మాణిక్యాన్ని మట్టికరిపించగలదా?

పూర్వకాలంలో రాజులు, చక్రవర్తులు పొరుగు రాజ్యాల మీదకు యుద్ధానికి వెళ్లి ఆ రాజులను జయించి ఆ రాజ్యాలను స్వాధీనం చేసుకునేవారు. ఏదైనా యుద్ధంలో ఓడిపోయేంతవరకు వీరి హవా కొనసాగుతూ ఉండేది. ఆ కాలంలో యుద్ధాలు చేసి, నెత్తురు ఏరులు పారించి, వేలాదిమందిని హతమార్చి రాజ్యాలను జయించేవారు. ఇప్పుడు ఆధునిక ప్రజాస్వామ్యంలోనూ 'జయించడం' కొనసాగుతూనే ఉంది. కాని రక్తపాతరహితంగా, ఎన్నికల ద్వారా అధికారం పార్టీల పరమవుతోంది. రాజ్యవిస్తరణ కాంక్ష అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే. పశ్చిమ బెంగాల్‌ (ఈమధ్యే రాష్ట్రం పేరులో నుంచి 'పశ్చిమ' తొలగించారు) ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఇప్పటినుంచే రాజ్యవిస్తరణ కాంక్ష మనసును తొలిచేస్తోంది. 

మూడు దశాబ్దాలకు పైగా బెంగాల్‌ను ఏలిన కమ్యూనిస్టులను ఓడించి చరిత్ర సృష్టించిన తృణమూల్‌ కాంగ్రెసు అధినేత రెండో టర్మ్‌లోనూ తన ఆధిపత్యాన్ని నిలుపుకొని కమ్యూనిస్టులను అంతకుముందుకన్నా అట్టడుగుకు అణగదొక్కారు. మమతను ఓడించడానికి తమ శక్తి చాలకపోవడంతో బద్ధ శత్రువైన కాంగ్రెసుతో కలిసి పోటీ చేసి మరో 'చారిత్రక తప్పిదం' చేశామని కమ్యూనిస్టులు బాధపడుతున్నారు. ఈ దశలో కామ్రేడ్లు దక్షిణాదిలోని కేరళలో అధికారంలోకి రావడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నట్లయింది. మమత పార్టీ దక్షిణాదికి విస్తరించే అవకాశం ఇప్పట్లో లేదు. భవిష్యత్తులోనూ అనుమానమే.  

ఆమె తన సామ్రాజ్యాన్ని విస్తరించాలనుకుంటే ఉత్తర భారతంలో ప్రయత్నాలు చేసుకోవల్సిందే. కేరళ తరువాత కమ్యూనిస్టుల (సీపీఎం) చేతిలో మరో చిన్న రాష్ట్రముంది. అదే త్రిపుర. ఇది ప్రధానంగా పర్వత ప్లస్‌ గిరిజన ప్రాంతం. దశాబ్దాలుగా ఇక్కడ కమ్యూనిస్టులదే ప్రాబల్యం. ఒకప్పుడు బెంగాల్‌ మాదిరిగా ఇది వారికి కంచుకోట. 1998 నుంచి సీపీఎం దిగ్గజం మాణిక్‌ సర్కార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కమ్యూనిస్టులు సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉన్నారంటే అందుకు ప్రధాన కారణం మాణిక్‌ సర్కార్‌ వ్యక్తిగత ఇమేజ్‌. ఆయన్ని గొప్ప పరిపాలకుడిగా ప్రజలు భావిస్తున్నారు. 

ముఖ్యంగా ఆయన నిరాడంబరత, మచ్చ లేని జీవితం ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కమ్యూనిస్టులపై నిరంతరం కళ్లెర్రజేసే మమతా బెనర్జీ తన తదుపరి లక్ష్యంగా త్రిపురను ఎంచుకున్నారు. అందుకోసం ఆమె ఇప్పటినుంచే కసరత్తు చేస్తున్నారట....! త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు అతి దగ్గర్లో ఏమీ లేవు. 2018 ప్రథమార్థంలో (మార్చి లోపు) జరుగుతాయి. ఆ ఎన్నికల్లో ఎలాగైనా తన రాజ్యాన్ని స్థాపించాలని మమతా పట్టుదలగా ఉన్నారు. బెంగాల్లో సాధించింది త్రిపురలోనూ సాధిస్తామన్నారు. ఈ విషయాన్ని ఆమె బహిరంగంగానే ప్రకటించారు. 

త్రిపురను తాను అర్థం చేసుకున్నానని, అక్కడి ప్రజలను ప్రేమిస్తున్నానని, కమ్యూనిస్టులు గద్దె దిగే రోజులొస్తున్నాయని దీదీ అన్నారు. వాళ్లిక రోజులు లెక్కబెట్టుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. బెంగాల్లో రెండుసార్లు అధికారంలోకి వచ్చాక చిన్న రాష్ట్రమైన త్రిపురను గెల్చుకోవడం పెద్ద కష్టం కాదని ఆమె భావిస్తున్నారు. రాష్ట్రం చిన్నదే కావొచ్చు. కాని మాణిక్‌ సర్కార్‌కున్న ఇమేజ్‌ చాలా పెద్దది. అందుకే మమత ప్రకటన విన్న బెంగాల్‌, త్రిపుర కమ్యూనిస్టులు నవ్వుకున్నారు. అది సాధ్యం కాదన్నారు. కాని మాణిక్‌ సర్కార్‌  బెస్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌  కాదని మమత వాదిస్తున్నారు. 

రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని, గిరిజనులు అభివృద్ధి చెందడంలేదని, శభ్రమైన మంచి నీరు అందించడంలేదని, విద్యుత్‌ సరఫరా సరిగా లేదని, యువతకు ఉద్యోగాలు లేవని...ఇలా అనేక విమర్శలు చేస్తున్నారు.  కామ్రేడ్ల కంచుకోట త్రిపురలో పాగా వేయాలని కాషాయం పార్టీ కూడా ప్రయత్నాలు చేస్తోందట...! ఎన్ని ప్రయత్నాలు చేసినా వారి ప్రయత్నాలు ఫలిస్తాయని అనుకోలేం. అసెంబ్లీలో ప్రస్తుతం తృణమూల్‌ కాంగ్రెసుకు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరు కూడా కాంగ్రెసు నుంచి జంప్‌ అయినవారే. త్రిపురులో కాలు మోపేందుకు మమత ఎలాంటి వ్యూహాలు పన్నుతారో చూడాలి. 

Show comments