అయ్యో మహర్షి.. బుల్లితెరపై ఫ్లాప్ షో

రంగస్థలం - 19.5
జనతా గ్యారేజ్ - 20.69
డీజే - 21.7

స్టార్ హీరోల సినిమాలకు టీఆర్పీ రేటింగ్స్ ఇలా ఉంటాయి. మొదటిసారి టీవీల్లో ప్రసారం చేసేటప్పుడు ఈ స్థాయిలో రేటింగ్స్ రావడం సహజం. కానీ మహేష్ నటించిన మహర్షి సినిమా మాత్రం జెమినీ టీవీతో పాటు అందరికీ షాక్ ఇచ్చింది. దీనికి కారణం, ఈ సినిమాకు టీవీల్లో అత్యల్ప రేటింగ్ రావడమే. అవును.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారమైన మహర్షి సినిమాకు కేవలం 8.42 (అర్బన్+రూరల్ కలిపి) టీఆర్పీ మాత్రమే వచ్చింది.

భారీ పోటీ మధ్య మహర్షి శాటిలైట్ రైట్స్ దక్కించుకుంది జెమినీ టీవీ. సినిమాకు ప్రమోషన్ కూడా బాగానే చేసింది. మంచి టైమింగ్ కూడా సెట్ చేసింది. కానీ బుల్లితెరపై మహర్షిని వీక్షించేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించలేదు. మరీ ముఖ్యంగా ఇతర ఛానెల్స్ లో పెద్దగా పోటీనిచ్చే సినిమాలు లేకపోయినా మహర్షికి రేటింగ్ రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.

మహేష్ నటించిన ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో పెట్టి చాన్నాళ్లయింది. ఆ ప్రభావం శాటిలైట్ ఎయిరింగ్ పై బాగా పడిందని భావిస్తున్నారు విశ్లేషకులు. టీవీల్లో ప్రసారానికి, అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో మూవీ స్ట్రీమింగ్ కు మధ్య భారీ గ్యాప్ ఉండడం వల్ల ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే మరికొంతమంది మాత్రం ఈ వాదనతో ఏకీభవించడం లేదు. ఫిదా (21.31 టీఆర్పీ), గీతగోవిందం (20.8 టీఆర్పీ) లాంటి సినిమాలు కూడా టీవీల్లో ప్రసారానికి చాలా రోజుల ముందే డిజిటల్ వేదికలపైకి వచ్చాయని.. కానీ టీవీల్లో వాటికి టీఆర్పీ తగ్గలేదంటున్నారు. ఇది కూడా నిజమే.

అయితే అదే టైమ్ లో మహర్షికి పోటీగా సమంత నటించిన ఓ బేబీ సినిమా ప్రసారమైంది. ఆ సినిమాకు 6.12 (అర్బన్+రూరల్) రేటింగ్ రావడం విశేషం. అంటే.. టీవీలో మహేష్ సినిమాకు సమంత గట్టిపోటీనిచ్చిందనే చెప్పాలి. ఇలా కారణాలు ఏమైతేనేం, మహర్షి మాత్రం బుల్లితెరపై ఫ్లాప్ షోగా మిగిలిపోయింది.

నేను డైరెక్టర్.. తమ్ముళ్లు ఒకడు హీరో.. మరోడు ప్రొడ్యూసర్

Show comments