మరీ ఇన్ని అబద్దాలా పవన్?

పవన్ పొలిటికల్ టూర్ దాదాపు ముగుస్తోంది. ఆయన చిత్తానికి ఆయన మాట్లాడేసారు. అది ఆయన ఇష్టం. నమ్మడం నమ్మకపోవడం జనం ఇష్టం. కానీ ఆసంగతి అలా వుంచితే నిన్నటికి నిన్న ఓ మాట చెప్పారు. మోడీని, కానీ చంద్రబాబును కూడా ఒక్క చిన్న ఫేవర్ కూడా అడగలేదని తనకు కనీసం మోడీతో కలిసి ఓ ఫొటో కూడా వద్దని, ఆంధ్రకు మేలుచేస్తే చాలని చెప్పానని పవన్ చెప్పారు.

కానీ ఇండస్ట్రీలో వేరే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ గుసగుసల ప్రకారం పవన్ అస్సలు నేరుగా చంద్రబాబుతో మాట్లాడేవారు కాదట. నమ్మకస్తుడైన ఓ మధ్యవర్తి వుండేవారట. ఆయన ద్వారానే ఓసారి పవన్ కళ్యాణ్ టీటీడీలో ఓ సభ్యుడి నియామకం గురించి రికమెండ్ చేసారని వినికిడి.

ఫలానా వ్యక్తిని టీటీడీ బోర్టులో నియమించాలన్నది పవన్ కోరిక అని తెలుగుదేశం వర్గాలకు విన్నవించగా, రెండునెలలు సమయం పడుతుందని చెప్పండని అట్నుంచి సమాధానం వచ్చినట్లు, ఆ మేరకు రెండు నెలల తరువాత నియామకం జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వున్నాయి. అప్పట్లో ఈ విషయమై అంటే టీటీడీ బోర్డులో ఒకరిని పవన్ కోరిక మేరకు నియమించినట్లు వార్తా కథనాలు కూడా వినిపించాయి.

మరి ఎందుకు కోసం పవన్ ఈ నియామకాన్ని కోరినట్లు? ఇక ఆంధ్ర చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా పూనం కౌర్ నియామకం వెనుక కూడా పవన్ వున్నారని వార్తలు గతంలో వినవచ్చాయి. పూనం కౌర్ అస్సలు లైమ్ లైట్ లో లేని కథానాయిక. పైగా పెద్ద పాపులారిటీ కూడా లేని కథానాయిక. జనాలు దాదాపు మరచిపోయారు. అలాంటి టైమ్ లో సడెన్ గా ఆమెను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. దీని వెనుక పవన్ రికమెండేషన్ వుందని అప్పట్లోనే వార్తలు వినిపించాయి.

మరి ఇలా రాజకీయ పదవులకు పవన్ రికమెండ్ చేస్తూ, తాను చిన్న ఉపకారం కూడా పొందలేదని అనడం ఏమిటో?

Show comments