కోదండ.. ఇదిగో 'నెత్తిన' బండ.!

మహాకూటమి కన్వీనర్‌గా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌కి బాధ్యతలు అప్పగించేశారు. దీన్ని బాధ్యతగా కాకుండా, 'బరువు'గా అభివర్ణించడం సబబేమో. నిజంగానే ఇది చాలా పెద్ద 'బరువు'. పార్టీని మోయడమే కోదండరామ్‌కి చాలా కష్టమైన విషయం. ప్రత్యేక పరిస్థితుల్లో తెలంగాణ జేఏసీ నుంచి బయటకొచ్చి, తెలంగాణ జన సమితి అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాల్సి వచ్చింది కోదండరామ్‌కి. పార్టీ నడపడం ఎంతకష్టమో కొద్ది రోజుల్లోనే ఆయనకు అర్థమయిపోయింది.

2014 ఎన్నికలకు ముందు కోదండరామ్‌ వేరు, 2014 ఎన్నికల తర్వాత కోదండరామ్‌ వేరు. అంతకు ముందు ఆయన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కి అత్యంత సన్నిహితుడు. ఆ తర్వాత కేసీఆర్‌కి శతృవుగా కోదండరామ్‌ మారిపోయారు. కోదండరామ్‌ని ముందుపెట్టి, కాంగ్రెస్‌తోపాటు తెలుగుదేశం పార్టీ ఆడిన పొలిటికల్‌ గేమ్‌ అందరికీ తెల్సిందే. తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌గా వుంటూనే, కాంగ్రెస్‌.. టీడీపీలతో కలిసి కోదండరామ్‌ పలు రాజకీయ ఆందోళనలు 'ఉద్యమ పంధాలో' చేపట్టాల్సి వచ్చింది.

గతాన్ని పక్కన పెడితే, ఇప్పుడు మహా కూటమికి ఆయనే కన్వీనర్‌. ఎన్నికల తర్వాత కూడా, కోదండరామ్‌నే కన్వీనర్‌గా కొనసాగిస్తామని కాంగ్రెస్‌, టీడీపీ తీర్మానించేశాయి. అంటే, కోదండరామ్‌ పని ఏంటన్నది ఇప్పుడే డిసైడ్‌ చేసేశాయన్నమాట ఆ రెండు పార్టీలూ. తెలంగాణ జన సమితి బాధ్యతల్ని చూసుకునేందుకు ఇకపై కోదండరామ్‌కి పెద్దగా సమయం వుండదు.

కాంగ్రెస్‌, టీడీపీ నేతృత్వంలోని మహాకూటమికి సంబంధించిన వ్యవహారాల్ని కోదండరామ్‌ చక్కబెట్టాల్సి వుంటుంది. ఈ కూటమిలోనే జన సమితి వున్నా.. ఆ జనసమితి పాత్ర చాలా తక్కువ కాబోతోంది. కోదండరామ్‌ రాజకీయాలకు కొత్త. ఆయన్ని 'ఉత్సవ విగ్రహంగా' చూపించి, కాంగ్రెస్‌ - టీడీపీ తెలంగాణలో రాజకీయాలు చేయబోతున్నాయన్నమాట.

నిన్న మొన్నటిదాకా 'కోదండరామ్‌ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకపోలేదు' అంటూ కాంగ్రెస్‌, టీడీపీ లీకులు ఇచ్చాయి. ఇప్పుడీ కన్వీనర్‌ పదవితో, కోదండరామ్‌ని ఓ మూలన కూర్చోబెట్టేసినట్లేనన్న అభిప్రాయాలు అంతటా వ్యక్తమవుతున్నాయి.

కోదండరామ్‌ పూర్తిగా కాంగ్రెస్‌, టీడీపీ ట్రాప్‌లో పడిపోయారనీ, ఈ ఎన్నికల తర్వాత కోదండరామ్‌ ఉనికి తెలంగాణ తెరపై ఏమాత్రం కన్పించదనీ గులాబీ శ్రేణులు ఆయన మీద 'జాలి' పడుతూనే, జోస్యం చెబుతున్నాయి.  

టీడీపీలోకి పంపి.. ఎమ్మెల్సీ సీట్లను కొనిచ్చిన చరిత్ర ఆయనది.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

Show comments