తగ్గేది లేదు.. కాంగ్రెస్ అతడితో కలిసి గుజరాత్ ఎన్నికలకు!

ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో కొందరు ప్రశాంత్ కిషోర్ మీద విరుచుకుపడ్డారు. తప్పంతా అతడిదే, యూపీలో పార్టీ ఓటమికి అతడే కారణం అన్నట్టుగా కొంతమంది వ్యాఖ్యానించారు. లక్నోలో అయితే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు.. ప్రశాంత్ కిషోర్ ను తమకు పట్టించాలని రివార్డు కూడా ప్రకటించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం పీకే తప్పేం లేదని స్పష్టం చేసింది. ఆయన చేయాల్సింది చేశాడు మనకే కలిసి రాలేదని అనేది అధిష్టానం భావన.

అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పీకే మీద అచంచలమైన  విశ్వాసం తరగలేదు. త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పీకేను స్ట్రాటజిస్టుగా కొనసాగించాలని హైకమాండ్ భావిస్తోందని సమాచారం. గుజరాత్ లో ప్రభుత్వం ఈ ఏడాది డిసెంబర్ తో ఐదేళ్లను పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికలకు రెడీ అవుతోంది. క్యాండిడేట్ల ఎంపిక కూడా మొదలైందని సమచారం.

త్వరలోనే పీకే గుజరాత్ వెళతారని.. అక్కడి నేతలతో సమాలోచనలు జరుపుతాడని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి గుజరాత్ ఎన్నికలు చావో రేవో లాంటివే. యూపీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే.. గుజరాత్ లో బీజేపీని ఓడించాలనేది కాంగ్రెస్ పార్టీ దురాశే అవుతుంది. అయితే.. అన్ని చోట్లా యూపీ లాంటి సమీకరణాలే ఉండవనేది కాంగ్రెస్ పార్టీ లెక్క. ఈ ఆశావహ ధోరణితోనే కాంగ్రెస్ ముందుకు వెళ్తానంటోంది. పీకే స్ట్రాటజీ ప్రకారం ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించాలి. అందుకోసమని శంకర్ సింహ్ వాఘేలాను కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశం ఉంది.

Show comments