మీ టూ.. ఇవేం మాటలు మోహన్ లాల్!

ఇప్పటికే ఇలాంటి సున్నితమైన విషయాల్లో తన స్పందనతో మోహన్ లాల్ విమర్శల పాలయ్యాడు. ఒక నటిపై దాడి విషయంలో మలయాళీ స్టార్ హీరో దిలీప్ ను మోహన్ లాల్ సమర్థించుకొంటూ వస్తున్నాడు. మలయాళీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ నుంచి దిలీప్ పై వేసిన బహిష్కరణ వేటును మోహన్ లాల్ ఏకపక్షంగా ఎత్తేశాడు. ఆ విషయంలో మహిళా నటీమణుల నుంచి తీవ్రంగా విమర్శలు వచ్చాయి. ఆ విషయంలో మోహన్ లాల్ ఎదురుదాడి చేశాడు. 

ఇక తాజాగా మీ టూ విషయంలో కూడా లాల్ స్పందించిన తీరు వివాదాస్పదంగా మారేలా ఉంది. ఒక ఇంటర్వ్యూలో మోహన్ లాల్ ఏమన్నాడంటే.. మీ టూ కూడా ఒక ట్రెండ్ అని అన్నాడు. దీన్నొక ఫ్యాషన్ ట్రెండ్ గా అభివర్ణించాడు ఈ మలయాళీ స్టార్ హీరో.

ఒక్కోసారి ఒక ఫ్యాషన్ ట్రెండ్ ఉంటుందని.. స్లీవ్ లెస్, బెల్ బోటమ్.. ఇలా ట్రెండ్స్ వస్తుంటాయి… మారుతూ ఉంటాయి, అలాగే మీ టూ కూడా ఫ్యాషన్ ట్రెండ్ అని.. ఇది కూడా కొంతకాలమని ఈ హీరో అన్నాడు. ఇందులో వ్యంగ్యం ఏ స్థాయిలో ఉందో చెప్పనక్కర్లేదు.

ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఆడవాళ్ల వ్యవహారాంలో మోహన్ లాల్ స్పందించిన తీరును తీవ్రంగా నిరసించారు. ఈ హీరోపై డైరెక్ట్ అటాక్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఒక బర్నింగ్ ఇష్యూ గురించి మలయాళీ స్టార్ హీరో ఇలా మాట్లాడటం.. హీరోయిన్లలో మరింత ఆగ్రహాన్ని రేపవచ్చు. అందునా మలయాళీ చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు మీ టూ ఉద్యమానికి అండగానే ఉన్నారు. అయినా.. లాల్ మాత్రం ఏ మాత్రం భయపడినట్టుగా లేడు.

Show comments