అవినీతి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి జరుగుతోందని, అక్రమ కార్యకలాపాలు సాగుతున్నాయని 'సాక్షి', మరికొన్ని పత్రికలు కథనాలు ప్రచురిస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నాయకులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. సాక్షిని స్వాధీనం చేసుకుంటామని రంకెలు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తాను అత్యంత నీతిపరుడినని, నిప్పులాంటి మనిషినని, అవినీతిని సహించనని జబ్బలు చరుచుకుంటున్నారు. కాని మీడియాలో అవినీతిపై కథనాలు వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటామని, అవినీతికి కారకులను శిక్షిస్తామని చెప్పడంలేదు. 

ఈ నేపథ్యంలో 'ఆంధ్రప్రదేశ్‌ అత్యంత అవినీతి రాష్ట్రం' అంటూ 'నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ అప్లయిడ్‌ ఎకనమిక్‌ రిసెర్చ్‌ (ఎన్‌సిఎఇఆర్‌) అనే సంస్థ తెలియచేసింది. ఐదు అంశాల్లో ఈ సంస్థ అధ్యయనం చేసి వివిధ రాష్ట్రాలకు గ్రేడ్లు ఇచ్చింది. ఆ రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో తెలియచేసింది. కార్మిక శాఖ, మౌలిక వసతులు, ఆర్థిక పరిస్థితి, రాజకీయ సుస్థిరత, పరిపాలన, వ్యాపార వాతావరణం మొదలైన అంశాలను ఎన్‌సీఏఈఆర్‌ అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. దీని ప్రకారం గుజరాత్‌, ఢిల్లీ దేశంలో అత్యంత ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రెండ్లీ రాష్ట్రాలుగా ఉన్నాయి. ఈ విషయంలో బిహార్‌, జార్ఖండ్‌ ఘోరంగా ఉన్నాయి. 

వ్యాపార వాతావరణాన్ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు దేశంలోనే అత్యంత అవినీతి రాష్ట్రాలుగా ఉన్నాయి. భూసేకరణ, పర్యావరణ అనుమతులు, అప్రూవల్స్‌ విషయంలో పశ్చిమ బెంగాల్‌ అత్యంత క్లిష్టమైన రాష్ట్రంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌ సర్వేలో 74.3 శాతం మంది అవినీతి తీవ్ర సమస్యగా ఉందని చెప్పారు. హిమాచల్‌ ప్రదేశ్‌ అవినీతి లేని రాష్ట్రంగా నమోదైంది. చాలా రాష్ట్రాల్లో వ్యాపార, పారిశ్రామిక రంగాలకు సంబంధించి అవినీతి పెరిగిపోయింది. ఈ కారణంగా పారిశ్రామికవేత్తలు అనుమతులు తెచ్చుకోవడం కష్టంగా మారింది. ఇది పశ్చిమ బెంగాల్లో 68 శాతం ఉంది. ప్రస్తుతం అవినీతి జరగని రాష్ట్రమంటూ ఏదీ లేదు. కొన్ని బయటపడుతున్నాయి. కొన్ని బయటపడటంలేదు. 

అవినీతికి సంబంధించిన విషయాలు మీడియా బయటపెట్టినప్పుడు పాలకులు ఆగ్రహించడానికి బదులు వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటే మంచి పేరు వస్తుంది. కాని ఇప్పుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తాము వందశాతం నీతిపరులమైనట్లుగా చెప్పుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు తాను అత్యంత నీతిపరుడినని చెప్పుకుంటారు. కావొచ్చు. అలా ఉంటే మంచిదే. ముఖ్యమంత్రి నీతిపరుడైనంత మాత్రాన రాష్ట్రంలో అవినీతి కార్యకలాపాలు జరగవని గ్యారంటీ లేదు కదా. అవినీతి పనులు చేసేవారు ఆయన పార్టీలోనూ ఉంటారు. ఇతర పార్టీలవారూ ఉంటారు. ఎవరైనా సరే చర్యలు తీసుకోవల్సిందే. ప్ర

తిపక్ష నాయకుడు పత్రిక నడుపుతున్నంత మాత్రాన దాంట్లో అవినీతిపై వచ్చిన కథనాలన్నీ తప్పుడువేనని తీసిపారేస్తే ఎలా? ఆ పత్రికే కనుక ఆధారాలు లేకుండా గాలి పోగేసి చర్యలు తీసుకోవడానికి మార్గాలున్నాయి. రాష్ట్రంలో అవినీతి ఎక్కువగా ఉందని గతంలో ప్రభుత్వం చేయించిన సర్వేలోనూ తేలింది. ప్రభుత్వ శాఖల్లో  రెవెన్యూ శాఖ అవినీతిమయంగా మారిందని స్వయంగా చంద్రబాబే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తిని మందలించారు కూడా. తన శాఖలో అవినీతి ఎక్కువగా ఉందని సీఎం చెప్పినందుకు కేఈకి కూడా కోపం వచ్చింది. 

బహిరంగంగా అవినీతికి పాల్పడుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు అనేకమంది ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే వార్తలపై చంద్రబాబు ఎంతగా అసహనం వ్యక్తం చేస్తున్నారంటే ఏ వాస్తవాన్నీ ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. రాజధాని ప్రాంతంలోని భూమి లూజుగా ఉందని, భవనాలు కుంగుతున్నాయని, సచివాలయం పరిస్థితి భవనం కూడా కుంగిందని సాక్షి మాత్రమే కాకుండా పలు ఆంగ్ల పత్రికలు రాశాయి. ఇది దుష్ప్రచారమంటూ విరుచుకుపడ్డారు. అన్ని పత్రికలు పాజిటివ్‌ వార్తలే రాయాలని, టీవీల్లో అవే ప్రసారం చేయాలని కోరుకుంటున్నారు. 'ఆల్‌ ఈజ్‌ వెల్‌' అనాలని ఆయన ఉద్దేశం. ఆయన మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇదే అభిప్రాయంతో ఉన్నారు. 

Show comments