నా వుందా.? ఇదీ దేశంలో వ్యక్తమవుతున్న ఆందోళన. అదే సమయంలో, రక్షణ రంగానికి పాకిస్తాన్‌ కారణంగానే ఎక్కువమొత్తంలో వెచ్చించాల్సి వస్తోందనీ, ఇది ఇతర రంగాల వైపు మళ్ళించగలిగితే ఎప్పుడో భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశమయి వుండేదన్న వాదనల్ని కొట్టి పారేయలేం. 

ఒక్కటి మాత్రం నిజం. ఛస్తూ బతకలేం. ఎప్పుడు దేశంలో ఎక్కడ ఎలాంటి తీవ్రవాద దాడి జరుగుతుందో ఊహించలేకపోతున్నాం. సరిహద్దుల్లో సైన్యాన్ని కోల్పోతూనే వున్నాం. ఈ నష్టం ముందు ఒక్కసారి జరిగే యుద్ధం కారణంగా తలెత్తే నష్టం పెద్దది కాకపోవచ్చు. అయితే, దానికన్నా ముందుగా అంతర్జాతీయ స్థాయిలో పాకిస్తాన్‌ని ఎండగట్టాలి, ఏకాకిని చెయ్యాలి. ఇప్పటిక ఆ ప్రక్రియలో భారతదేశం ఓ అడుగు ముందుకేసిందనే చెప్పాలి. ప్రపంచమంతా ఏకమై, భారత్‌కి మద్దతుగా నిలిచే పరిస్థితులు ఎంతో దూరంలో లేవు. ఇప్పుడు సంయమనం ఇంకాస్త ఎక్కువ అవసరం. అదే సమయంలో, పాకిస్తాన్‌కీ సరైన బుద్ధి చెప్పాలి. కాస్త ఆలస్యమైనా, ఆ దెబ్బ చాలా చాలా చాలా గట్టిగా వుండాలి. వుంటుంది కూడా.! 

సహనమే భారత మంత్రం ఇప్పటిదాకా. ఆ సహనమే భారత్‌ కోల్పోతే, పరిస్థితులెలా వుంటాయో పాకిస్తాన్‌కి తెలియనిది కాదు. కానీ, సహనాన్ని చేతకానితనంగా భావిస్తోంది. దానికి ప్రతిఫలం అనుభవించే రోజు దగ్గర్లోనే వుంది. ఈసారి యుద్ధమంటూ జరిగితే, కాశ్మీర్‌ వుంటుంది.. పాకిస్తాన్‌ మాత్రం వుండదు.. అన్న సైనికుల మాట నూటికి నూరుపాళ్ళూ నిజం. 

Show comments