ఒక హక్కు పోయింది...ఇంకోటీ మటాషేనా?

కొన్ని డిమాండ్లను ప్రజలు హక్కులుగా భావిస్తుంటారు. ఫలానా నిర్మాణమో, ఫలానా కార్యక్రమమో తమ హక్కని నినదిస్తుంటారు. అందుకోసం పోరాడతారు. ఆ హక్కులు నెరవేరడం పాలకుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. అనుకున్న హక్కులు పూర్తిగా నెరవేరనూ వచ్చు లేదా కొంత కోతల పాలవ్వచ్చు. ఒకప్పుడు 'విశాఖ ఉక్కు...ఆంధ్రుల హక్కు' అని పోరాడారు. ఆ పోరాటంలో నాయకులు, ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారు. చివరకు అది దక్కింది. తెలుగు ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆంధ్రులు ప్రత్యేక రాష్ట్రం మా హక్కు అని నినదించి పోరాటం చేశారు. 

పొట్టి శ్రీరాములు మద్రాసుతో కూడిన రాష్ట్రం తమ హక్కు అని 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణాలు వదిలారు. మద్రాసు (చెన్నయ్‌) దక్కలేదు. పైగా చాలా తెలుగు ప్రాంతాలను ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కలిపేశారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం (అప్పటికి తెలంగాణ కలవలేదు) అనే హక్కును సాధించుకున్నప్పటికీ అది సంపూర్ణంగా నెరవేరలేదనే చెప్పాలి. తెలంగాణవారు ప్రత్యేక రాష్ట్రం మా హక్కు అన్నారు. ఎట్టకేలకు సాధించుకున్నారు. సీమాంధ్రులు హైదరాబాదు మీద తమకూ హక్కుందని, కేంద్రపాలిత ప్రాంతం చేయాలని డిమాండ్‌ చేసినా ఆ నగరంపై పూర్తి హక్కులు తెలంగాణకే ఉన్నాయని, పదేళ్లపాటు మాత్రమే ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం తేల్చిచెప్పింది. 

ఇలా..ప్రజలు ఏవో హక్కుల కోసం పోరాడుతూనే  ఉంటారు. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌ నష్టపోయింది కాబట్టి ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని నాటి యూపీఏ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పార్లమెంటులో చెబితే పదేళ్లు కావాలని చట్టసభలో వెంకయ్య నాయుడు, పదిహేనేళ్లు ఇవ్వండని చంద్రబాబు నాయుడు మోదీని కోరారు. ఆ తరువాత అప్పటి నుంచి ఇప్పటివరకు అంటే హోదా ఇవ్వలేం ప్యాకేజీ ఇస్తామనే వరకూ కథ తెలిసిందే. ప్రత్యేక హోదా అనేది ఒక హక్కుగా మారిపోయింది. చివరకు ఆ హక్కు సాధించుకునే అవకాశం లేదని తేలిపోయింది. 

విభజన చట్టంలో విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తామనే ప్రస్తావన ఉంది. అదిగో ఇస్తాం...ఇదిగో వస్తుంది అని కబుర్లు చెబుతూ ఇన్నాళ్లు కాలక్షేపం చేశారు. జోన్‌పై ఆశతోనే రైల్వే మంత్రి సురేష్‌ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు పంపారు. ఇంతా చేశాక విశాఖను జోన్‌ చేయలేమని, విజయవాడ అయితే తక్షణమే చేస్తామని కేంద్రం చెబుతోంది. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి ఏ కారణాలు చెప్పారో (ఇతర రాష్ట్రాల అభ్యంతరాలు) అవే కారణాలు (ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ అభ్యంతరాలు) రైల్వే జోన్‌కు చెబుతున్నారు. దీంతో 'విశాఖ రైల్వే జోన్‌ ఆంధ్రుల హక్కు' అనే నినాదంతో ప్రతిపక్షాలు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నాయి.

ఒకనాడు ఉక్కు కర్మాగారం కోసం పోరాడిన విశాఖలోనే రైల్వే జోన్‌ కోసం పోరాటం ప్రారంభమైంది. కేంద్రం వైఖరి చూస్తే ఈ హక్కూ మటాష్‌ అయ్యేటట్లే  ఉంది. తెలుగోళ్లకు కంఠశోష తప్ప ఏం మిగలదు. 'విజయవాడకు రైల్వే జోన్‌ ఇస్తే సమస్య ఏంటి? అదీ రాష్ట్రంలో భాగమే కదా' అని రాష్ట్ర బీజేపీ నాయకులు వాదిస్తున్నారు. విశాఖను ఎందుకు రైల్వే జోన్‌ చేయాలో, అందువల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో ప్రతిపక్షాలు వివరిస్తున్నాయి. ఏపీకి పారిశ్రామిక రాయితీలు ఇవ్వొద్దని కొన్ని రాష్ట్రాలు అభ్యంతర పెడుతున్నట్లు వార్తలొస్తున్నాయి. అంటే ప్యాకేజీ ప్రకటించినప్పుడు రాయితీల ప్రస్తావన ఉండకూడదని అంటున్నాయట. 

ఏపీకి పారిశ్రామిక రాయితీలిస్తే తమ రాష్ట్రాల నుంచి పరిశ్రమలు ఆంధ్రాకు తరలిపోవడమే కాకుండా, కొత్త పరిశ్రమలు రావట. ఇక ఆంధ్రప్రదేశ్‌కు ఏముంది? గుండు గీసి సున్నం బొట్లు పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఒకపక్క పరిస్థితి ఈవిధంగా ఉండగా ఆంధ్రప్రదేశ్‌ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతోందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. తాజాగా బాబు ఒక ప్రకటన చేశారు. ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో జాతీయస్థాయి వృద్ధి రేటు 7.3 శాతం ఉండగా, ఏపీ వృద్ధి రేటు 12.26 శాతం ఉందన్నారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో వృద్ధి రేటు 22.7 శాతం ఉందన్నారు. 

కొన్ని పత్రికల్లో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని, పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారని వార్తలొస్తున్నాయి. రాష్ట్రం పరిస్థితి ఇంత బాగుంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రం ఎందుకనుకుంటుంది? ప్రతి కార్యక్రమానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు. మొన్న పుష్కరాలకే దాదాపు రెండు వేల కోట్లు ఖర్చుచేశారట. విదేశీ ప్రయాణాలకు అంతులేకుండా ఖర్చు చేస్తున్నారు. ఇంత హడావుడి చేస్తూ ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తే కేంద్రం ఎందుకిస్తుంది? అని కొందరు విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. 

Show comments