ఎమ్బీయస్‌: ఇన్నాళ్లకు వార్తల్లోకి..

గోవా ముఖ్యమంత్రి గురించిన వార్తలు మనం తరచుగా చూడం. 40 మంది ఎమ్మెల్యేలున్న చిన్న రాష్ట్రం కావడం ఒక కారణం కావచ్చు. ప్రస్తుతం వున్న ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్‌ పార్సేకర్‌ బొత్తిగా అగస్త్యభ్రాత కావడం మరో కారణం. తనకు ముందు వున్న మనోహర్‌ పారికర్‌ నీడలోంచి బయటకు రావడం అతనికి చాలా కష్టంగా వుంది. 2012 ఎన్నికల్లో నెగ్గి ముఖ్యమంత్రి అయ్యాక మనోహర్‌ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే 2014 నవంబరులో అతన్ని కేంద్రంలో డిఫెన్సు మంత్రిగా తీసుకుని ముఖ్యమంత్రిగా అతను సూచించిన లక్ష్మీకాంత్‌ను నియమించారు. అది కూడా సజావుగా సాగలేదు.  డిప్యూటీ ముఖ్యమంత్రిగా వున్న ఫ్రాన్సిస్‌ డి సౌజా తనను చేయాలని పట్టుబట్టాడు. అప్పుడు బాలట్‌ ద్వారా ఎన్నిక నిర్వహించారు. 21 మంది బిజెపి ఎమ్మెల్యేలలో మనోహర్‌ మద్దతిచ్చిన లక్ష్మీకాంత్‌ పక్షాన 15 మంది ఓటేసి అతన్ని ఆ పదవిలో కూర్చోబెట్టారు. గోవా విడిచి వెళ్లినా మనోహర్‌ దాన్ని తన చెప్పుచేతల్లోనేే వుంచుకోవాలనుకుంటున్నాడు. అందుకే ప్రతీ వారాంతం గోవాలో తన యింటికి వచ్చేసి, లక్ష్మీకాంత్‌ను ఫైళ్లతో సహా తన యింటికి రమ్మంటాడు. నిర్ణయాలన్నీ తను తీసుకుని అతన్ని ప్రకటించమంటాడు. ఈ లోపుగా ఎవరైనా అధికారులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ వచ్చి ఏమైనా అడిగితే లక్ష్మీకాంత్‌ 'సార్‌ను అడగాలి' అనో 'సార్‌ వచ్చినపుడు చెప్పిచూదాం' అనో జవాబులు యిస్తూ వుంటాడు. అతను స్వతంత్రంగా తీసుకున్న నిర్ణయం ఏదైనా వుందా అంటే ఒకటి కనబడుతోంది. ఫోరమ్‌ ఫర్‌ రైట్స్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ టు ఎడ్యుకేషన్‌ అనే సంస్థకు సంబంధించిన 40 మంది సభ్యులు తమ పిల్లలు మాతృభాషలో చదువుకునే అవకాశం వుండాలంటూ చేపట్టిన ఆందోళన సందర్భంగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే వారిపై కేసులు పెడతానని లక్ష్మీకాంత్‌ ప్రకటించాడు. కానీ మనోహర్‌ చెప్పడంతో ఆ ప్రకటనను వెనక్కి తీసుకున్నాడు. 2017లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గోవాలో పనాజీలో మే 23న ఏర్పాటు చేసిన సభలో ఆప్‌ నాయకుడు అరవింద్‌ అందుకే ''మనోహర్‌కి డిఫెన్సు వ్యవహారాల మీద కంటె గోవా మీదే ధ్యాస ఎక్కువ. ఇక్కడో కీలుబొమ్మను పెట్టి ప్రభుత్వం నడుపుతున్నాడు.'' అని విమర్శించాడు.

దాంతో ఎలాగోలా వార్తల్లోకి ఎక్కి, తనకంటూ వ్యక్తిత్వం వుందని కీలుబొమ్మను కానని నిరూపించుకోదలచాడు లక్ష్మీకాంత్‌. ''అరవింద్‌ మీటింగు ఎలా జరిగిందని, దాని ప్రభావం ఎలా వుంటుందని మోదీ నన్ను వాకబు చేశారు.'' అని ఓ స్టేటుమెంటు యిచ్చాడు. ఢిల్లీ వంటి అర్ధరాష్ట్రానికి ముఖ్యమంత్రి ఐన అరవింద్‌ గురించి ప్రధాని స్థాయిలో వున్న తను ఆలోచిస్తున్నానని, అతని మీటింగుల జయాపజాయాలను పట్టించుకుంటున్నానని యితర పార్టీలకు తెలియడం మోదీకి రుచించే విషయం కాదు. ఆంతరంగికంగా అడిగిన ప్రశ్నను లక్ష్మీకాంత్‌ యిలా బయటపెట్టడం అతని తెలివితక్కువను సూచిస్తుంది. దీనికి తోడు అతని కాబినెట్‌ సహచరుడిపై మోపిన కేసు అతనికి యిబ్బందిగా పరిణమించింది. 2009 ఏప్రిల్‌లో కర్ణాటక నుంచి వచ్చిన యిద్దరిని ఏవో కేసుల్లో కొటిగావ్‌ వైల్డ్‌లైఫ్‌ శాంక్చువరీ సీనియర్‌ ఫారెస్టు ఆఫీసరు సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు బిజెపి ఎమ్మెల్యే అయిన రమేశ్‌ తావడ్కర్‌ ఆ ఆఫీసుపై తన అనుచరులతో దాడి చేసి వాళ్లను విడిపించుకుని పోయాడు. అతనిపై పోలీసులు కేసు పెట్టారు. ఏడేళ్ల తర్వాత యిప్పుడు మేజిస్ట్రేటు ముందు చార్జిషీటు దాఖలు చేశారు. రమేశ్‌ యిప్పుడు లక్ష్మీకాంత్‌ కాబినెట్‌లో క్రీడామంత్రిగా వున్నాడు. అతనిపై వున్న కేసుల దృష్ట్యా అతన్ని మంత్రిగా తీసేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఆ డిమాండ్‌ను తోసిపుచ్చుతూ లక్ష్మీకాంత్‌ ''నేను రమేశ్‌ను అడిగాను. వాళ్లు గోవా వాళ్లు కూడా కాదు. కర్ణాటక వాళ్లు. చెక్‌పోస్టు దగ్గర పోలీసులు వాళ్లని చావగొట్టేస్తూ వుంటే రక్షించానని చెప్పాడు. నేను నమ్మాను.'' అన్నాడు.  

ఇటీవల ఆఫ్రికన్లపై దాడులు జరగడం వలన మన దేశం యిమేజికి భంగం వాటిల్లింది. మనకూ జాతివివక్షత వుందని యితర దేశాలు సందేహించేందుకు ఆస్కారం ఏర్పడింది. అలాటిది ఏమీ లేదని దేశ నాయకులందరూ డామేజి కంట్రోలు చేస్తున్న సమయంలో లక్ష్మీకాంత్‌ 'నైజీరియన్ల ప్రవర్తన పట్ల, వారి జీవనశైలి పట్ల, వారి స్వభావాల పట్ల గోవా ప్రజలు చికాకు (ఎన్నాయిడ్‌) పడుతున్నారు' అని ప్రకటన యిచ్చి బిజెపిని యిబ్బందిలో నెట్టాడు. రాజధానికి 20 కిమీ. ల దూరంలో వున్న ఆశాగాంవ్‌ గ్రామంలో 31 ఏళ్ల వనితను బలాత్కరించినందుకు ఒక నైజీరియన్‌ పోలీసులు అరెస్టు చేసిన సందర్భంలో ''అనేక సందర్భాల్లో స్థానిక ప్రజలు నైజీరియన్లపై ఫిర్యాదులు చేస్తున్నారు. అనేక దేశాల నుంచి గోవాకు వచ్చి పడుతున్న విదేశీయుల గురించి గోవా పౌరులకు ఒళ్లు మండుతోంది. అందరి కంటె ఎక్కువగా నైజీరియన్ల గురించి తరచుగా ఫిర్యాదులు వస్తున్నాయి.'' అన్నాడు. 2013 అక్టోబరులో గోవా డ్రగ్‌ మాఫియా చేతిలో ఒక నైజీరియన్‌ జాతీయుడు హత్యకు గురైనప్పుడు, పోలీసుల అలసత్వానికి నిరసనగా 50 మంది నైజీరియన్లు నేషనల్‌ హైవేను దిగ్బంధం చేశారు. వాళ్లను తొలగించడానికి ప్రయత్నించగా నైజీరియన్లు పోలీసులను, స్థానికులను చావగొట్టడం, వాళ్లంతా కలిసి నైజీరియన్లను చితక్కొట్టడం జరిగాయి. ఇప్పుడు యిది కూడా జరగడంతో ముఖ్యమంత్రి యిలాటి వ్యాఖ్య చేశాడు. వెంటనే గోవా టూరిజం మంత్రి దిలీప్‌ పరులేకర్‌ 'నైజీరియన్లను దేశం నుంచి పంపించివేసేందుకు కొత్త చట్టం వెంటనే చేయాల'ని డిమాండ్‌ చేశాడు. ఇలాటి ప్రకటనలకు అంతర్జాతీయంగా ప్రకంపనలు వస్తాయి. పైగా గోవాలో అక్టోబరులో బ్రిక్స్‌ (బ్రెజిల్‌, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ ఆఫ్రికా) దేశ ప్రతినిథుల సమావేశం జరగబోతోంది. ఇతర దేశాల నుంచి నిరసనలు వచ్చాయేమో తెలియదు కాని, ప్రకటన చేసిన పది రోజులకు కేంద్ర హోం మంత్రి లక్ష్మీకాంత్‌ని పిలిచి మందలించినట్లుంది. ఆయనతో సమావేశమై బయటకు రాగానే 'నైజీరియన్లతో సహా సకల విదేశీయులను గోవాకు ఆహ్వానిస్తున్నాం. వారి భద్రతకు ఏర్పాట్లు చేస్తాం' అని ప్రకటన యిచ్చాడు. బ్రిక్స్‌ సమావేశానికి 8 వేల మంది డెలిగేట్లు వస్తారని, వారికై ఎయిర్‌పోర్టు విస్తరిస్తామని, గోవాను టూరిస్టు డెస్టినేషన్‌గా ప్రమోట్‌ చేస్తామనీ కూడా ప్రకటించాడు.

లక్ష్మీకాంత్‌ బావమరిది దిలీప్‌ మాళవాంకర్‌ గోవా యిండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌లో ఫీల్డు మేనేజర్‌గా పనిచేస్తాడు. ఏడాది క్రితం యింకో అధికారితో కలిసి యిండస్ట్రియల్‌ ఎస్టేటులో ప్లాటు కేటాయింపుకై లక్ష రూ.ల లంచం పుచ్చుకున్న విషయం అవినీతి నిరోధక శాఖ దృష్టికి వచ్చి అతనిపై కేసు పెట్టి సస్పెండు చేయించారు. ఇప్పుడు అతన్ని ఉద్యోగంలో పునర్నియమించడానికై ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రతిపక్షం ఆరోపణలు చేస్తోంది. ఎసిబి అధికారులను, పోలీసు సూపరింటెండెంటును, బదిలీ చేయడం దాని కోసమే అని వారంటున్నారు. అవినీతి పట్ల బిజెపి ఉదాసీనత ఓటర్లను ఆశ్చర్యపరుస్తోంది. కాంగ్రెసు హయాంలో దిగంబర్‌ కామత్‌ ముఖ్యమంత్రిగా వుండగా మైనింగ్‌ స్కాము జరిగింది. దాని విలువ ఎంత అనేది యింతా తెలియటం లేదు. 16 వేల కోట్ల నుంచి 35 వేల కోట్ల దాకా అన్ని అంకెలూ వినబడుతున్నాయి. ఎన్నికల సమయంలో దాన్ని ప్రధానాంశం చేసుకుని బిజెపి 28 సీట్లలో 21 సీట్లు గెలుచుకుంది. దాని భాగస్వామి మహారాష్ట్ర గోమంతక్‌ పార్టీ (ఎంజిపి) 7 పోటీ చేసి 3 గెలిచింది. మైనింగ్‌ స్కామ్‌లో నిందితులను పట్టుకుంటామని, శిక్షిస్తామని ప్రతిన చేసి అధికారంలోకి వచ్చిన బిజెపి యిప్పటిదాకా ఎవర్నీ అరెస్టు చేయించలేదు. సాంకేతిక కారణాలేమైనా యిది ఓటర్లకు మింగుడు పడలేదు. పైగా మనోహర్‌ నవంబరు 2014లో మాట్లాడుతూ ఆ స్కాము వలన ప్రభుత్వానికి కలిగిన నష్టాన్ని చాలా పెంచి చూపించారని వాదించాడు. అంతేకాదు కొత్త ముఖ్యమంత్రి 2015 మార్చిలో మైనింగ్‌పై నిషేధాన్ని ఎత్తివేశాడు కూడా. ఇవన్నీ మధ్యతరగతి ప్రజలలో అసంతృప్తి కలిగిస్తున్నాయి. వారి మరో ఫిర్యాదు ఏమిటంటే మాండోవి నదీతీరాన వున్న నాలుగు కేసినోలను వేరే చోటకి తరలిస్తామని చెప్పిన ప్రభుత్వం తరలించకపోగా యీ మార్చిలో వాటికి ఏడాది గడువు పెంచింది. పైగా మరో కాసినో తెరిచేందుకు అనుమతి యిచ్చింది. గోవాలో చిన్న తరహా మత్స్యకారులు ఎక్కువ. పెద్ద కంపెనీల వాళ్లు ఎల్‌ఇడి లైట్లతో, ట్రాలింగ్‌తో తమ వ్యాపారానికి దెబ్బ కొడుతున్నారని వారు మొత్తుకుంటున్నారు. అయినా వారికి ఏ సహాయమూ అందలేదు. 

ఆరెస్సెస్‌ వారికీ బిజెపిపై ఒక విషయంలో చాలా కోపం వుంది. 2011 జూన్‌లో కాంగ్రెసు ముఖ్యమంత్రి దిగంబర్‌ కామత్‌ చర్చిలు నడిపే 136 ఇంగ్లీషు మీడియం స్కూళ్లకు ఆర్థికసాయం అందించడానికి నిర్ణయించాడు. అది గోవా ఆరెస్సెస్‌ అధినేత సుభాష్‌ వెళింగ్‌కర్‌ను మండించింది. కోర్టులో పిటిషన్‌ వేశాడు. తాము వస్తే దీన్ని తీసేస్తామని బిజెపి మానిఫెస్టోలో పెట్టి 2012లో అధికారంలోకి వచ్చింది. అయినా పాలసీ మారలేదు. మనోహర్‌ సుభాష్‌ను పిలిచి పిటిషన్‌ ఉపసంహరించుకోండి, ప్రభుత్వం దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోబోతోంది అని చెప్పాడు. సుభాష్‌ విత్‌డ్రా చేసుకున్నాడు. అలా రెండేళ్లు మాటలతో కాలక్షేపం చేసి చివరకు తను కేంద్రమంత్రిగా వెళ్లబోతూ ఆ స్కూళ్లకిచ్చే గ్రాంట్లను కొనసాగిస్తూ ఆర్డరు పాస్‌ చేసి మనోహర్‌ వెళ్లిపోయాడు. గోవాలో కాథలిక్‌ ఓటర్ల సంఖ్య గణనీయంగా వుంది కాబట్టి, వారిని వ్యతిరేకం చేసుకోవడం మనోహర్‌కు యిష్టం లేదు. అతని ఉపముఖ్యమంత్రి కూడా కాథలిక్కే. కానీ ఆరెస్సెస్‌కు అలాటి మొహమాటాలు లేవు కాబట్టి 'మీరైనా ఆ గ్రాంట్‌ ఆపించండి' అని లక్ష్మీకాంత్‌ను అడుగుతోంది. అతనూ మాట్లాడడం లేదు. దాంతో సుభాష్‌ 'భారతీయ భాషా సురక్షా మంచ్‌' (బిబిఎస్‌ఎమ్‌) అనే సంస్థ ఏర్పాటు చేసి మే 21 న 3 వేల మందితో సభ నిర్వహించాడు. ఇంగ్లీషు మీడియం కారణంగా భారతీయ భాషలకు విఘాతం కలుగుతోందని, ఇంగ్లీషు స్థానంలో కొంకణి ప్రవేశపెట్టాలని వారి డిమాండు. ఆ సంస్థ బలపడితే ఉత్తర గోవాలో బిజెపి ఏడెనిమిది స్థానాలకు గండం ఏర్పడుతుందని అంచనా. దక్షిణ గోవాలో కాంగ్రెసు బలంగా వుంది. 2012 ఎన్నికలలో కాంగ్రెసుకి 9 సీట్లు మాత్రమే వచ్చినా బిజెపి కంటె 0.6% తక్కువ ఓట్లు, అంటే 34.9% వచ్చాయి.  ప్రస్తుతం కాంగ్రెసు వ్యవస్థాపరంగా దిక్కుతోచక నీరసించి వుంది కాబట్టి దాని స్థానాన్ని భర్తీ చేద్దామని ఆప్‌ ఉవ్విళ్లూరుతోంది. పరిస్థితులు గమనించిన గోవా బిజెపి ముంబయిలో రెండు రోజుల ఆత్మవిమర్శనా సదస్సు నిర్వహించింది. దిద్దుబాటు చర్యలు  ఎలా వుంటాయో వేచి చూడాలి.

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జూన్‌ 2016)

mbsprasad@gmail.com

Show comments